విద్యార్థికి పాముకాటు.. పరిస్థితి విషమం 

A Student Who Went Outdoors For Fecal Excrement Suffered A Snake Bite - Sakshi

మలవిసర్జనకు వెళ్లినప్పుడు ఘటన 

ఆలస్యంగా వెలుగు చూసిన వైనం 

మల విసర్జన కోసమని ఆరుబయటకు వెళ్లిన విద్యార్థి పాముకాటుకు గురయ్యాడు. నీటి సౌకర్యం లేక మరుగుదొడ్లు వినియోగించలేని పరిస్థితి నెలకొనడంతో ఆరుబయటకు వెళ్లి విద్యార్థి విషపురుగుబారిన పడ్డాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. వెంటిలేటర్‌పై మృత్యువుతో పోరాడుతున్నాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

అనంతపురం న్యూసిటీ/ ధర్మవరం రూరల్‌: ధర్మవరం మండలం పోతుకుంట గ్రామం గిర్రాజుకాలనీ కు చెందిన గంగమ్మ, ఈరమ్మ దంపతులు. వీరికి ఎనిమిదేళ్ల కుమారుడు పవన్‌కుమార్, దివ్యాంగురాలైన తొమ్మిదేళ్ల కుమార్తె గంగోత్రి ఉన్నారు. ఈరప్ప ట్రాక్టర్, గంగమ్మ కూలిపనికి వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని ఈ కుటుంబంపై విధి చిన్నచూపు చూసింది. గంగమ్మ క్యాన్సర్‌ బారిన పడింది. ప్రస్తుతం ఆరోగ్యం సహకరించినపుడు మాత్రమే కూలి పనికెళ్తూ భర్తకు చేదోడువాదోడుగా నిలుస్తోంది. ఇటీవల భర్త ఈరప్ప కూడా అనారోగ్యం బారిన పడ్డాడు. దీంతో కుటుంబ పోషణ భారంగా మారింది. 

చెత్తదిబ్బలో పాముకాటు 
గిర్రాజుకాలనీలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న పవన్‌కుమార్‌ ఈ నెల 17న మధ్యాహ్నం మలవిసర్జన కోసమని తరగతి గది వెనుక వైపు ఉన్న చెత్తదిబ్బవద్దకు వెళ్లాడు. చెత్తలో దాగున్న పాము పవన్‌కుమార్‌ కాలికి కాటు వేసింది. పామును చూసి భయపడిపోయిన విద్యార్థి తరగతి గదిలోకి వెళ్లి ఉపాధ్యాయుడు ఈశ్వరయ్యకు తెలిపాడు. వెంటనే ఆయన విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించి.. తన ద్విచక్రవాహనంలో ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాడు. జరిగిన విషయాన్ని ఎంఈఓ సుధాకర్‌కు ఫోన్‌ చేసి చెప్పారు. అనంతరం ఎంఈఓ సహకారంతో మెరుగైన వైద్యం కోసం విద్యార్థిని అనంతపురం సర్వజనాస్పత్రిలో చేర్చారు. హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్న తల్లి గంగమ్మ కుమారుడిని చూసి బోరున విలపించింది. దేవుడా.. ఎంత పనిచేశావయ్యా అంటూ రోదించింది. ప్రస్తుతం పవన్‌కుమార్‌కు చిన్నపిల్లల వార్డులోని వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. 

ప్రహరీ లేకపోవడంతో 
పాఠశాలకు ప్రహరీ లేకపోవడంతో సమీపంలోని ముళ్ల పొదల నుంచి విష పురుగులు వస్తుంటాయని స్థానికులు అంటున్నారు. ఇటీవల పాఠశాల సమీపంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు భూముల క్రయవిక్రయాల కోసం ముళ్ల పొదలను తొలగించారు. ముళ్ల పొదలలో ఉన్న పాములు, తేళ్లు, మండ్రేగబ్బలు పాఠశాల ఆవరణంతో పాటు కాలనీలోకి వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.  విద్యార్థి పాము కాటుకు గురవడంతో పాఠశాల చుట్టూ పెరిగిన పిచ్చిమొక్కలను ఉపాధ్యాయులు సొంత నిధులు వెచ్చించి తొలగించారు.  

ఆ అవసరాలకు.. ఆరుబయటే.. 
పాఠశాలలో మరుగుదొడ్లు ఉన్నప్పటికీ నీటి సౌకర్యం లేదు. దీంతో ఆ అవసరాలు తీర్చుకోవాలంటే విద్యార్థులు ఆరుబయటకు వెళ్లాల్సి వస్తోంది. ఈ పాఠశాలలో మొత్తం 22 మంది విద్యార్థులు ఉన్నారు. భోజన, విరామ సమయాల్లో విద్యార్థులు పాఠశాల ఆవరణంలోనే ఆడుకుంటారు. పాఠశాల చుట్టూ చెత్తా చెదారం ఉండడంతో పాములు చేరే అవకాశం ఉందని కాలనీ వాసులు అంటున్నారు.  

డీఈఓ పరామర్శ 
మృత్యువుతో పోరాడుతున్న పవన్‌కుమార్‌ను డీఈఓ శామ్యూల్, ఎంఈఓ సుధాకర్‌ నాయక్, హెచ్‌ఎం ఈశ్వరయ్య శుక్రవారం సర్వజనాస్పత్రిలో పరామర్శించారు. విద్యార్థి ఆరోగ్య పరిస్థితిని వైద్యులతో అడిగి తెలుసుకున్నారు.  

నా బిడ్డ త్వరగా కోలుకోవాలి 
అయ్యా క్యాన్సర్‌తో బాధపడుతున్న నేను ఎన్నాళ్లుంటానో తెలియదు. కనీసం మా బిడ్డలైనా బాగా జీవించాలని అనుకున్నాం. వాళ్ల కోసమే బతుకుతున్నాం. నా భర్త అనారోగ్యంతో బాధపడుతున్నాడు. రోజూ పనికెళ్తేనే నాలుగు మెతుకులు తింటాం. క్యాన్సర్‌ జబ్బు చేసినప్పటి నుంచి మరీ ఇబ్బంది పడుతున్నాం. నా బిడ్డ త్వరగా కోలుకోవాలి. అమ్మా అని పిలవాలి. ఆ దేవుడిపైనే భారం వేశాను.       – గంగమ్మ   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top