డిమాండ్‌కు సరిపడా విద్యుత్‌

Pre plan of officers for Electricity demand - Sakshi

అధికారుల ముందస్తు ప్రణాళిక సిద్ధం

రోజుకు 200 మిలియన్‌ యూనిట్లకుపైగా డిమాండ్‌

మే నెలలో మరో 10 మిలియన్‌ యూనిట్లు అదనం

ఇప్పటి దాకా రోజువారీ గరిష్ట వినియోగం 175 మి.యూ.

వ్యవసాయానికి 9 గంటల విద్యుత్‌

వాటా ఎక్కువే.. ఏసీలు పెరగడమూ ఓ కారణం, పరిశ్రమలూ పెరిగే సూచన 

బొగ్గు సరఫరాతో ఎన్టీపీసీ విద్యుత్‌ పెంచే యోచన

సాక్షి, అమరావతి: వచ్చే వేసవిలో విద్యుత్‌ డిమాండ్‌ గరిష్టంగా రోజుకు 200 మిలియన్‌ యూనిట్లు దాటే అవకాశం ఉందని స్టేట్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌(ఎస్‌ఎల్‌డీసీ) అంచనా వేస్తోంది. ఈ మేరకు ముందస్తు ప్రణాళిక(ఫోర్‌కాస్ట్‌)ను విద్యుత్‌ ఉన్నతాధికారులు సంబంధిత మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి నివేదించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకోవాల్సిన చర్యలపై మంత్రితో చర్చించారు. ఈ వివరాలను రాష్ట్ర ఇంధన పొదుపు అధికారి చంద్రశేఖర్‌ రెడ్డి మీడియాకు వివరించారు. ఆయన వెల్లడించిన వివరాల మేరకు.. గతంతో పోలిస్తే రాష్ట్రంలో ఏసీల వినియోగం లక్షకుపైగా పెరిగినట్టు గుర్తించారు. మరోవైపు వ్యవసాయ ఉచిత విద్యుత్‌ను ఏడు నుంచి తొమ్మిది గంటలకు పెంచారు. ఫలితంగా వేసవిలోనూ కొన్ని రకాల ఉద్యాన పంటలకు విద్యుత్‌ వాడకం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకున్న వ్యవసాయ, గృహ, పారిశ్రామిక విద్యుత్‌ కనెక్షన్లను త్వరలో అనుమతించే వీలుంది. కొత్తగా పరిశ్రమలు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. వీటన్నిటినీ పరిగణలోనికి తీసుకుని వచ్చే వేసవిలో విద్యుత్‌ డిమాండ్‌పై ఎస్‌ఎల్‌డీసీ అంచనా వేసింది. ఏటా గరిష్టంగా రోజుకు 175 మిలియన్‌ యూనిట్ల డిమాండ్‌ ఉంటే, వచ్చే మే నెలలో 210 మిలియన్‌ యూనిట్లకు చేరుతుందని భావిస్తున్నారు. 

నివేదికలోని ముఖ్యాంశాలు..
- ఫిబ్రవరి నుంచి మే నెల మధ్య కాలంలో విద్యుత్‌ డిమాండ్‌ ఎక్కువ. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికారులందరూ సిద్ధంగా ఉండాలి.
ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ జెన్‌కో పరిధిలోని ఎన్టీపీసీ, ఆర్టీపీపీ, కృష్ణపట్నం విద్యుత్‌ ప్లాంట్లలో బొగ్గు నిల్వలను డిసెంబర్‌ నాటికి 3 లక్షల టన్నులు, వచ్చే ఏడాది జనవరి చివరకు 6 లక్షల టన్నులు, మార్చి చివరకు 9 లక్షల టన్నులకు పెంచాలి.
రాష్ట్రంలోని థర్మల్‌ విద్యుత్‌ స్టేషన్లలో రోజుకు 80 మిలియన్‌ యూనిట్లు ఉత్పత్తి చేసేందుకు నెలకు 17 మెట్రిక్‌ టన్నుల బొగ్గు అవసరం. ప్రస్తుతం ఇందులో సగం మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో విదేశాల నుండి కూడా జెన్కో తక్కువ ధరకు బొగ్గు దిగుమతి చేసుకోవాలి.
- ఫిబ్రవరి, జూలై మధ్యలో దశల వారీగా నెలకు 2 లక్షల టన్నుల బొగ్గు దిగుమతి చేసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం. 
- ఏపీ డిస్కమ్‌లతో పీపీఏలున్న నేపథ్యంలో బహిరంగ మార్కెట్లో చౌకగా లభించే విద్యుత్‌ కొనుగోలుకు అడ్డంకులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 
ఇటీవల కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసిన లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ (విద్యుత్‌ కొనుగోలుకు ముందే బ్యాంకులో డబ్బులు చెల్లించడం)కు అవసరమైన నిధులు సమకూర్చుకోవాలి. (కేంద్ర విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.6,184 కోట్లు ఎల్‌సీ కింద చెల్లించారు). దీంతో వచ్చే వేసవిలో నిరంతర విద్యుత్‌ కొనుగోలుకు ఇబ్బందులు ఉండవు. 
ఈసారి గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి వేసవి నాటికి 300 మెగావాట్ల వరకు ఉంటుందని అంచనా.
- ఈ ఏడాది జలాశయాలు పుష్కలంగా నిండాయి. దీంతో జల విద్యుత్‌ ఉత్పత్తి పెరగనుంది. 

దేనికైనా సిద్ధమే
వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాం. రాష్ట్రంలో ప్రతి ఇంటికి, ప్రతి పరిశ్రమకు అవాంతరాలు లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందుబాటు ధరలోనే సరఫరా చేయాలనే విషయంలో ముఖ్యమంత్రి చాలా పట్టుదలగా ఉన్నారు. వేసవిలోనూ ప్రజల అంచనాలకు అనుగుణంగా విద్యుత్‌ సంస్థలు పనిచేస్తాయి.
- బాలినేని శ్రీనివాసరెడ్డి, విద్యుత్‌ శాఖ మంత్రి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top