ప్రైవేట్‌ చదువులు!

School Managements Charging Huge Feeses In Private Schools - Sakshi

 గొప్ప కోసం వెళ్లి జేబులకు చిల్లు పెట్టుకుంటున్న పేదలు

 కొనసాగుతున్న ప్రైవేటు స్కూళ్ల దోపిడీ

సాక్షి,కనిగిరి: ప్రైవేట్‌ పాఠశాలల చదువులపై మోజు విద్యార్థుల తల్లిదండ్రులను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు తెరవడంతో తమ పిల్లల చదువులు బడ్జెట్‌ చూసుకొని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. స్కూల్‌ ఫీజు, యూనిఫాం, బూట్లు, బ్యాగులు, నోట్‌ పుస్తకాలు పాఠశాల సరంజామా ధరలు ఆకాశాన్నంటాయి. నెల సంపాదనంతా వెచ్చించినా ఫీజులు, పుస్తకాలు, బ్యాగులు, యూనిఫాంకు సరిపోని పరిస్థితి. తాము పస్తులున్నా చదువుకుని తమ పిల్ల భవిష్యత్‌ను బాగు చేయాలనకుంటున్నారు. పిల్లల విద్యోన్నతికి కలలు కనే తల్లిదండ్రులు, తమకు ఉన్నా లేకున్నా చదువులు బడ్జెట్‌ భారమైనా అప్పోసొప్పో చేసి మోస్తున్నారు.

పాఠశాలలు తెరచి పది రోజులు దాటింది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మెరుగైన వసతులున్నా.. గొప్పగా చెప్పుకోవాలనే ఉద్దేశంతో వాటిపై అనాశక్తితో చూపుతూ కొందరు ప్రైవేటు పాఠశాల వైపు మోజు మొగ్గు చూపుతన్నారు. ఫలితంగా పెరిగిన ధరలతో  చదువుల కొనుగోళ్లు భారంగా మారి తల్లడిల్లుతున్నారు. అంతేగాక పిల్లలు ఎక్కడ చేర్చారంటే గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారని గొప్పగా చెప్పు కోవడం తల్లిదండ్రులకు గర్వంగా మారింది. మధ్య తరగతి, సామాన్య ప్రజలు ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. గుర్తింపు పొందిన పాఠశాలల్లో పిల్లలను చేర్చాలంటే భారీగా బడ్జెట్‌ సిద్ధం చేసుకోవాల్సిందే. ఈ ఏడాది ఒక్కో నోటు పుస్తకంపై రూ.5 నుంచి రూ.10 వరకు పెంచారు. ప్రభుత్వ పాఠశాలల్లో కొన్ని రకాల పాఠ్యపుస్తకాలు పూర్తి స్థాయిలో  రాకపోవడంతో బయట మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో సుమారుగా 110 వరకు ప్రైవేటు పాఠశాలలు ఉండగా అందులో 26 వేల మంది వరకు విద్యార్థులు ఉన్నట్లు అంచనా.  

కొనసాగుతున్న ప్రైవేట్‌ దోపిడీ 
ఏటా పెరుగుతున్న ఈ ఏడాది చదువులు బడ్జెట్‌ భారీగా పెరిగింది. నర్సరీ, ఎల్‌కేజీల నుంచి ఫీజులు మోత ప్రారంభమవుతుంది. ఇద్దరు..ముగ్గురు పిల్లలు చదువులకు వస్తే మరింత భారంగా మారుతుంది. పాఠశాలలు తెరవడంతో పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, రాత పుస్తకాల ధరలు ఆకాశాన్ని అంటాయి. యూనిఫాం ధరలు భారీగా పెరిగాయి. ఇక స్కూల్‌ ఫీజులు తడిసి మోపెడవుతున్నాయి. ఫీజులు ఒక్కో పాఠశాల స్థాయిని బట్టి ఉంటున్నాయి. బ్రాండెడ్‌ పేరు ఉన్న ప్రైవేట్‌ పాఠశాలల్లో భారీగా ఉండగా మిగిలిన వాటిలో కొంత తక్కువగా ఉన్నాయి. గతేడాది కంటే ఫీజులు క్లాసుకు వెయ్యి నుంచి రూ.500 వరకూ పెంచారు. పాఠశాలల స్థాయిని బట్టి ఎల్‌కేజీ ఫీజు రూ.9 వేల నుంచి రూ.12 వేల వరకూ ఉన్నాయి. 

ఇకపై ప్రతి క్లాసుకు రూ.500 చొప్పున పెరుగుతూ వస్తూ పదో తరగతిలో గుర్తింపు పొందిన పాఠశాలల్లో రూ.18,500 వరకు ఫీజు ఉంది. మిగిలిన పాఠశాలల్లో రూ.17 వేల నుంచి రూ.18 వేల వరకు ఫీజులు ఉన్నాయి. క్లాసును బట్టి అడ్మిషన్‌ ఫీజు రూ. వెయ్యి నుంచి రూ.2 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇక యూనిఫాం నుంచి మోసినన్ని పుస్తకాలు, బూట్లు, వ్యాన్‌ ఫీజులు చెల్లించాలి. ప్రతి విద్యార్థికి ఫీజులు మినహా రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు ఖర్చు అవుతోంది. ఏడాదికి పుస్తకాల ధరలు 10 శాతం పెరుగుతున్నాయి. స్కూల్‌ బ్యాగులు, కంపార్ట్‌బాక్స్‌ల ధరలు భారీగా పెరిగాయి. ప్రైవేటు స్కూల్స్‌లో చదువులు చదివించాలనుకొనే తల్లిదండ్రులు డీలా పడుతున్నారు. నెలసరి బడ్జెట్‌ సరిపోకా పిల్లల కొనుగోళ్లకు అప్పులు చేస్తున్నారు. అయినా పేరు గొప్ప కోసం ప్రైవేటు దోపిడీ గురవుతున్నారంటే అతిశయోక్తి కాదు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top