ఇక ‘స్మార్ట్‌’ మహీంద్రా!

Mahindra And Mahindra Company Concentration Of  Electrical Model Vehicles - Sakshi

కేయూవీ, ఎక్స్‌యూవీల్లో ఎలక్ట్రిక్‌ వెర్షన్ల తయారీ

న్యూఢిల్లీ: వాహనాల వ్యాపార విభాగంలో శరవేగంగా మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఇకపై కనెక్టెడ్‌ వాహనాలు, పెట్రోల్‌ ఇంజిన్లు, ఎలక్ట్రిక్‌ వాహనాలపై (ఈవీ) మరింతగా దృష్టి పెట్టాలని మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) నిర్ణయించింది. మహారాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన ఈవీ విధానం కింద తమ ఎలక్ట్రిక్‌ వాహనాల ప్రాజెక్టుపై రూ.500 కోట్లు వెచ్చించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఎస్‌యూవీలైన కేయూవీ 100, ఎక్స్‌యూవీ300 వాహనాల్లో ఎలక్ట్రిక్‌ వెర్షన్లు కూడా రూపొందిస్తున్నట్లు 2018–19 వార్షిక నివేదికలో ఎంఅండ్‌ఎం వివరించింది. గతంలో మాదిరి సరైన ధరతో సరైన ఉత్పత్తిని ప్రవేశపెడితే సరిపోదని.. మార్కెట్లో నెగ్గుకురావాలంటే మరింతగా కృషి చేయాల్సి ఉంటుందని తెలిపింది. 

‘పర్యావరణ కాలుష్యం, రహదారులపై భద్రత వంటి అంశాలపై జాగ్రత్తలు పెరుగుతున్న నేపథ్యంలో ఇంధనాల వినియోగం, వాహనాల కొనుగోలు తీరు తెన్నులు మారుతున్నాయి. రాబోయే రోజుల్లో ఆటోమోటివ్‌ పరిశ్రమపై ఇవి చాలా పెద్ద ప్రభావమే చూపిస్తాయి‘ అని ఎంఅండ్‌ఎం పేర్కొంది. అమెరికన్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం ఫోర్డ్‌తో కలిసి కనెక్టెడ్‌ వాహనాలను రూపొందించనున్నట్లు వివరించింది. ఇంటర్నెట్, బ్లూటూత్‌ తదితర టెక్నాలజీల ద్వారా నియంత్రించగలిగే వాహనాలు ఈ కోవకు చెందుతాయి. నిలకడగా వృద్ధి సాధించే లక్ష్యంతో ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను పటిష్టపర్చుకోవడం, ప్రస్తుత ఉత్పత్తుల్లో కొత్త వేరియంట్లు ప్రవేశపెట్టడం, పరిశోధన.. అభివృద్ధి సామర్థ్యాలను పెంచుకోవడంపై దృష్టి పెడుతున్నట్లు వివరించింది. 2018–19లో మహీంద్రా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ (ఎంఈఎంఎల్‌) మొత్తం 10,276 ఎలక్ట్రిక్‌ వాహనాలు విక్రయించింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం 4,026 యూనిట్లు మాత్రమే విక్రయించింది.

ఈవీ చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనల ఆహ్వానం

న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగానికి ప్రధాన ఆధారమైన చార్జింగ్‌ సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఫేమ్‌–2 పథకం కింద దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో ఈవీ చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు ఆసక్తి కలిగిన సంస్థల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం రూ.లక్ష జనాభా కంటే ఎక్కువ మంది ఉన్న పట్టణాలు, ప్రభుత్వం నోటిఫై చేసిన స్మార్ట్‌సిటీలు, మెట్రో నగరాలకు అనుసంధానమైన శాటిలైట్‌ పట్టణాలకు ఈ ప్రతిపాదనలను కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ఆహ్వానం పలికింది. తొలి విడత కింద 1,000 ఈవీ చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు ఆసక్తి వ్యక్తీకరణ తెలియజేయాలని కోరింది. ఆ తర్వాత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వీటిని మంజూరు చేయనున్నట్టు తెలిపింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top