అవినీతి రహిత పాలన దిశగా..

YS Jaganmohan Reddy has been in the process of eradicating corruption in the construction of projects - Sakshi

హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో జ్యుడిషియల్‌ కమిషన్‌

హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని కోరిన సీఎం వైఎస్‌ జగన్‌

నీతిమంతంగా నీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపడతాం

టెండర్ల ప్రక్రియను న్యాయ వ్యవస్థ చేతిలో పెడతాం

కమిషన్‌ సూచన మేరకు టెండర్ల ప్రక్రియలో మార్పులు చేస్తాం

దేశమంతా ఏపీవైపు చూసేలా టెండర్‌ విధానంలో సంస్కరణలకు సిద్ధం

సాక్షి, అమరావతి: ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి నిర్మూలనకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నడుం బిగించారు. అవినీతితో కునారిల్లిపోయిన టెండరింగ్‌ విధానంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అవినీతి జరిగిందని న్యాయ వ్యవస్థను ఆశ్రయిస్తున్న స్థితిని మార్చి, అవినీతికి ఏ మాత్రం ఆస్కారం లేకుండా న్యాయ వ్యవస్థ చేతికే టెండరింగ్‌ విధాన నిర్ణయాన్ని అప్పగించాలని నిర్ణయించారు. దేశంలోనే తొలిసారిగా, దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్‌ వైపు చూసేలా గొప్ప పారదర్శక విధానానికి శ్రీకారం చుడుతూ అడుగు వేశారు. సీఎం పదవి స్వీకరిస్తూ, మే 30న తాను ప్రకటించిన విధంగా టెండర్‌ విధానంలో సంస్కరణలు కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌ కుమార్‌ను వైఎస్‌ జగన్‌ కలిశారు. సాయంత్రం 6 గంటలకు ఏసీజే ఇంటికి వెళ్లిన ఆయన దాదాపు గంట పాటు అక్కడ గడిపారు.

సీఎం వెంట ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజయ్‌ కల్లాం, అడ్వొకేట్‌ జనరల్‌గా నియమితులైన సుబ్రహ్మణ్యం శ్రీరామ్, అదనపు అడ్వొకేట్‌ జనరల్‌గా నియమితులు కానున్న పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా ఏసీజేను జగన్‌మోహన్‌రెడ్డి శాలువా కప్పి సన్మానించారు. అనంతరం టెండర్లలో అవినీతికి ఆస్కారమే లేని పారదర్శక విధానాన్ని తీసుకు వచ్చేందుకు ప్రత్యేకమైన జుడిషియల్‌ కమిషన్‌ ఏర్పాటు చేయాల్సిందిగా ఏసీజేకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఇందు కోసం ప్రత్యేకించి ఒక హైకోర్టు జడ్జిని కేటాయించాలని కోరారు. హైకోర్టు జడ్జి ఆధ్వర్యంలోని కమిషన్‌కు, సిబ్బందికి అయ్యే వ్యయం మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే భరిస్తుందన్నారు. 

కమిషన్‌ సూచన మేరకు టెండర్ల ప్రక్రియలో మార్పులు
వివిధ ప్రాజెక్టుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పిలిచే టెండర్లను ముందుగానే హైకోర్టు జడ్జి నేతృత్వంలోని కమిషన్‌కు పంపుతామని, టెండర్‌కు సంబంధించిన అంశాలపై జుడిషియల్‌ కమిషన్‌ సంబంధిత ప్రభుత్వ అధికారులతో చర్చించి మార్పు, చేర్పుల్ని సూచిస్తే ఆ ప్రకారంగానే టెండర్లు పిలుస్తామని ముఖ్యమంత్రి జగన్‌.. ఏసీజేకు విన్నవించారు. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఒక టైలర్‌ మేడ్‌గా, అంటే.. కమీషన్ల కోసం తాను ముందుగానే నిర్ణయించుకున్న కాంట్రాక్టర్‌కు ఉన్న అనుభవం, అర్హతల ప్రకారం టెండర్‌ నిబంధనలు తయారు చేసి, వారికే టెండర్‌ దక్కేలా చేసిన విధానం వల్ల వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి పదవి స్వీకరిస్తున్న సమయంలోనే ప్రజలకు వివరించిన విషయం తెలిసిందే. ప్రతి టెండర్‌లోనూ 20 నుంచి 25 శాతం మేర అవినీతి జరిగిందని, ఆమేరకు ప్రజాధనాన్ని మిగిల్చే విధంగా రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని అమలు చేస్తామని కూడా ఆయన ఇదివరకే ప్రకటించారు. తద్వారా ఇరిగేషన్‌ కాంట్రాక్టులంటేనే అవినీతి, అక్రమాలకు మారుపేరుగా మారిన పరిస్థితి నుంచి పూర్తి పాదర్శకమైన విధానాన్ని అమలు చేయడానికి ముందడుగు వేశారు. దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా సంస్కరణలు తీసుకురానున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top