క్రమశిక్షణగా.. కట్టుదిట్టంగా..

జిల్లాలో పకడ్బందీగా కరోనా నిబంధనలు
స్వీయ నిర్బంధంపై గట్టి దృష్టి
జిల్లాలో ఎక్కడికక్కడ 144 సెక్షన్ అమలు
ఫలించిన పోలీసుల చర్యలు
తగ్గుముఖం పట్టిన జనసంచారం
క్వారంటైన్‌ల ఏర్పాటుకు చర్యలు
స్వచ్ఛందంగా దుకాణాల మూసివేత
ఎక్కడికక్కడ ప్రజలు కూడా బయటికి రాని వైనం
నిత్యావసర ధరలపై కలెక్టర్, జేసీ స్పందన
సాక్షి కడప : కలవరపెడుతున్న కరోనా వైరస్‌పై జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో స్వీయ నిర్బంధంపై ఎక్కువ దృష్టి సారించింది. దీనిపై విస్తృత ప్రచారాన్ని చేస్తోంది. జనం నుంచి ఈ దిశగా సహకారాన్ని కోరుతోంది. సోమవారం కొంచెం పరిస్థితులు గాడితప్పినట్లు కనిపించినా మంగళవారం జిల్లాలో ఎక్కువ మంది స్వచ్ఛందంగా ఇళ్లకు పరిమితమయ్యారు. ఈ విషయంలో పోలీసుల చర్యలు ఫలించాయి. కడప నగరంలోనే కాకుండా జిల్లాలోని ఇతర ప్రాంతాలలోనూ పోలీసులు గట్టిగా స్పందించారు. అత్యవసరమైతే మినహా ఎవరినీ రోడ్లపై అనుమతించడం లేదు.
అధిక ధరకు అమ్మితే చర్యలు
కూరగాయలు, నిత్యావసర సరుకుల దుకాణదారులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా యంత్రాంగం హెచ్చరిస్తోంది. మంగళవారం కడపలోని రైతు బజారును జిల్లా కలెక్టర్ హరికిరణ్, జేసీ గౌతమి సందర్శించారు. మార్కెట్ లోపలగానీ, బయటగానీ ఎక్కడైనా సరే ఎమ్మార్పీ ధరకు, లేదంటే కూరగాయలు నిర్ణయించిన ధరకే విక్రయించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలను వసూలు చేయాలని చూస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు కూడా హెచ్చరించారు. బజారులో ప్రజలు కూడా సామాజిక దూరాన్ని పాటించాలని అధికారులు సూచించారు. కలెక్టర్ మంగళవారం సాయంత్రం రిమ్స్‌ను కూడా సందర్శించారు. అక్కడ ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న బాధితుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వసతులు, పరిస్థితులు, ఇతర అవసరాల విషయమై రిమ్స్ అధికారులతో చర్చించి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు.
జిల్లాలో కలియ తిరిగిన ఎస్పీ
జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కలియ తిరిగారు. కడప నుంచి నేరుగా ఖాజీపేట, మైదుకూరు, బద్వేలు, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల మీదుగా పులివెందులకు చేరుకున్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ సిబ్బందితో చర్చించడంతోపాటు పలువురు దుకాణదారులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని సూచించడంతోపాటు సిబ్బందికి కరోనా వైరస్ నేపధ్యంలో వాహనాలు తిరగకుండా కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఎక్కడికక్కడ 144 సెక్షన్ అమలుతోపాటు నిబంధనల అంశాలపై కిందిస్థాయి పోలీసు అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
రెండోరోజు స్వచ్ఛంద మద్దతు
సోమవారంతో పోల్చితే మంగళవారం ఎక్కువ మంది ఇళ్లకు పరిమితమయ్యారు. రద్దీ ప్రాంతాలు కూడా లాక్‌డౌన్ నేపధ్యంలో పలుచగా కనిపించాయి. కడపతో పాటు ప్రొద్దుటూరు, పులివెందుల, రాజంపేట, రైల్వేకోడూరు, రాజంపేట, మైదుకూరు, బద్వేలు, కమలాపురం, జమ్మలమడుగు తదితర ప్రాంతాల్లో స్వచ్ఛందంగా షాపులు మూíసివేసి మద్దతు ప్రకటిస్తున్నారు. ఎక్కడా కూడా షాపులను ఎవరూ తెరవకుండా మద్దతు తెలుపుతున్నారు. ప్రధాన కూడళ్లలోని షాపులు మూసి ఉన్నాయి. మధ్యాహ్న సమయంలో కర్ఫ్యూ వాతావరణం స్పష్టంగా కనిపించింది. పోలీసులు పహారా కాస్తూ నిబంధనలు పాటించనివారిపై కన్నెర్ర చేస్తున్నారు. కొందరికి నచ్చజెబుతున్నారు. కరోనా తీవ్రతను వివరించి వాహన చోదకులను వెనక్కు పంపుతున్నారు.
కామన్ క్వారంటైన్ల ఏర్పాటుకు చర్యలు
జిల్లా కేంద్రంలో టీటీడీసీ, వైవీయూలోని గెస్ట్‌హౌస్, రీసెర్చి స్కాలర్స్ హాస్టల్‌లలో క్వారంటైన్లను ఏర్పాటు చేస్తున్నారు. విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారిని నేరుగా క్వారంటైన్ కేంద్రాలకు తరలించి వైద్య సేవలు అందించనున్నారు. అక్కడ ఉచిత భోజనాలు, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. కడపలోనే కాకుండా ప్రొద్దుటూరు, పులివెందుల, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు, బద్వేలు, తదితర ప్రాంతాలలో కామన్ క్వారంటైన్ కేంద్రాల ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది.ఇప్పటివరకు విదేశాల నుంచి సుమారు 2800 మందికి పైగా వచ్చారు. వారందరికీ స్వీయ నిర్బంధంలో సేవలు అందిస్తున్నారు. రాజంపేట నవోదయ విద్యార్థులు ప్రత్యేక అవసరాల నిమిత్తం వెళ్లి తిరిగి రావడంతో వారందరినీ కామన్ క్వారంటైన్‌కు తరలించి ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నారు. కాశీ నుంచి దాదాపు 60 మంది విద్యార్థులు కూడా సోమవారమే గుంతకల్లుకు వచ్చి జిల్లాకు రాగానే అందరినీ క్వారంటైన్‌కు తరలించారు.
జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు
కడప అర్బన్: ‘కరోనా వైరస్’ వ్యాప్తి అరికట్టేందుకు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో జిల్లాలో సెక్షన్ 144 అమలులో ఉందనీ, రోడ్లపై గుంపులు, గుంపులుగా తిరిగితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ హెచ్చరించారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్న 20 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసుల్లో 20 వాహనాలు సీజ్ చేశామని ఆయన పేర్కొన్నారు. ఈనెల 31 వరకు జిల్లాలో 144 సెక్షన్ కొనసాగుతుందని ప్రజలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌కు సహకరించాలని కోరారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి