సీఎం సహాయ నిధిలో..సొమ్ముల్లేవు!

Bankers deny the funding of the CMRF account - Sakshi

ఒక్క అమరావతి మండలంలోనే 15 చెక్కులు బౌన్స్‌

సీఎంఆర్‌ఎఫ్‌ ఖాతాలో నిధుల్లేవంటూ బ్యాంకర్ల తిరస్కరణ

లబ్ధిదారుడికి ఇవ్వాల్సిన చెక్కులను టీడీపీ నేతలకు పంపుతున్న అధికారులు 

నెలరోజులు వారి వద్ద పెట్టుకుని ఎన్నికల ముందు అందించిన తమ్ముళ్లు

ఎన్నికలు ముగిశాక డబ్బు లేదంటున్నారని లబ్ధిదారుల ఆవేదన

అమరావతి: వైద్యం చేయించుకోలేక అవస్థలు పడుతున్న నిరుపేదలను ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌)కి నిధుల కొరత ఏర్పడింది. డబ్బులు లేవంటూ బ్యాంకు అధికారులు తిరకాసు పెడుతుండడంతో లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రే ఇలా చేస్తే ఎవరికి చెప్పుకోవాలంటూ బోరుమంటున్నారు. ఒక్క గుంటూరు జిల్లా అమరావతి మండలంలోనే ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 15 సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు బౌన్స్‌ అయ్యాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. సాధారణంగా ఖాతాలో డబ్బుల్లేకుండా చెక్కులిస్తే చెక్కు బౌన్స్‌ కేసు పెట్టి జైలుకు పంపుతారు. అలాంటిది సాక్షాత్తు ముఖ్యమంత్రి పేరుతో వచ్చే చెక్కులే బౌన్స్‌ అయితే ఎవరిపై చర్యలు తీసుకోవాలనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇలాగే పలు ప్రాంతాల్లో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు బౌన్స్‌ అవుతున్నట్లు సమాచారం. వివరాలివీ..

అమరావతి మండల కేంద్రంలోని మద్దూరు రోడ్డులో నివాసం ఉంటున్న చౌటా నాగేశ్వరరావు కుమారుడు చౌతా వెంకట నాగసాయి లోకేష్‌కు రెండు నెలల క్రితం ఇరవై నాలుగు గంటల కడుపునొప్పి రావటంతో శస్త్ర చికిత్స చేయాలని నిర్ణయించారు. నాగేశ్వరరావుకి స్థోమత లేకపోవడంతో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో ప్రభుత్వం సీఎంఅర్‌ఎఫ్‌ నుంచి రూ.20,910లు మంజూరు చేసి చెక్కును మార్చి 8న వెలగపూడి సచివాలయం నుండి పంపించింది. సీఎంఆర్‌ఎఫ్‌ విడుదల చేసే చెక్కులు తహశీల్దారు నుంచి నేరుగా లబ్ధిదారులకు అందాల్సి ఉండగా, అమరావతి మండలంలో మాత్రం అవి స్థానిక అధికార పార్టీ నేతల చేతికి చేరాయి.

అలా మండలంలో వచ్చిన చెక్కులన్నింటినీ సుమారు నెలరోజులపాటు తమ వద్ద పెట్టుకున్న టీడీపీ నేతలు.. సరిగ్గా ఎన్నికలకు రెండ్రోజుల ముందు బాధితుడు నాగేశ్వరరావు చేతికిచ్చారు. అనంతరం నగదు కోసం బ్యాంకులో చెక్కును డిపాజిట్‌ చేయగా పది రోజుల తర్వాత బ్యాంకు ఖాతాలో నగదులేదని అధికారులు చెప్పి చెక్కును నాగేశ్వరరావుకు ఇచ్చేశారు. ఇదిలా ఉంటే.. టీడీపీ నేతలు బాధితునికి సాయం అందించే విషయంలోనూ రాజకీయంగా ఆలోచించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు.. అమరావతి మండలంలో ఇలాగే సుమారు పదిహేను మందికి ఇచ్చిన చెక్కులు బౌన్స్‌ కావడంతో బాధితులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top