దొనకొండలో మెగా సౌర విద్యుత్‌ ప్లాంట్‌!

Mega Solar Power Plant in Donakonda - Sakshi

వెయ్యి మెగావాట్లతో ఏర్పాటు.. 

ఐదువేల ఎకరాలు అవసరమని అంచనా 

భూములు పరిశీలించిన నెడ్‌క్యాప్‌..

దొనకొండ: ప్రకాశం జిల్లా దొనకొండలో వెయ్యి మెగావాట్ల మెగా సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందించేందుకు ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా పదివేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టును నెలకొల్పాలని రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో దొనకొండలో వెయ్యి మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం సుమారు ఐదువేల ఎకరాలు అవసరమని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నెడ్‌క్యాప్‌ సంస్థ బృందం ఈ ప్రాంతంలో భూముల పరిశీలన చేపట్టింది.

దొనకొండలో 25,086 ఎకరాల ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నట్టు రెవెన్యూ శాఖ సర్వే ద్వారా గుర్తించారు. ఇందులో వద్దిపాడులోని సర్వే నంబర్‌ 52, 54, 58, పోచమక్కపల్లి సర్వే నంబర్‌ 71, 72, రుద్రసముద్రంలో సర్వే నంబర్‌ 262–64లో సుమారు ఐదువేల ఎకరాల ప్రభుత్వ భూములను నెడ్‌క్యాప్‌ బృందం పరిశీలించింది. సోలార్‌ ప్యానెళ్లు ఏర్పాటు చేసేందుకు ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుందని బృందం అభిప్రాయపడింది. నెడ్‌క్యాప్‌ డీజీఎం సీబీ జగదీశ్వరరెడ్డి, ప్రకాశం జిల్లా మేనేజర్‌ జి.బుచ్చిరాజు గతవారం ఈ భూములపై హైలెవెల్‌ టెక్నికల్‌ సర్వే నిర్వహించారు.

సుమారు రూ.4 వేల కోట్లతో ఈ ప్లాంట్‌ను చేపట్టి ఏడాదిలో పూర్తి చేసి.. ఆ తరువాత ఏడాదికల్లా విద్యుత్‌ ఉత్పత్తి చేపట్టవచ్చని వారు తెలిపారు. ఈ ప్లాంటు పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమందికి ఉద్యోగాలు లభిస్తాయంటున్నారు. దీనిపై నెడ్‌క్యాప్‌ జిల్లా మేనేజర్‌ బుచ్చిబాబు మాట్లాడుతూ గురువారం ఒంగోలు కలెక్టరేట్‌లో జాయింట్‌ కలెక్టర్‌ షన్‌మోహన్‌తో నెడ్‌క్యాప్‌ బృందం, దొనకొండ తహసీల్దార్, సర్వేయర్లు సమావేశం కానున్నారని, దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలిపారు. దొనకొండ తహసీల్దార్‌ కాలే వెంకటేశ్వరరావు కూడా ఇదే విషయాన్ని నిర్ధారించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top