దివిసీమలో గాలివాన బీభత్సం

85 Millimeters Rain Fall Was In Krishna District - Sakshi

సాక్షి, అవనిగడ్డ(కృష్ణా) : దివిసీమలో గాలివాన బీభత్సం సృష్టించింది. సోమవారం తెల్లవారు జామున ఉదయం 3గంటల నుంచి 5గంటల వరకు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. బందలాయి చెరువు ఎస్సీ కాలనీలో మూడు చోట్ల భారీ చెట్లు పడిపోవడంతో విద్యుత్‌ తీగలు తెగిపోయాయి. తోకల మోహన్‌కుమార్, దేసు శ్రీనివాసరావుకు చెందిన రెండు బడ్డీలపై భారీ వేపచెట్టు పడటంతో బడ్డీలు ధ్వంసమయ్యాయి. పలు సామాన్లు దెబ్బతిన్నాయి. భారీ వృక్షాలు రహదారికి అడ్డుగా పడిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

నీటమునిగిన కార్యాలయాలు, పాఠశాలలు..
అవనిగడ్డలో 85 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. 70 నుంచి 80 కి.మీ వేగంతో వీచిన ఈదురు గాలులు వీచాయి. అవనిగడ్డలో తహసీల్దార్‌ కార్యాలయం, సబ్‌ ట్రెజరీ, ఆర్‌అండ్‌బీ అతిథిగృహం, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, శిశువిద్యామందిరం స్కూల్‌ ఆవరణంతా వర్షం నీటితో నిండిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

వణికించిన ఈదురుగాలులు
కోడూరు(అవనిగడ్డ): దివిసీమ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి వేళ ఈదురుగాలులతో కూడిన వర్షం వణికించింది. గాలుల ప్రభావానికి మండలంలోని అనేక ప్రాంతాల్లో భారీ వృక్షాలు నెలకొరిగాయి. కృష్ణాపురం, నరసింహపురం, వి.కొత్తపాలెం, బైపాస్‌ రోడ్డు, పిట్టల్లంక, రామకృష్ణాపురం, మందపాకల గ్రామాల్లో చెట్లు రోడ్డుకు అడ్డుగా కూలాయి. మండల కేంద్రంలోని అంబటి బ్రహ్మణ్య కాలనీ, మెరకగౌడపాలెం ప్రాంతాల్లో వర్షం నీరు ఇళ్లల్లోకి చేరగా నివాసులు ఇబ్బందులు పడ్డారు. అనేకచోట్ల విద్యుత్‌వైర్లపై చెట్ల పడడంతో సాయంత్రం వరకు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 

యుద్ధప్రాతిపదికన మరమ్మతులు
విద్యుత్‌తీగలు తెగిపోవడంతో విద్యుత్‌శాఖ యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టింది. అవనిగడ్డ మండల పరిధిలో మొత్తం 28 చోట్ల చెట్లు పడి, గాలికి కరెంట్‌ వైర్లు తెగిపోయాయి. మండల పరిధిలోని పులిగడ్డ పెట్రోల్‌ బంక్‌ సమీపంలో ట్రాన్స్‌ ఫార్మర్‌ ఉన్న విద్యుత్‌ స్తంభం పడిపోయింది. అప్పటికే విద్యుత్‌ సరఫరా నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. విద్యుత్‌ డీఈ ఉదయభాస్కర్‌ ఆదేశాల మేరకు ఏఈ ఎఎన్‌ఎం రాజు ఉదయం 5 గంటల నుంచే సిబ్బంది మరమ్మతులు చేపట్టి విద్యుత్‌ను పునరుద్దరించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top