హైటెక్‌లో ‘లోక్లాస్‌’..

Ineligible Teachers In Private Schools Nellore - Sakshi

కార్పొరేట్‌ స్కూళ్లలో అర్హత లేని టీచర్లు

విద్యార్థులను, తల్లిదండ్రులను మోసం చేస్తున్న యాజమాన్యాలు

90 శాతం స్కూల్స్‌లో ఇదే పరిస్థితి

సాక్షి, నెల్లూరు: కార్పొరేట్‌ స్కూల్స్‌ బ్రాండ్‌ పేరుతో మోసం చేస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలు చదువుల విషయంలో అటు విద్యార్థులను, ఇటు తల్లిదండ్రులను దారుణంగా వంచిస్తున్నాయి. కనీస అర్హత లేని వారితో పాఠాలు చెప్పిస్తూ మాయ చేస్తున్నాయి. బ్రాండ్‌ మోజులో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు ఇవేమీ పట్టించుకోవడం లేదు. ఇంటర్, డిగ్రీలు చదివి టీచింగ్‌ అనుభవం లేని వారికి తక్కువ జీతాలిస్తూ చదువులు చెప్పిస్తున్నారు. ఇదంతా తెలిసినా విద్యాశాఖ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. అక్రమాలకు అడ్డాగా మారిన ప్రైవేట్‌ స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్‌ శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌కుమార్‌యాదవ్‌ ఆదేశాలిచ్చినా జిల్లా విద్యాశాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.

జిల్లాలో 1,054 ప్రైవేట్‌ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 1,64,724 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ పాఠశాలలు ప్రతి తరగతిలో ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో టీచర్‌ను నియామకం చేస్తున్నాయి. 90 శాతం ప్రైవేట్‌ పాఠశాలల్లో అర్హత లేని ఉపాధ్యాయులతోనే పాఠాలు చెప్పిస్తున్నారు. ఇంటర్, డిగ్రీ చదివి నిరుద్యోగులుగా ఉన్న వారినే నియామకం చేసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కేవలం ఇంగ్లిష్‌ పరిజ్ఞానాన్నే ప్రాధాన్యంగా తీసుకుని టీచింగ్‌ అనుభవం లేని వారిని నియామకం చేసుకుంటున్నట్లు ఇటీవల జరిగిన సర్వేలో తేలింది. టీచింగ్‌ అనుభవం లేని వారు తక్కువ జీతానికే పనిచేసేందుకు ముందుకు వస్తుండడంతో ప్రైవేట్‌ యాజమాన్యాలు వారినే నియమించుకుంటున్నట్లు తెలిసింది.

నిబంధనలిలా..
ప్రైవేట్‌ పాఠశాలల ఏర్పాటు సమయంలో అనుమతి పొందిన ఏడాది తర్వాత గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకుంటారు. ఆ సమయంలో దరఖాస్తులో అర్హత కలిగిన ఉపాధ్యాయులను నియామకం చేసుకుంటున్నట్లు వారి వివరాలు, జీతభత్యాల వివరాలు కూడా పొందుపరుస్తారు. ప్రాథమిక పాఠశాలలో టీటీసీ పూర్తి చేసిన వారిని నియమించుకోవాలి. హైస్కూల్‌కు మాత్రం తప్పనిసరిగా బీఈడీ అసిస్టెంట్‌ (బీఈడీ పూర్తి చేసిన వారు)ని నియామకం చేసుకోవాలి. స్కూల్‌ గుర్తింపు సమయంలోనే అర్హత ఉన్న టీచర్ల పేర్లు, వారి సర్టిఫికెట్లు చూపించే యాజమాన్యాలు పాఠశాలల్లో మాత్రం టీచింగ్‌ అనుభవం లేని వారినే  కొనసాగిస్తున్నారు.

పుస్తకాల పేరుతో రూ.120 కోట్ల దోపిడీ
నిబంధనల ప్రకారం కార్పొరేట్‌ స్కూళ్లలో పాఠ్యపుస్తకాలు విక్రయించకూడదు. కానీ జిల్లాలో ప్రతి కార్పొరేట్, ప్రైవేట్‌ స్కూల్‌లో నోట్‌బుక్స్, పాఠ్యపుస్తకాలు బహిరంగంగానే విక్రయిస్తున్నారు. 6వ తరగతి విద్యార్థికి పుస్తకాల పేరుతో రూ.6,300, 8వ తరగతి విద్యార్థి నుంచి రూ.7,200 వంతున వసూలు చేస్తున్నారు. కార్పొరేట్, ప్రైవేట్‌ స్కూళ్లలో ఏడాదికి పుస్తకాల విక్రయం పేరుతో సగటున రూ.120 కోట్ల వ్యాపారం సాగిస్తున్నారు. అలాగే నారాయణæ ఒలింపియాడ్‌ పేరుతో నిర్వహించే స్కూల్‌లో ఒక్కో విద్యార్థి నుంచి యూనిఫాం(రెండు జతలకు) పేరుతో రూ.5,500 యథేచ్ఛగా వసూలు చేస్తున్నారు.

మౌనంగా..
నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేని టీచర్లతో క్లాసులు నిర్వహిస్తున్నా విద్యాశాఖ అధికారుల నుంచి స్పందన ఆశించిన స్థాయిలో లేదు. అలాగే ప్రతి ప్రైవేట్, కార్పొరేట్‌ స్కూల్‌లో పాఠ్యపుస్తకాలు, యూనిఫాం విక్రయిస్తున్నా అధికారులు మాత్రం మౌనం వహిస్తున్నారు. కార్పొరేట్‌ స్కూల్స్‌ అక్రమ దందాకు చెక్‌ పెట్టాలని జిల్లాకు చెందిన ఇరిగేషన్‌శాఖ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ ఆదేశాలు ఇచ్చినా విద్యాశాఖ అధికారులు మంత్రి ఆదేశాలు పెడచెవిన పెడుతున్నారు. ఒకటి, రెండు స్కూళ్లలో తనిఖీలు చేసి చేతులు దులుపుకున్నారు. ప్రతి ఏటా జిల్లా విద్యాశాఖ అధికారులకు మామూళ్లు ఇస్తుండడంతో కార్పొరేట్‌ అక్రమదందాను నిలువరించలేకపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top