కరోనా: రియల్‌ హీరోలు

Police And Sanitation Department Staff Work Against To The Coronavirus - Sakshi

 కరోనా అంతమే లక్ష్యంగా..    

ప్రాణాలు పణంగా పెట్టి.. 

కోవిడ్‌ సైన్యం నిర్విరామ సమరం

సర్వత్రా కృతజ్ఞతాభివందనాలు 

రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. మూడోది జరిగితే ప్రపంచం ఉండదట.. ఒకప్పుడు అంతా అనుకునేవారు. ఊహించినట్టే యుద్ధం వచ్చేసింది. కంటికి కనిపించని వైరస్‌తో ‘ప్రపంచ యుద్ధం’ సాగుతోంది. కోరలు చాచిన కరోనాతో ప్రపంచమంతా వణికిపోతోంది. వైరస్‌కి  బలైపోతున్న నిండు ప్రాణాల సంఖ్య  పెరిగిపోతోంది. కల్లోల కరోనాను  తుదముట్టించేందుకు నిర్విరామ యుద్ధం సాగుతోంది. కబళిస్తున్న మహమ్మారిపై ముప్పేట దాడి సాగిస్తున్న వీరులెందరో. అసమాన ధైర్య సాహసాలతో ప్రాణాలు పణంగా పెట్టిన ధీరులెందరో.

మనందరి కోసం.. అందరినీ వదిలి.. అత్యంత ప్రమాదకర యుద్ధం చేస్తున్న ఆ సైనికులు అక్షరాలా హీరోలే. ముక్కుపుటాలదిరిపోయే చెత్తాచెదారాన్ని తొలగిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు.. విచ్చలవిడిగా దూసుకుపోయే జన ప్రవాహాన్ని అడ్డుకునే పోలీసులు.. రోగులకు సేవలందిస్తున్న వైద్య సిబ్బంది.. దేశ సరిహద్దుల్లో సైనికులకు తీసిపోని వీరి సేవలు నిరుపమానం. ఏమిచ్చి తీర్చుకోగలం రుణం. నిస్వార్థ సేవలకు సలాం చేస్తోంది సమాజం. అడుగడుగునా కురుస్తోంది అభినందన చందనం. అందుకోండి కృతజ్ఞతాభివందనం. 

సాక్షి, విజయనగరం: జిల్లా కలెక్టర్‌ దగ్గర్నుంచి అన్ని విభాగాలకు చెందిన 55 మంది జిల్లా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ కరోనా కట్టడికి పాటుపడుతున్నారు. దాదాపు 195 మంది డాక్టర్లు, 260 మంది నర్సులు, ఇతర వైద్య సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి విధులకు హాజరవుతున్నారు. ఎస్పీతో పాటు ఇద్దరు ఏఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 24 మంది సీఐలు, ఆర్‌ఐలు, 96 మంది ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, 526 మంది ఏఎస్‌ఐలు, హెచ్‌సీలు, 1200 మంది కానిస్టేబుళ్లు, 450 మంది హోమ్‌గార్డులు, 300 మంది ఎస్‌టీఎఫ్‌లు, 200 మంది ఫారెస్ట్, లీగల్‌ మెట్రాలజీ, ఏసీబీ, సీఐడీ సిబ్బంది మొత్తం కలిపి దాదాపు 3 వేల మంది పోలీసు డిపార్ట్‌మెంట్‌ నుంచి రోడ్లమీదకు వచ్చి లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలు జరిగేలా కాపలాకాస్తున్నారు. 

 గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న 10895 మంది వలంటీర్లు 4519 మంది ఉద్యోగులు, పట్టణాల్లోని వార్డు సచివాలయాల్లో 2017 మంది వలంటీర్లు, 846 మంది ఉద్యోగులు, 2588 మంది ఆశ వర్కర్లు, దాదాపు 600 మంది ఇంటింటి సర్వే చేపట్టి అనుమానిత లక్షణాలున్నవారిని గుర్తించి అధికారులకు సమాచారం అందిస్తున్నారు. ఇప్పటికే రెండు విడతల్లో కోవిడ్‌ 19 ఆరోగ్య సర్వే పూర్తికాగా మూడవ విడత సర్వే మొదలైంది. రెండు, మూడు రోజుల్లో అది కూడా పూర్తవుతుంది. ఇప్పటి వరకూ 2140 మంది అనుమానితులను గుర్తించారు. ఇక 1147 మంది పారిశుద్ధ్య కారి్మకులు పట్టణాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతున్నారు. వీరంతా రేయింబవళ్లు కష్టపడుతున్నారు. గ్రామాలను కూడా 3230 మంది పారిశుద్ధ్య కారి్మకులు స్వచ్ఛంగా ఉంచుతున్నారు. మరి వీరి గురించి వారి కుటుంబ సభ్యులేమంటున్నారో తెలుసా.... 

పోలీసులే రియల్‌ హీరోలు 
నా భర్త ఎస్‌.ఎన్‌.ఆదిత్య జిల్లా కేంద్రంలో ట్రాఫిక్‌ ఏఎస్‌ఐగా పనిచేస్తున్నారు. పోలీస్‌ శాఖలో పనిచేయడమే గొప్ప వరం.  విపత్కర పరిస్ధితుల్లో ప్రజల రక్షణకు మేమున్నాం అంటూ నిలవటం చాలా గొప్ప విషయం. దేశం కోసం, ప్రజల ఆరోగ్యం కోసం అహరి్నశలూ శ్రమిస్తున్న పోలీసులు రియల్‌ హీరోలు. అందులో నా భర్త ఉండడం నా అదృష్టం. ఇంటికి వచ్చినప్పుడు కొంచెం భయంగా ఉన్నా... సేవ చేసి వచ్చిన ఆయనకు కుటుంబ సమేతంగా గౌరవిస్తాం.                -పద్మకుమారి, విజయనగరం

ఆయన సేవలు చిరస్మరణీయం 
కరోనా వైరస్‌ వ్యాపించకుండా చేపడుతున్న విధి నిర్వహణలో శృంగవరపుకోట సీఐగా నా భర్త శ్రీనివాసరావు పనిచేస్తుండటం నాకు గర్వంగా ఉంది. ఒకవైపు శాంతిభద్రతల పరిరక్షణ, మరోవైపు లాక్‌డౌన్‌ నిబంధనల అమలు, విదేశాల నుంచి వచ్చి హోం క్వారంటైన్‌లో ఉంటున్న వారిపై నిఘా వంటి పనుల్లో విరామం లేకుండా పనిచేస్తున్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఆయన్ను చూస్తే మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. – సారిక

మా నాన్నను చూస్తే గర్వంగా ఉంది 
మా నాన్న వేపాడ పీహెచ్‌సీలో సీహెచ్‌ఓగా పనిచేస్తున్నారు. కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌లో అంతా ఇళ్లకే పరిమితమైనప్పటికీ వైద్యశాఖ సిబ్బంది గ్రామాల్లో సేవలందిస్తున్నారు. మా నాన్న ఈ మధ్యనే బైక్‌ ప్రమాదంలో గాయపడ్డారు. అయినా అత్యవసరవేళ విధులు నిర్వర్తిస్తున్న మా నాన్నను చూసి గర్వపడుతున్నాను. క్లిష్ట పరిస్దితుల్లో సేవలు అందించటం గొప్ప అదృష్టం. 
– ప్రసన్నకుమార్, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top