ఏజెన్సీ ప్రాంతాల్లో శిశు సంరక్షణ భేష్‌

SNCU Services For Child Care In Agency Areas Are Amazing - Sakshi

మా దేశంలోనూ ఈ పద్ధతిని అనుసరిస్తాం

ఎస్‌ఎన్‌సీయూ కేంద్రాల సందర్శనలో ఇథియోపియా బృందం

ఏజెన్సీ ప్రాంతాల్లో మంచి ఫలితాలు వచ్చాయని ప్రశంసలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో నవజాత శిశువుల కోసం ఏర్పాటుచేసిన ఎస్‌ఎన్‌సీయూ (స్పెషల్‌ న్యూకేర్‌ బార్న్‌ యూనిట్స్‌) సేవలు అద్భుతంగా ఉన్నాయని, ఇలాంటి విధానాన్ని తాము కూడా అనుసరిస్తామని ఇథియోపియా బృందం ప్రశంసించింది. ఈ దేశానికి చెందిన వైద్య బృందం సోమ, మంగళవారాల్లో ఏజెన్సీ ప్రాంతమైన బుట్టాయగూడెంతో పాటు పలు నవజాత శిశువుల వైద్య కేంద్రాలను సందర్శించింది. ఇథియోపియాలోని వొలైటా సొడు యూనివర్సిటీకి చెందిన ముగ్గురు వైద్యుల బృందం ఈ కేంద్రాల సందర్శనకు  వచ్చింది. ఇందులో డా.మెస్‌ఫిన్‌ బిబిసొ, డా.ఇయోబ్‌ ఎషెటు, డా.లూకాస్‌ డింగాటో ఉన్నారు. శిశు సంరక్షణ కేంద్రాల్లో అందుతున్న సేవలను ఈ బృందం పరిశీలించి ఇక్కడ అందుతున్న సేవలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడింది.

ఈ కేంద్రాల్లో సాంకేతిక పరిజ్ఞానం, వైద్యులు అనుసరిస్తున్న వైద్య విధానాలను అడిగి తెలుసుకున్నారు. తమ దేశంలో కూడా ఈ విధానాన్ని అనుసరిస్తామని, సాంకేతిక సహకారాన్ని అందించాలని కోరారు. నవజాత శిశువుల కోసం ఇక్కడ 24 గంటలూ సేవలు అందుతుండటం గొప్ప విషయమని.. మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇలాంటి సేవలు అందుబాటులో ఉండటం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని వారు చెప్పారు. ఆరోగ్య రంగంలో ఆంధ్రప్రదేశ్‌ అనుసరిస్తున్న విధానాలను తమ దేశంలోనూ అమలుచేసేందుకు అక్కడి ప్రభుత్వంతో చర్చిస్తామని బృందం తెలిపింది. కాగా, జాతీయ ఆరోగ్య మిషన్‌ నిధులతో రాష్ట్రంలోని ఏడు ఏజెన్సీ ప్రాంతాల్లో 21 ఎస్‌ఎన్‌సీయూలు నడుస్తున్నాయి. 2018 మేలో ప్రారంభమైన వీటిల్లో 2019 డిసెంబర్‌ 20 నాటికి 7,500 నవజాత శిశువులకు వైద్యమందినట్లు ఇథియోపియా బృందానికి అధికారులు వివరించారు.

ట్రాకింగ్‌ విధానంతో మెరుగైన సేవలు
 గర్భిణిని ఆస్పత్రికి తీసుకురావడం, సకాలంలో వైద్య పరీక్షలు చేయించడం, సుఖ ప్రసవానికి ప్రోత్సహించడం వంటి విషయాల్లో ట్రాకింగ్‌ విధానాన్ని అమలుచేస్తున్నాం. ప్రసవానికి గర్భిణి పుట్టింటికి వెళ్లినా అక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో సమన్వయం చేసుకుని ప్రసవానికి అవసరమైన వైద్యసేవలు అందిస్తున్నాం. కేఆర్‌ పురం ఏజెన్సీ పరిధిలో మరో ఎస్‌ఎన్‌సీయూ పెడితే బాగుంటుంది.
– ఆర్వీ సూర్యనారాయణ, ప్రాజెక్ట్‌ ఆఫీసర్, ఐటీడీఏ, కేఆర్‌ పురం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

సంబంధిత వార్తలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top