కోవిడ్‌ కల్లోలంలో ప్రపంచ మార్కెట్‌!

Covid 19 Effect on Global Markets - Sakshi

చైనాను గడగడలాడిస్తున్న కోవిడ్‌–19(కరోనా) వైరస్‌ 28కు పైగా దేశాలకు పాకడంతో ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి. ఈ ప్రభావంతో మన మార్కెట్‌ కూడా సోమవారం భారీగా నష్టపోయింది. చైనా, ఇతర దేశాల్లో కోవిడ్‌–19 వైరస్‌ కారణంగా తయారీ కార్యకలాపాలు మందగించి సరఫరా సమస్యలు తలెత్తగలవన్న ఆందోళనతో అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనం కావడం కూడా ప్రభావం చూపించింది. సెన్సెక్స్, నిఫ్టీలు కీలకమైన మద్దతు స్థాయిలను కోల్పోయాయి. సెన్సెక్స్‌ 40,500 పాయింట్లు, నిఫ్టీ 11,900 పాయింట్ల దిగువకు పడిపోయాయి.  సెన్సెక్స్‌ 807 పాయింట్లు నష్టపోయి 40,363 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 251 పాయింట్లు నష్టపోయి 11,829 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీలు చెరో 2 శాతం మేర క్షీణించాయి. స్టాక్‌ మార్కెట్‌కు ఇది ఈ ఏడాది రెండో అతి పెద్ద పతనం. కేంద్ర బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన ఫిబ్రవరి 1న సెన్సెక్స్‌ 987 పాయింట్లు పతనమైంది.

ఈ కల్లోలం మరికొంత కాలం....!  
 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటన నేపథ్యంలో వాణిజ్య ఒప్పందం కుదిరే విషయమై అనిశ్చితి నెలకొనడం కూడా ప్రతికూల ప్రభావం చూపించింది. ముడి చమురు ధరలు 4 శాతం మేర పతనమైనా, మన మార్కెట్లో  నష్టాలు ఆగలేదు. కోవిడ్‌–19 వైరస్‌ కల్లోలం మరికొంత కాలం కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్ల పతనం కారణంగా పెట్టుబడులు సురక్షిత సాధనాలైన డాలర్, పుత్తడిలోకి మరలిపోతున్నాయి. ఫలితంగా బంగారం ధరలు భగ్గుమన్నాయి. పుత్తడి ధర ఏడేళ్ల గరిష్ట స్థాయికి చేరింది. ఔన్స్‌ బంగారం 1,700 డాలర్లకు చేరువయ్యింది. దేశీయంగా 10 గ్రాముల బంగారం రూ.44,000 దాటేసింది. 

లోహ షేర్లు విలవిల..
ప్రపంచంలో లోహాలను అత్యధికంగా వినియోగించేది చైనా. ఇప్పుడు ఈ దేశంలో కోవిడ్‌–19 వైరస్‌ కారణంగా ఉత్పత్తి కార్యకలాపాలు కుంటు పడుతున్నాయి. ఇది మరికొంత కాలం కొనసాగతే, లోహాల వినియోగం తగ్గగలదన్న భయాలతో ఇన్వెస్టర్లు లోహ షేర్లను తెగనమ్మారు. దీంతో లోహ షేర్లు భారీగా క్షీణించాయి. అన్ని రంగాల సూచీల్లో లోహ సూచీయే అత్యధికంగా నష్టపోయింది.

ఈ నష్టాలు ఎందుకంటే...
1. కోవిడ్‌–19 కల్లోలం  
చైనాలో కాకుండా కొత్త ప్రాంతాలకు కోవిడ్‌–19 వైరస్‌ విస్తరిస్తోంది. దక్షిణ కొరియా, ఇటలీ, ఇరాన్‌ల్లో కోవిడ్‌–19(కరోనా) వైరస్‌ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.  విస్తరిస్తున్న కోవిడ్‌–19 వైరస్‌ ప్రభావం అంతర్జాతీయంగా వృద్ధిపై అంచనాల కంటే అధికంగానే ఉండొచ్చన్న భయాందోళనలతో ప్రపంచ మార్కెట్లు భారీగా నష్టపోయాయి.  ఆసియా మార్కెట్లు 2–3 శాతం రేంజ్‌లో, యూరప్‌ మార్కెట్లు 4 శాతం మేర నష్టపోయాయి. అన్ని దేశాల్లో  పర్యాటక, విమానయాన రంగ షేర్లు బాగా నష్టపోయాయి.  
2. రూపాయి 34 పైసలు డౌన్‌...
డాలర్‌తో రూపాయి మారకం విలువ 34 పైసలకు పైగా పతనమై 71.98కు తగ్గడం కూడా ప్రతికూల ప్రభావం చూపించింది. ఇది మూడు నెలల కనిష్ట స్థాయి. ఇంట్రాడేలో           72.01ను తాకింది.  
3. సరఫరాలపై ప్రభావం....
వాహన, మొబైల్‌ ఇతర పరిశ్రమలకు అవసరమైన విడిభాగాలను మన కంపెనీలు ఎక్కువగా చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. కోవిడ్‌–19 వైరస్‌ కారణంగా ఈ విడిభాగాల సరఫరాల్లో సమస్యలు తలెత్తుతాయని, ఇది డిమాండ్, అమ్మకాలపై తీవ్రంగానే ప్రభావం చూపగలదన్న అంచనాలతో అన్ని రంగాల కంపెనీల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి.  
4. జీడీపీ అంచనాలు  
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2019–2020) భారత్‌ వృద్ధి 4.9 శాతం  మాత్రమే ఉంటుందని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అప్లైయిడ్‌ ఎకనామిక్‌ రీసెర్చ్‌(ఎన్‌సీఏఈఆర్‌) అంచనా వేస్తోంది. కేంద్ర గణాంకాల సంస్థ 5 శాతం అంచనాల కంటే ఇది తక్కువ. కాగా ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్‌ జీడీపీ అంచనాలు ఈ వారంలోనే వెలువడుతాయి.

రూ.3 లక్షల కోట్ల సంపద ఆవిరి
స్టాక్‌ మార్కెట్‌ భారీ నష్టాల కారణంగా రూ.3 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ.3.18 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.155.33 లక్షల కోట్లకు పరిమితమైంది.

మరిన్ని విశేషాలు...
సెన్సెక్స్‌లోని అన్ని (30) షేర్లూ నష్టపోయాయి.  
టాటా స్టీల్‌ 6.3% నష్టంతో రూ.415 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే.  
ఎయిర్‌పోర్ట్‌ బిజినెస్‌లో 49 శాతం వాటాను ఫ్రాన్స్‌కు చెందిన గ్రపే ఏడీపీ కంపెనీకి జీఎమ్‌ఆర్‌ ఇన్‌ఫ్రా విక్రయించనున్నది. ఈ విక్రయానికి కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) ఆమోదం తెలపడంతో జీఎమ్‌ఆర్‌ ఇన్‌ఫ్రా షేర్‌ 8 శాతం లాభంతో రూ.25.45 వద్ద ముగిసింది.  
170కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. జిల్లెట్‌ ఇండియా, హీరో మోటొకార్ప్, ఎల్‌ అండ్‌ టీ, హిందుస్తాన్‌ జింక్, ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్,  షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. మార్కెట్‌ భారీగా నష్టపోయినా, 50కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top