కరోనా కరాళ నృత్యం

207 Coronavirus Cases File in Prakasam - Sakshi

తాజాగా 18 కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ

ఒంగోలు గాంధీరోడ్డు, చీరాల జయంతి పేట లాక్‌డౌన్‌

ఇప్పటి వరకు కరోనాతో ముగ్గురు మృతి

దర్శిలో ఓ పోలీసు అధికారికి కరోనా పాజిటివ్‌

జిల్లాలో 207కు చేరిన పాజిటివ్‌ కేసులు

ఒంగోలు సెంట్రల్‌: జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రజలు కనీస జాగ్రత్తలు పాటించకపోతుండటంతో రోజు, రోజుకూ కోవిడ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. మంగళవారం ఒక్క రోజే 18 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 207కు చేరుకుంది. వీరిలో ఒంగోలు వీఆర్‌డీఎల్‌ పరీక్షల్లో ఆరుగురు, గుంటూరు వీఆర్‌డీఎల్‌ పరీక్షల్లో ఒకరు, ట్రూనాట్‌ పరీక్షల్లో 11 మందికి పాజిటివ్‌గా నిర్ధారించారు. దర్శికి చెందిన ఓ పోలీసు అధికారి నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతూ ఇంట్లోనే ఉన్నాడు. ఆయన ఇటీవల గుంటూరు నుంచి దర్శికి వచ్చాడు. అనుమానంతో కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఉలవపాడు మండలం చాకిచర్లకు చెందిన 60 సంవత్సరాల వృద్ధురాలికి ఈ నెల 9వ తేదీ పరీక్షించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పామూరు మండలం రావిగుంటపల్లికి చెందిన 17 సంవత్సరాల యువకుడు ఈ నెల 9వ తేదీ చెన్నై నుంచి ప్రకాశం జిల్లాకు వచ్చాడు. అనారోగ్యంగా ఉండటంతో పరీక్షించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

యద్దనపూడి మండలం చింతపల్లిపాడుకు చెందిన 40 సంవత్సరాల మహిళకు ఈ నెల 15న పరీక్షించగా పాజిటివ్‌గా తేలింది. ఇదే గ్రామానికి చెందిన 12 సంవత్సరాల బాలికకు పాజిటివ్‌గా నిర్ధారించారు. మార్కాపురానికి చెందిన 47 సంవత్సరాల వ్యక్తి ఈ నెలలో వివాహ సంబంధ కార్యక్రమాలపై విజయవాడకు వెళ్లి తిరిగి ఈ నెల 15న జిల్లాకు వచ్చాడు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటంతో అధికారులు పరీక్షించగా పాజిటివ్‌గా నిర్ధారించారు. వీరందరికీ వీఆర్‌డీఎల్‌ పరీక్షల ద్వారా కోవిడ్‌ను నిర్ధారించారు. ఒంగోలు మంగమూరుడొంకకు చెందిన 38 సంవత్సరాల మహిళను ఈ నెల 15వ తేదీ ట్రూనాట్‌ పరీక్ష చేయగా పాజిటివ్‌గా తేలింది. 

చీరాలలో 11 కేసులు:  చీరాలకు చెందిన ఏడుగురు పురుషులకు, ఇద్దరు స్త్రీలకు ఈనెల 15న కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారించారు. 38 ఏళ్ల మరో వ్యక్తికి గుంటూరులో వీఆర్‌డీఎల్‌ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. చీరాల జయంతిపేటకు చెందిన 13 ఏళ్ల బాలుడికి కరోనా సోకింది.

ఒక్క చీరాలలోనే 28 పాజిటివ్‌ కేసులు
ఒక్క చీరాల, పేరాల ప్రాంతాలలోనే ఇప్పటి వరకూ 28 పాజి టివ్‌ కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఒక్క రోజే 10కి పైగా కేసులు నమోదవడంతో పాటూ, మరి కొన్ని అనుమా నిత కేసులు ఉండటంతో అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. చీరాలలో పూర్తి స్థాయిలో లాక్‌డౌన్‌ విధించారు.

కరోనాతో ముగ్గురు మృతి
సంతనూతలపాడు మండలం గుమ్మనంపాడుకు చెందిన 52 ఏళ్ల వ్యక్తి కరోనా సోకి నెల్లూరులో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతిచెందాడు. మృతదేహానికి అక్కడే అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. ఇప్పటికే టంగుటూరు మండలానికి చెందిన ఓ మహిళ క్యాన్సర్‌తో చెన్నైలో చికిత్స పొందుతూ అక్కడ కరోనా వైరస్‌ సోకి వారం క్రితం మృతిచెందింది. పామూరు మండలానికి చెందిన 35 ఏళ్ల మహిళ గుండె జబ్బుతో గుంటూరులో చికిత్స పొందుతుండగా అక్కడ కరోనా సోకి రెండు రోజుల క్రితం మృతిచెందింది. 

తీవ్ర స్థాయిలో కోవిడ్‌ 19 వైరస్‌
జిల్లాలో కోవిడ్‌ 19 వైరస్‌ తీవ్ర స్థాయిలో ఉందని, జిల్లా కోవిడ్‌ నోడల్‌ అధికారి డాక్టర్‌ ఎల్‌.జాన్‌ రిచర్డ్స్‌ తెలిపారు. ఇతర ప్రాంతాలు ముఖ్యంగా చెన్నై, పూణె, హైదరాబాద్‌ నుంచి వచ్చిన వైరస్‌ గతంలో ఉన్న వైరస్‌ కంటే తీవ్ర స్థాయిలో ఉందన్నారు. గతంలో జిల్లాలో వైరస్‌ బారిన పడిన వారు తీవ్ర స్థాయి అనారోగ్యానికి గురి కాలేదని, చికిత్సకు బాగా స్పందించే వారన్నారు. అయితే ప్రస్తుతం కోవిడ్‌ పాజిటివ్‌ వ్యక్తులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. – డాక్టర్‌ జాన్‌ రిచర్డ్స్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top