తీరం హైఅలర్ట్‌

Police High Alert on Krishnapatnam Port SPSR Nellore - Sakshi

అడుగడుగునా తనిఖీలు

షార్, కృష్ణపట్నం పోర్టులకు భద్రత కట్టుదిట్టం

అప్రమత్తంగా ఉండాలని తీరప్రాంత

మండలాల పోలీసులకు ఎస్పీ ఆదేశాలు

నెల్లూరు(క్రైమ్‌): శ్రీలంక నుంచి సముద్రమార్గం ద్వారా ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడే ప్రమాదం ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్‌ వర్గాలు రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాల్లో పోలీసు ఉన్నతాధికారులు హైఅలర్ట్‌ ప్రకటించారు. శ్రీలంకలో ఆదివారం 8 చోట్ల పేలుళ్లు జరిగి 215 మంది ప్రజలు మృతి చెందగా వందల మందిక్షతగాత్రులైన విషయం తెలిసిందే. సోమవారం కొలంబోలోని ఓ చర్చిలో, హోటళ్లలో పేలుళ్లు సంభవించాయి. వరుస పేలుళ్లతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమై ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. దీంతో ఉగ్రవాదులు సముద్రమార్గం గుండా భారత్‌లోకి ప్రవేశించే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్‌ వర్గాలకు సంకేతాలు అందాయి. దీంతో దక్షిణాది రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర నిఘా వర్గాలు రాష్ట్రాలకు సూచించాయి. ఇప్పటికే తమిళనాడు రాష్ట్రం శ్రీలంక తీరానికి కేవలం 18 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. తమిళనాడులోని తూత్తుకూడి, కన్యాకుమారి, రామేశ్వరం తదితర ప్రాంతాల్లో తీరం వెంబడి భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయి. మన రాష్ట్రంలో సైతం అధికారులు అప్రమత్తమయ్యారు.

మెరైన్‌  ఉన్నతాధికారులు సోమవారం సిబ్బందితో సమావేశమయ్యారు. నెల్లూరు తమిళనాడు రాష్ట్రానికి సరిహద్దు జిల్లా కావడంతో జిల్లాలో తీరం వెంబడి హైఅలెర్ట్‌ ప్రకటించారు. 167 కి.మీ. మేర జిల్లాలో తీరప్రాంతం విస్తరించి ఉంది. తీరం వెంబడి 125 గ్రాములు ఉన్నాయి. ఆయా గ్రామాల్లోని పెద్దలు, మత్స్యకారులతో మెరైన్‌ పోలీసులు అత్యవసర సమావేశాలు నిర్వహించారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలను వారికి తెలియజేశారు. కొత్త వ్యక్తులు తారసపడినా, సముద్రంలో అనుమనాస్పదంగా బోట్లు సంచరిస్తున్నా వెంటనే తమకు తెలియజేయాలని కోరారు. ఇస్కపల్లి, దుగరాజపట్నం, శ్రీహరికోట మెరైన్‌ పోలీసులు బృందాలుగా విడిపోయి తీరం వెంబడి గస్తీని ముమ్మరం చేశారు. జాలర్ల ముసుగులో ఉగ్రవాదులు వచ్చే అవకాశం ఉండడంతో  తీరప్రాంత పరిస్థితులపై పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉన్న మత్స్యకారులను సైతం గస్తీలో భాగస్వాములను చేశారు. మరోవైపు కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది సముద్రంలో గస్తీ చేపట్టాయి. తమిళనాడు వైపు నుంచి వచ్చే ఏచిన్న బోటును వదలకుండా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పూర్తిస్థాయి వివరాలు సేకరించిన అనంతరమే వారిని విడిచిపెడుతున్నారు. దేశానికే తలమానికమైన షార్‌ వద్ద కేంద్రబలగాలు భద్రతను మరింత కట్టుదిట్టం చేశాయి. షార్‌ చుట్టూ తనిఖీలు ముమ్మరం చేసినట్లు సమాచారం. కృష్ణపట్నం పోర్టులోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. మెరైన్‌ పోలీసులతోపాటు స్థానిక పోలీసులు సైతం భద్రతా విధులు నిర్వహిస్తున్నారు. తాజా పరిస్థితులను మెరైన్‌ పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సిబ్బందికి వివరిస్తూ అందుకు అనుగుణంగా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top