ఏపీలో పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌కు కేంద్రం రెడీ, కానీ.. 

Central Government Ready For Build Petrochemical Complex In AP - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘ఆంధ్ర ప్రదేశ్‌లో గ్రీన్‌ఫీల్డ్‌ రిఫైనరీ, పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటుకు కేంద్రంగా సిద్ధంగా ఉంది. అయితే రాయితీ ధరలకు నీరు, విద్యుత్తు వంటి ప్రోత్సాహకాలతోపాటు సుమారు రూ. 5 వేల కోట్ల వరకు వయబులిటీ గ్యాప్‌ ఫండింగ్‌ (వీజీఎఫ్‌) సమకూర్చడంతోపాటు అవసరమైన అనుమతులు పొందడంలో సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే ఈ ప్రాజెక్ట్‌ సాకారమవుతుంది’ అని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ స్పష్టం చేశారు.

 రాజ్యసభలో వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వక జవాబు ఇస్తూ ఆంధ్ర ప్రదేశ్‌ విభజన చట్టంలో పొందుపరిచిన హామీ ప్రకారం ఏడాదికి 1.7 మిలియన్‌ టన్నుల ఉత్పాదక శక్తి గల పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌పై 2017లోనే డీపీఆర్‌ను సిద్ధం చేసినట్లు చెప్పారు. తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించి ఆర్థిక మదింపు అధ్యయనం కూడా పూర్తయిందన్నారు. ప్రాజెక్ట్‌ మొత్తం వ్యయం 32 వేల 901 కోట్లు అవుతుందని మంత్రి తెలిపారు. రిఫైనరీ, పెట్రోకెమికల్‌ ప్రాజెక్ట్‌కు భారీ పెట్టుబడులు అవసరమని తెలిపారు. గతంలో ఇలాంటి ప్రాజెక్ట్‌లకు ఆయా రాష్ట్రాలే నీరు, విద్యుత్‌పై రాయితీలు ఇచ్చేవని చెప్పారు.

చట్టంపరంగా పొందాల్సిన అనుమతులు రాబట్టడంలో సహకరించేవని, అలాగే వయబులిటీ గ్యాప్‌ ఫండింగ్‌ (వీజీఎఫ్‌)ను కూడా సమకూర్చేవని మంత్రి తెలిపారు. ఈ అంశాలపై గతంలోనే ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వంతో చర్చించినట్లు చెప్పారు. ‘ఈ తరహా భారీ ప్రాజెక్ట్‌ ఏర్పాటుతో పారిశ్రామికంగా రాష్ట్రం ముందడుగు వేస్తుంది. రాష్ట్ర ఆర్థిక రంగంపై ప్రత్యక్షంగాను, పరోక్షంగాను దీని ప్రభావం గణనీయంగా ఉంటుంది. పారిశ్రామీకీకరణ వేగవంతం కావడంతో ప్రజల ఆదాయ వనరులు పుష్కలంగా పెరుగుతాయి. ఉపాధి అవకాశాలు దండిగా లభిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కూడా వృద్ధి చెందుతుంది’ అని మంత్రి వివరించారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని తగిన నిర్ణయం తీసుకుంటే రిఫైనరీ, పెట్రోకెమికల్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా ఉన్నట్లు ధర్మేంద్ర ప్రధాన్‌ స్పష్టం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top