ఇటలీ నుంచి వచ్చినవారిపై ప్రత్యేక దృష్టి 

Special focus on those who came from Italy - Sakshi

75 మంది ప్రయాణికులు ఏపీకి

వాళ్లందరికీ ఇంట్లోనే వైద్యం

బయటకు రాకుండా గట్టి నిఘా

సాక్షి, అమరావతి/నెట్‌వర్క్‌: చైనా తర్వాత కోవిడ్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న ఇటలీ నుంచి రాష్ట్రానికి వచ్చిన వాళ్లందరినీ గుర్తించి, వారికి ఇళ్లల్లోనే హోం ఐసొలేటెడ్‌ ట్రీట్‌మెంట్‌ ఇవ్వడానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు ఇటలీ నుంచి రాష్ట్రానికి 75 మంది వరకు వచ్చినట్టు తేలింది. వీరిలో 26 ఏళ్ల యువకుడికి కోవిడ్‌ పాజిటివ్‌ లక్షణాలు కనిపించడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఇమ్మిగ్రేషన్‌ బ్యూరో ఇచ్చిన వివరాల ఆధారంగా 75 మంది ప్రయాణికుల చిరునామాలు తెలుసుకుని, ఆ ప్రయాణికులందరినీ ఇళ్లల్లోనే ఉంచి కనీసం 14 రోజులపాటు బయటకు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించింది. 

ప్రజల్లో అవగాహన కలిగించాలి: సీఎస్‌ 
కోవిడ్‌పై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు గ్రామ స్థాయిలో పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) నీలం సాహ్ని ఆదేశించారు. కోవిడ్‌పై బుధవారం ఆమె సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, జిల్లా వైద్యాధికారులు, బోధనాస్పత్రుల సూపరిం టెండెంట్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కోవిడ్‌ అనుమానిత లక్షణాలున్న వారికి ప్రత్యేకంగా వైద్యమం దించేందుకుమూడు క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే.ఎస్‌.జవహర్‌రెడ్డి తెలిపారు. కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకు కోవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్న 48 మందిని గుర్తించగా అందులో 44 మందికి కోవిడ్‌ లేదని తేలింది. మరో నలుగురి నమూనాలను ల్యాబ్‌కు పంపామని, వారి ఫలితాలు రావాల్సి ఉందని వైద్య, ఆరోగ్య శాఖాధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం 288 మందిని వారి ఇళ్లల్లోనే పరిశీలనలో ఉంచినట్టు వెల్లడించారు.

విశాఖ, నెల్లూరు జిల్లాల్లో కోవిడ్‌ కలకలం 
విశాఖ జిల్లాలో బుధవారం కోవిడ్‌ కలకలం రేపింది. అనకాపల్లి శారదా కాలనీకి చెందిన కృష్ణ భరద్వాజ్‌ ఇటలీలో చదువుకుంటూ అనకాపల్లికి వచ్చాడు. అతడికి కోవిడ్‌ లక్షణాలు ఉన్నాయేమోనన్న అనుమానంతో విశాఖ చెస్ట్‌ ఆస్పత్రికి తరలించారు. అలాగే ఉన్నత చదువుల కోసం ఇటలీ వెళ్లి వారం క్రితం స్వస్థలం నెల్లూరుకు వచ్చిన ఒక విద్యార్థికి కోవిడ్‌ సోకిందనే అనుమానంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అతడిని, తల్లిదండ్రులను ప్రభుత్వ సర్వ జన ఆస్పత్రిలో చేర్పించారు. 

కోవిడ్‌కూ ఆరోగ్యశ్రీ
కోవిడ్‌ వైరస్‌ లక్షణాలున్న వారికి అందించే వైద్యాన్ని ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చింది. ఈమేరకు వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి డా.కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈఓ డా.ఎ.మల్లికార్జున బుధవారం ఉత్తర్వులిచ్చారు. మొత్తం 14 రకాల జబ్బులను ఇందులో చేర్చారు. ఎవరైనా కరోనా వ్యాధి లక్షణాలుండి ఆస్పత్రుల్లో చేరితే ఉచితంగా చికిత్స అందించాలని, ఆరోగ్యశ్రీ జాబితాలో ఉన్న అన్ని ఆస్పత్రులకు ఆదేశాలిచ్చారు. కోవిడ్‌ లక్షణాలతో చేరిన బాధితులకు ఆరోగ్యశ్రీ పరిధిలో ప్రత్యేక వార్డుల్లో చికిత్స అందించాలని ఆదేశించారు. వైరస్‌ అనుమానిత లక్షణాలతో ఉన్న వైద్యం అందించినందుకు రూ.10 వేలు, పాజిటివ్‌ కేసులకు వైద్యమందిస్తే రూ.20వేలు అదనంగా ఇస్తామని ఆరోగ్యశ్రీ సీఈఓ డా.మల్లికార్జున తెలిపారు. 

హెల్త్‌ కార్డులకు రూ.21.66 కోట్లు
వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు ఇచ్చే ఆరోగ్యశ్రీ హెల్త్‌ కార్డుల కోసం రూ.21.66 కోట్లు మంజూరు చేస్తూ వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

వైద్య ఆరోగ్య శాఖ చేపట్టిన చర్యలివే.. 
- 75 మంది ప్రయాణికులకు వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసి దీని ద్వారా రోజువారీ జాగ్రత్తలు, సలహాలు ఇవ్వడం
వారు ఎవరెవరితో తిరిగారో తెలుసుకుని, వారికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించడం
- విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులెవరైనా 28 రోజుల తర్వాతే తిరుమల దర్శనానికి వెళ్లేలా చర్యలు
- ఆర్టీసీ బస్సులు, రైళ్లను రోజూ శుభ్రం చేయడం

విద్యా సంస్థలకు యూజీసీ, ఎమ్‌హెచ్‌ఆర్‌డీ సూచనలు
కరోనా (కోవిడ్‌ –19) వైరస్‌ క్రమేణా విస్తరిస్తున్న నేపథ్యంలో దాని నివారణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్ని విద్యాసంస్థలకు కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ (ఎమ్‌హెచ్‌ఆర్‌డీ), యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) ఆదేశాలు జారీచేశాయి. కరోనా వైరస్‌ రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని యూజీసీ అన్ని యూనివర్సిటీలు, వాటి అనుబంధ, గుర్తింపు పొందిన కాలేజీలకు సూచనలు జారీచేసింది. 
- విద్యార్థులు పెద్దపెద్ద గుంపులుగా ఒకే చోట చేరకుండా చూడాలి
èజలుబు, దగ్గు వంటి లక్షణాలతో కనిపిస్తే వెంటనే చికిత్స కేంద్రాలకు పంపాలి.
- చికిత్స పూర్తయ్యే వరకు ఆ విద్యార్థులు క్యాంపస్‌కు రాకుండా చూడాలి.
- విద్యార్థులు చేతులు కడుక్కోవడం వంటి జాగ్రత్తలు పాటించేలా చూడాలి.
- ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలి. ముక్కు చీదినప్పుడు, తుమ్మినప్పుడు టిష్యూపేపర్లను అడ్డం పెట్టుకోవాలి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top