సైనికుల ఎంపిక షురూ..!

Army Recruitment Rally Begins In Prakasam District - Sakshi

ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ ప్రారంభం

తొలిరోజు చిత్తూరు, అనంతపురం జిల్లాలకు చెందిన అభ్యర్థులు హాజరు

అభ్యర్థులతో మాట్లాడిన జేసీ–2 డాక్టర్‌ సిరి

దళారీలపై పోలీసుశాఖ ప్రత్యేక నిఘా

సాక్షి, ఒంగోలు: స్థానిక పోలీస్‌ పరేడ్‌ గ్రౌండులో శుక్రవారం ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ ప్రారంభమైంది. మొత్తం ఏడు జిల్లాల అభ్యర్థులకు ఈ నెల 15వ తేదీ వరకు ఈ ఎంపిక ప్రక్రియ జరగనుంది. ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల నుంచి మొత్తం 28,200 మందికిపైగా దరఖాస్తు చేసుకోగా, తొలిరోజు చిత్తూరు, అనంతపురం జిల్లాలకు చెందిన అభ్యర్థులతో ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు. ఆయా జిల్లాల నుంచి 3,400 మంది దరఖాస్తు చేసుకోగా, 2,470 మంది హాజరయ్యారు. వీరంతా గురువారం రాత్రే ఒంగో లు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం నాలుగు గంటలకే వారికి బ్యాడ్జీ నంబర్లు కేటాయిస్తూ పరేడ్‌ గ్రౌండ్‌లోకి ఆహ్వానించారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం శారీరక కొలతలైన ఎత్తు, బరువు, ఛాతి విస్తీర్ణం తదితర పరీక్షలు నిర్వహించారు. అనంతరం 1.6 కిలోమీటర్ల పరుగు పరీక్ష, 9 అడుగుల గొయ్యి దూకడం, 6 కంటే ఎక్కువ పుల్‌ఆప్స్‌ తీయడం, జిగ్‌జాగ్‌ బ్యాలెన్స్‌ వంటి వాటిలో ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేశారు. వీరికి శనివారం మెడికల్‌ టెస్టు నిర్వహించనున్నారు.

కొనసాగుతున్న నిఘా...
ఒక వైపు ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ జరుగుతుండగా, మరోవైపు వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన వారు అభ్యర్థులకు తమ ప్రచార పత్రాలను ఇస్తున్నారు. దీంతో పోలీసులు వారిపై నిఘా పెట్టారు. వారిలో కొంతమందిని లోపలకు పిలిపించి వివరాలు సేకరించారు. ఎందుకు వచ్చారని అడిగి తెలుసుకుని వారి మొబైల్‌ నంబర్లు, ఇతర వివరాలు నమోదు చేసుకున్నారు. దళారులపై అనుమానంతో పోలీసులు నిఘా ఉంచారు. అభ్యర్థులను ఏమాత్రం ప్రలోభాలకు గురిచేసినా చట్టబద్ధమైన చర్యలు తప్పవంటూ వారిని హెచ్చరించి పంపించి వేశారు. 

అభ్యర్థులతో మాట్లాడి ధైర్యం నింపిన జేసీ–2 సిరి...
ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌–2 డాక్టర్‌ సిరి సందర్శించారు. ఈ సందర్భంగా అభ్యర్థులతో మాట్లాడి వారిలో ధైర్యాన్ని నింపారు. రిక్రూట్‌మెంట్‌లో పారదర్శకత ఉంటుందని, ఎటువంటి అపోహలకు తావులేదని స్పష్టం చేశారు. దళారులు ఎవరైనా మభ్యపెడుతున్నట్లు గుర్తిస్తే తక్షణమే పోలీసు డిపార్ట్‌మెంట్‌ దృష్టికి తీసుకురావాలని సూచించారు. దేశభద్రతకు సైనికులు ఎలా పనిచేస్తారో.. అలాగే సమాజంలోని అసాంఘిక శక్తుల్ని తుదముట్టించేందుకు కూడా సైన్యంలో చేరాలనుకునే వారు పనిచేయాలని సూచించారు. అనంతరం మీడియాతో జేసీ–2 సిరి మాట్లాడుతూ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలో రోజుకు 3,500 నుంచి 4 వేల మంది అభ్యర్థులకు ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

మెడికల్‌ చెకప్‌కు ఎంపికైన వారికి మరుసటి రోజు చేస్తారన్నారు. ఆర్మీ నుంచి 7 బృందాల డాక్టర్లు వచ్చారని, అభ్యర్థులకు మెడికల్‌ చెకప్‌ను వారే నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఈ ఏడు బృందాలు రోజుకు 280 మందికి మాత్రమే వైద్య పరీక్షలు నిర్వహిస్తాయని, మిగిలిన వారికి ఆ మరుసటి రోజు మెడికల్‌ చెకప్‌లు చేస్తారని, అప్పటి వరకు వారికి కలెక్టర్‌ భాస్కర్‌ ఆదేశాల మేరకు స్థానిక డాన్‌బాస్కో స్కూల్‌లో వసతి కల్పించామని తెలిపారు. రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ జరుగుతున్న పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో అభ్యర్థుల కోసం మెప్మా ఆధ్వర్యంలో ఒకటి, డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో రెండు క్యాంటీన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. నగరపాలక సంస్థ మంచినీటి సౌకర్యాన్ని కల్పించిందన్నారు.

తొలిరోజు రిక్రూట్‌మెంట్‌కు వాతావరణం కూడా అనుకూలించిందన్నారు. ఈ ర్యాలీలో దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, గుండె జబ్బులు ఉన్న వారు హాజరుకాకూడదని, ఆ మేరకు ముందస్తు సూచనలు చేశామని తెలిపారు. అయితే, వాటి గురించి తెలుసుకోని వారు ఎవరైనా హాజరై అస్వస్థతకు గురైతే వారికి తక్షణ వైద్యంఅందించేందుకు రెండు అంబులెన్స్‌లు, ఇద్దరు రిమ్స్‌ వైద్యులను కూడా అందుబాటులో ఉంచామన్నారు. దళారులను ఎవరూ నమ్మవద్దని, ఎవరైనా అటువంటి వ్యక్తులు తారసపడితే మీడియా కూడా పోలీసుశాఖకు సమాచారం అందించాలని కోరారు. ఎంపిక ప్రక్రియను మిలటరీ అధికారులతో పాటు స్టెప్‌ ఇన్‌చార్జి సీఈవో నరసింహారావు పర్యవేక్షిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top