విద్యుత్‌ అంతరాయాలకిక చెక్‌

Power Department has announced that it will no longer disrupt power supply - Sakshi

రియల్‌ టైం పర్యవేక్షణకు శ్రీకారం

వాస్తవాలకు చేరువగా అత్యాధునిక పరిజ్ఞానం 

ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోతే తక్షణమే మార్పిడి 

అంతా ఆన్‌లైన్‌లోనే రికార్డ్‌ 

ప్రతీనెలా 5వ తేదీకల్లా కేంద్రానికి వాస్తవ చిత్రం

ఉచిత విద్యుత్‌ సరఫరాకు మరింత ఊతం 

సరికొత్త టెక్నాలజీపై మంత్రితో అధికారుల భేటీ 

విద్యుత్‌ వ్యవస్థలో ఇదో విప్లవం: బాలినేని

సాక్షి, అమరావతి: విద్యుత్‌ సరఫరాలో ఇక మీదట ఎలాంటి అంతరాయాలు లేకుండా చేస్తామని ఇంధన శాఖ ప్రకటించింది. ఇందుకోసం రియల్‌ టైం పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని వెల్లడించింది. డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్ల ఓవర్‌లోడ్‌ను గుర్తించి, వెంటనే పరిష్కరించేందుకు ఇది తోడ్పడుతుందని తెలిపింది. అన్ని వర్గాలకు విద్యుత్‌ సరఫరాతో పాటు వ్యవసాయ ఉచిత విద్యుత్‌కు కూడా ఈ విధానం బలం చేకూరుస్తుందని వివరించింది. రియల్‌ టైం పర్యవేక్షణపై ఉన్నతాధికారులు విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో చర్చించారు. ఆ వివరాలను రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈఓ ఎ.చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం మీడియాకు వెల్లడించారు.

రియల్‌ టైం పర్యవేక్షణలో ప్రధానంగా ట్రాన్స్‌ఫార్మర్ల వద్దే మీటర్లు ఏర్పాటు చేస్తారు. వీటికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం జోడించి, ఆన్‌లైన్‌ ద్వారా విద్యుత్‌ కార్యాలయాలకే విద్యుత్‌ సరఫరా వివరాలు, ట్రాన్స్‌ఫార్మర్ల పనితీరు తెలిసేలా చేస్తారు. దీంతో పంపిణీ సంస్థలు ఎంత విద్యుత్‌ సరఫరా చేస్తున్నాయనేది కచ్చితంగా తెలుసుకోవచ్చు. ఈ విధానాన్ని తప్పనిసరి చేయాలని కేంద్ర విద్యుత్‌ శాఖ ఇప్పటికే డిస్కమ్‌లను ఆదేశించింది.

సరఫరా చేసే విద్యుత్‌ వివరాలను ప్రతీనెతి 5న సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అధారిటీకి పంపాల్సి ఉంటుంది. మీటర్లు లేకపోవడంవల్ల ఉచిత విద్యుత్‌ సరఫరా వివరాలు కచ్చితంగా తెలుసుకోలేకపోతున్నారు. పైగా విద్యుత్‌ సరఫరాలో జరిగే నష్టాలన్నీ ఉచిత విద్యుత్‌ ఖాతాలోనే వేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదని రైతు సంఘాలు, విద్యుత్‌ రంగ నిపుణులు భావిస్తున్నారు. రియల్‌ టైం వ్యవస్థ ద్వారా ట్రాన్స్‌ఫార్మర్‌ వద్దే సరఫరాను లెక్కించడంవల్ల ఇక మీదట ఇలాంటి అశాస్త్రీయ విధానాన్ని తొలగించవచ్చని విద్యుత్‌ శాఖ తెలిపింది. అలాగే, ఎనర్జీ ఆడిట్‌ను కూడా నిక్కచ్చిగా అమలుచేయడం ఇక మీదట సులువని తెలిపింది. 

ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోతే తిరగక్కర్లేదు
విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయినా, మరమ్మతు అవసరమైనా వినియోగదారులు సిబ్బంది చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. కానీ, రియల్‌ టైం వ్యవస్థలో ఈ తరహా సమస్యలను గుర్తించొచ్చు. తద్వారా ట్రాన్స్‌ఫార్మర్‌ బిగించడమో, మరమ్మతు చేయడమో వెంటనే జరగాలి. పరిష్కారం జరిగిన సమయం సైతం రికార్డు అవుతుంది కాబట్టి మరింత జవాబుదారీతనానికి అవకాశం ఉంది. దీనివల్ల ఉచిత వ్యవసాయ విద్యుత్‌ సరఫరాలో రైతులు నెలల తరబడి అసౌకర్యానికి గురవ్వకుండా చూడొచ్చు. 

రియల్‌ టైమ్‌ పర్యవేక్షణ శుభ పరిణామం : బాలినేని
కాగా, రియల్‌ టైం పర్యవేక్షణను విద్యుత్‌ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్వాగతించారు. ఇలాంటి సరికొత్త ప్రయోగాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. రైతు సంక్షేమం కోసమే పగటిపూట 9 గంటల విద్యుత్‌ను శాశ్వతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. విద్యుత్‌ రంగాన్ని గత ప్రభుత్వం ఐదేళ్లపాటు ఆర్థికంగా దివాలా తీయించినా ప్రజలపై భారం వేయకుండా వ్యవస్థను బలోపేతం చేయాలన్నది తమ ధ్యేయమన్నారు.

ఇందులో భాగంగానే వినియోగదారులపై భారం పడకుండా విద్యుత్‌ టారిఫ్‌ ఇచ్చిన ఏపీఈఆర్‌సీ ఛైర్మన్‌ జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డిని మంత్రి అభినందించారు. కేవలం గృహ విద్యుత్‌ వినియోగదారులకే ప్రభుత్వం రూ. 1,707.07 కోట్లు సబ్సిడీ ఇచ్చిందని గుర్తుచేశారు. మునుపెన్నడూ లేని విధంగా విద్యుత్‌ సంస్థలకు రూ.10,060.65 కోట్లు సబ్సిడీ ఇవ్వడాన్ని బట్టి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉందో అర్థం చేసుకోవాలని ప్రజలను కోరారు. అలాగే, ఐదేళ్ల కాలంలో విద్యుత్‌ సంస్థలను ఏ స్థాయిలో గత ప్రభుత్వం అప్పులపాల్జేసిందో మంత్రి గణాంకాలతో సహా వివరించారు. సమీక్షలో ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి, ట్రాన్స్‌కో జేఎండీ చక్రధర్‌ బాబుతో పాటు డిస్కమ్‌ల సీఎండీలు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top