నెలకు 11 జీబీ డేటా!!

Indians on average consume over 11GB data per month - Sakshi

భారతీయుల సగటు వినియోగం

చౌక డేటా ప్లాన్లు, హ్యాండ్‌సెట్స్‌ ఊతం

నోకియా నివేదికలో వెల్లడి...

న్యూఢిల్లీ: చౌక డేటా ప్లాన్లు, అందుబాటు ధరల్లో స్మార్ట్‌ఫోన్లు, వీడియో సేవలు, 4జీ నెట్‌వర్క్‌ విస్తరించడం తదితర అంశాల ఊతంతో దేశీయంగా మొబైల్‌ డేటా వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం నెలకు సగటున 11 జీబీ స్థాయిలో వినియోగం ఉంటోంది. టెలికం పరికరాల తయారీ సంస్థ నోకియా రూపొందించిన వార్షిక మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఇండియా ట్రాఫిక్‌ ఇండెక్స్‌ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 4జీ ఊతంతో 2019లో డేటా ట్రాఫిక్‌ 47 శాతం పెరిగింది. 3జీ డేటా ట్రాఫిక్‌ 30 శాతం క్షీణించింది.

మొత్తం డేటా వినియోగంలో 4జీ వాటా 96 శాతంగా ఉంది. ప్రపంచంలోనే అత్యంత తక్కువగా జీబీకి రూ. 7 స్థాయిలో భారత్‌లో డేటా చార్జీలు ఉన్నాయి. ఆన్‌లైన్‌లో అరగంట నిడివి వీడియో చూసేందుకు లేదా 200 పాటలను వినేందుకు సుమారు ఒక జీబీ డేటా సరిపోతుంది. కంటెంట్‌ నాణ్యతను బట్టి డేటా వినియోగం పెరుగుతుంది. సంపన్న దేశాల స్థాయిలో దేశీయంగా బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులు విస్తరించే దాకా మొబైల్‌ డేటా వినియోగం పెరుగుతూనే ఉండవచ్చని నోకియా ఇండియా చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ అమిత్‌ మార్వా తెలిపారు.  

నివేదికలోని మరిన్ని వివరాలు..
► ప్రపంచవ్యాప్తంగా మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లోనే డేటా వినియోగం అత్యధికంగా ఉంటోంది. ఈ విషయంలో చైనా, అమెరికా, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, జర్మనీ, స్పెయిన్‌ల కన్నా ముందు ఉంది.  
► 4జీ డేటా వినియోగదారుల సంఖ్య 59.8 కోట్లు కాగా, 3జీ యూజర్ల సంఖ్య 4.4 కోట్లు.
► నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో తదితర ఓవర్‌ ది టాప్‌ ప్లాట్‌ఫాంల ఊతంతో దేశీ యం గా వీడియోల వినియోగం భారీగా పెరిగింది.  
► ఓటీటీ ప్లాట్‌ఫాంలపై యూజర్లు రోజుకు సగటున 70 నిమిషాలు వెచ్చిస్తున్నారు. ఒక్కో సెషను సగటున సుమారు 40 నిమిషాలు ఉంటోంది.  
► 2019లో 4జీ హ్యాండ్‌సెట్స్‌ సంఖ్య 50.1 కోట్లకు చేరినట్లు అంచనా. అంతక్రితం ఏడాది ఇది 33 కోట్లు. వాయిస్‌ ఓవర్‌ ఎల్‌టీఈ ఆధారిత స్మార్ట్‌ఫోన్ల సంఖ్య 43.2 కోట్లకు చేరింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top