6 రోజుల ర్యాలీకి బ్రేక్‌- చివరికి నష్టాలే

6 week rally ends in volatile session - Sakshi

రోజంతా ఆటుపోట్ల మధ్య కదిలిన మార్కెట్లు

34,000 పాయింట్ల మార్క్‌ దిగువకు సెన్సెక్స్‌

ప్రయివేట్‌ రంగ బ్యాంక్‌ కౌంటర్లలో అమ్మకాలు

ఎన్‌ఎస్‌ఈలో మీడియా, ఫార్మా, ఐటీ జోరు

చిట్టచివరికి ఆరు రోజుల వరుస లాభాలకు బ్రేక్‌ పడింది. రోజంతా హెచ్చుతగ్గుల మధ్య కదిలిన మార్కెట్లు చివరికి ప్రస్తావించదగ్గ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 129 పాయింట్లు క్షీణించి 33,981 వద్ద నిలవగా.. 32 పాయింట్లు నీరసించిన నిఫ్టీ 10,029 వద్ద ముగిసింది. దీంతో సెన్సెక్స్‌ 34,000 పాయింట్ల మైలురాయి దిగువన స్థిరపడింది. ప్రపంచ స్టాక్‌ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందినప్పటికీ ట్రేడర్లు లాభాల స్వీకరణకే ప్రాధాన్యత ఇవ్వడంతో మార్కెట్లు మిడ్‌సెషన్‌ నుంచీ నేలచూపులకే  పరిమితమయ్యాయి. ఎంపిక చేసిన కౌంటర్లలో తొలుత ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. వెరసి సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 34,310 వద్ద గరిష్టాన్ని, 33,711 వద్ద కనిష్టాన్నీ తాకింది. ఈ బాటలో నిఫ్టీ 10,124- 9944 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులు చవిచూసింది.

పీఎస్‌యూ బ్యాంక్స్‌ ప్లస్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా మీడియా, ఫార్మా, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్స్‌ 4-1 శాతం మధ్య పుంజుకోగా.. ప్రయివేట్‌ బ్యాంక్స్‌ 3 శాతం, రియల్టీ 2 శాతం చొప్పున వెనకడుగు వేశాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్‌, కొటక్‌ మహీంద్రా, యాక్సిస్‌, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 4.7-2.4 శాతం మధ్య పతనమయ్యాయి. అయితే వేదాంతా, ఎయిర్‌టెల్‌, జీ, టెక్‌ మహీంద్రా, సన్‌ ఫార్మా, విప్రో, సిప్లా, హెచ్‌సీఎల్‌ టెక్‌, పవర్‌గ్రిడ్‌, టీసీఎస్‌ 7.7-2.4 శాతం మధ్య జంప్‌చేశాయి.

ఫైనాన్స్‌ వీక్‌
డెరివేటివ్స్‌లో చోళమండలం, బంధన్‌ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, ఉజ్జీవన్‌, పిరమల్‌, అపోలో టైర్‌ 8.3-4 శాతం మధ్య కుప్పకూలాయి. కాగా.. ఐడియా, ఇండిగో, జిందాల్‌ స్టీల్‌, పీవీఆర్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌, లుపిన్‌ 10-5 శాతం మధ్య జంప్‌చేశాయి. బీఎస్‌ఈలో 1304 షేర్లు లాభపడగా.. 1148 నష్టాలతో నిలిచాయి.

ఎఫ్‌పీఐల ఇన్వెస్ట్‌మెంట్స్‌
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,851 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 782 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top