హద్దులు దాటి తవ్విన ఎమ్మెల్సీ సోదరుల క్వారీలపై దాడులు

జరిమానా విధించేందుకు నివేదిక సిద్ధమైన విజిలెన్స్ అధికారులు
త్వరలోనే మిగతా క్వారీల్లోనూ తనిఖీలు చేస్తామని వెల్లడి
సాక్షి, మడకశిర: ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి సోదరులు జయప్ప, సుభాష్ నిర్వహిస్తున్న మెటల్ క్వారీలపై బుధవారం కర్నూలుకు చెందిన గనుల శాఖ విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. గనుల శాఖ డీడీ రాజశేఖర్ అదేశాల మేరకు ఇన్‌స్పెక్టర్లు కొండారెడ్డి, వెంకటకృష్ణప్రసాద్‌లు మడకశిర మండల పరిధిలోని మెళవాయి పంచాయతీలోని సర్వే నంబర్ 622లోని ఎమ్మెల్సీ సోదరుల క్వారీల్లో తనిఖీ చేశారు. ఎమ్మెల్సీ సోదరులు హద్దులు దాటి భారీగా తవ్వకాలు చేసినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన క్వారీ నిర్వాహకుల నుంచి అపరాధరుసుం వసూలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్లు మాట్లాడుతూ, మడకశిర నియోజకవర్గంలోని చాలా ప్రాంతాల్లో అక్రమంగా క్వారీలు నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో తనిఖీలు నిర్వహించామన్నారు. నియోజవర్గంలోని అన్ని మెటల్, గ్రానైట్ క్వారీలను తనిఖీ చేస్తామన్నారు. రాయల్టీ చెల్లించకుండా, నిబంధనలకు విరుద్ధంగా క్వారీలు నడుపుతున్న క్వారీ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి