ఖరీఫ్‌కు ఐదు కొత్త వరి వంగడాలు

Five new Rice varieties for Kharif - Sakshi

సిఫార్సు చేసిన వ్యవసాయ వర్సిటీ 

జోన్ల వారీగా రకాలను సూచించిన పరిశోధన స్థానం

సాక్షి, అమరావతి: ఖరీఫ్‌లో సాగు చేసేందుకు ఐదు కొత్త వరి వంగడాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు సిఫార్సు చేశారు. రాష్ట్ర పరిశోధనా కేంద్రాల నుంచి ఇటీవల కాలంలో 13 రకాల కొత్త వంగడాలను విడుదల చేసినప్పటికీ.. రాష్ట్రంలో సాగు చేసేందుకు ఆరు రకాలు మాత్రమే పనికొస్తాయని అంచనా వేసినట్టు విశ్వవిద్యాలయ పరిశోధనా సంచాలకులు డాక్టర్‌ ఏఎస్‌ రావు ‘సాక్షి’కి చెప్పారు.

రాష్ట్రంలో పనికొచ్చేవి ఐదు
► రాష్ట్ర పరిధిలో పండించేందుకు ఐదు వరి వంగడాలతోపాటు ఒకటి జొన్న వంగడం.
► వరికి సంబంధించిన ఐదు రకాల్లో ఎంటీయూ–1224 (మార్టేరు సాంబ), ఎంటీయూ–1262 (మార్టేరు మసూరి), ఎంటీయూ–1210 (సుజాత), బీపీటీ–2595 (తేజ), ఎన్‌ఎల్‌ఆర్‌–3354 (నెల్లూరు ధాన్యరాశి) ఉన్నాయి.
► జొన్నకు సంబంధించి వీఆర్‌–988 (సువర్ణ ముఖి) కొత్త వంగడం విడుదలైంది.
► దేశ పరిధిలో విడుదల చేసిన వాటిలో వరికి సంబంధించి ఎంటీయూ–1223 (వర్ష), ఎంటీయూ–1239 (శ్రావణి).. గోగు పంటకు సంబంధించి ఏఎంయూ–8, ఏఎంయూ–9 (ఆదిత్య), జొన్నకు సంబంధించి వీఆర్‌–929 (వేగవతి), సజ్జకు సంబంధించి ఏబీవీ–04, పత్తికి సంబంధించి ఎల్‌డీహెచ్‌పీ ఉన్నాయి.
► ఈ ఖరీఫ్‌లో కృష్ణా జోన్‌లోని రైతులు ఎంటీయూ–1061 (ఇంద్ర), బీపీటీ–5204, 2270 (భావపురి సన్నాలు), ఎంటీయూ–1075 రకాలను ఎంపిక చేసుకోవచ్చు. కొత్తగా విడుదలైన ఎంటీయూ–1224 ఎంటీయూ–1262 కూడా సాగు చేసుకోవచ్చు.
► గోదావరి జోన్‌లోని రైతులు స్వర్ణ, ఇంద్ర, ఎంటీయూ–1064, పీఎల్‌ఏ–1100, కొత్తగా విడుదలైన ఎంటీయూ–1262, 1224 రకాలను కూడా సాగు చేసుకోవచ్చు.
► ఉత్తర కోస్తా రైతులు స్వర్ణ, శ్రీకాకుళం సన్నాలు, బీపీటీ–5204, ఎంటీయూ–1075, శ్రీధృతితో పాటు కొత్తగా విడుదలైన ఎంటీయూ–1224, ఎంటీయూ–1210 రకాలను ఎంపిక చేసుకోవచ్చు.
► దక్షిణ మండలంలో (సౌత్‌ జోన్‌) ఎన్‌ఎల్‌ఆర్‌–3354, 33892తో పాటు కొత్తదైన ఎన్‌ఎల్‌ఆర్‌–4001, ఎంటీయూ–1224 అనువైనవి.
► తక్కువ వర్షపాత ప్రాంతాల్లో బీపీటీ–5204, ఎన్‌డీఎల్‌ఆర్‌–7, 8తో పాటు కొత్తవైన ఎంటీయూ–1224, బీపీటీ–2782 రకాలను సాగు చేసుకోవచ్చు.
► గిరిజన మండలాలలో స్వల్పకాలిక రకాలైన ఎంటీయూ–1153, 1156 అనువైనవి.
► ముంపు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పీఎల్‌ఏ–1100, ఎంటీయూ–1064 (అమర), ఎంటీయూ–1140 (భీమ) అనువైనవిగా సిఫార్సు చేశారు. చౌడు ప్రాంతాల్లో ఎంటీయూ–061తో పాటు కొత్తగా విడుదలైన ఎంసీఎం–100 వేసుకోవచ్చు.
► నాణ్యమైన విత్తనం కోసం ప్రభుత్వ లేదా ప్రభుత్వ అధీకృత సంస్థలను సంప్రదించడం మంచిది. ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా కూడా నాణ్యమైన విత్తనాన్ని అందిస్తున్నది.
► స్వయంగా రైతులు తయారు చేసుకున్న విత్తనాలను కూడా వాడుకోవచ్చు. 
► విత్తనం సంచి లేబుల్‌ మీద కనీసం 80 శాతం మొలక శాతం వుందో లేదో చూసుకోవాలి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top