మహీంద్రా మేనేజ్‌మెంట్‌లో భారీ మార్పులు

Mahindra announces management changes on April 2020 - Sakshi

చైర్మన్‌గా తప్పుకుంటున్న ఆనంద్‌ మహీంద్రా

ఇకపై నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా కొనసాగింపు

ఎండీ, సీఈవోగా పవన్‌ కుమార్‌ గోయెంకా

2020 ఏప్రిల్‌ నుంచి అమల్లోకి 2021 తర్వాత సీఈవో, ఎండీగా అనీష్‌ షా

న్యూఢిల్లీ: వ్యవసాయోత్పత్తుల నుంచి ఐటీ దాకా వివిధ రంగాల్లో విస్తరించిన మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) టాప్‌ మేనేజ్‌మెంట్‌లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ హోదా నుంచి ఆనంద్‌ మహీంద్రా (64) తప్పుకోనున్నారు. 2020 ఏప్రిల్‌ 1 తర్వాత నుంచి నాన్‌–ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా కొనసాగుతారు. శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కంపెనీ ఈ విషయాలు వెల్లడించింది. దీని ప్రకారం పవన్‌ కుమార్‌ గోయెంకా మరోసారి మేనేజింగ్‌ డైరెక్టరుగా నియమితులయ్యారు. అలాగే, 2020 ఏప్రిల్‌ 1 నుంచి ఏడాది పాటు ఆయన చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ (సీఈవో) బాధ్యతలు కూడా నిర్వర్తించనున్నారు. అటు పైన గోయెంకా పదవీ విరమణ అనంతరం 2021 ఏప్రిల్‌ 1 నుంచి అనీష్‌ షా .. ఎండీ, సీఈవోగా ఉంటారు.

ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీతో పాటు సమీప భవిష్యత్‌లో చేపట్టే ఇతరత్రా ప్రాజెక్టులు సజావుగా అమలయ్యేలా చూసేందుకు ప్రత్యేకంగా సీఈవో పదవిని ఏర్పాటు చేసినట్లు ఎంఅండ్‌ఎం తెలిపింది. ఇంకా కొన్ని మార్పులు, చేర్పులు ఉంటాయని, డిసెంబర్‌ 23న వాటిని వెల్లడించనున్నామని పేర్కొంది. కీలక నియామకాలకూ సంబంధించి కంపెనీలో అంతర్గత సిబ్బందితో పాటు బైటివారినీ ఇంటర్వ్యూ చేసినట్లు గవర్నెన్స్, నామినేషన్‌ కమిటీ (జీఎన్‌ఆర్‌సీ) చైర్మన్‌ ఎంఎం మురుగప్పన్‌ తెలిపారు. కొత్త నాయకత్వం..మహీంద్రా విలువలను కాపాడుతూ, సంస్థను ముందుకు తీసుకెళ్లగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.   ‘సంస్థను ముందుకు నడిపించగలిగే సత్తా గల సమర్ధులకు ఎంఅండ్‌ఎంలో కొదవేమీ లేదనడానికి ఇది నిదర్శనం. ఆయా బాధ్యతల్లో నియమితులైన వారు కంపెనీ సంస్కృతి, విలువలు, మెరుగైన నిర్వహణ ప్రమాణాలు కొనసాగించగలరు. కొత్త పాత్రలో మహీంద్రా గ్రూప్‌ విలువలకు కస్టోడియన్‌గా, షేర్‌హోల్డర్ల ప్రయోజనాల పరిరక్షకుడిగానూ వ్యవహరిస్తాను. అంతర్గత ఆడిట్‌ ఇకపైనా నాకే రిపోర్ట్‌ చేస్తుంది. బోర్డు పర్యవేక్షణ నా సారథ్యంలోనే ఉంటుంది’ అని తాజా మార్పులపై ఆనంద్‌ మహీంద్రా వెల్లడించారు.  

ఆనంద్‌ సారథ్యంలో భారీ విస్తరణ..
దాదాపు 20.7 బిలియన్‌ డాలర్ల గ్రూప్‌గా ఎదిగిన ఎంఅండ్‌ఎం గ్రూప్‌నకు ఆనంద్‌ మహీంద్రా మేనమామ కేశుభ్‌ మహీంద్రా సుమారు 45 ఏళ్ల పాటు సారథ్యం వహించారు. 2012 ఆగస్టులో ఆయన చైర్మన్‌ హోదా నుంచి తప్పుకోవడంతో ఆనంద్‌ మహీంద్రా ఆ బాధ్యతలు చేపట్టారు. ఆనంద్‌ నేతృత్వంలో ఎంఅండ్‌ఎం గ్రూప్‌ దేశ, విదేశాల్లో.. ఆటోమొబైల్స్, వ్యవసాయం, ఐటీ, ఏరోస్పేస్‌ తదితర అనేక రంగాల్లో దూకుడుగా విస్తరించింది. పలు కంపెనీల కొనుగోళ్లలో కూడా ఆనంద్‌ కీలకపాత్ర పోషించారు. దేశీయంగా సత్యం కంప్యూటర్‌ సర్వీసెస్, రెవా ఎలక్ట్రిక్‌ కార్‌ కంపెనీ మొదలుకుని సాంగ్‌యాంగ్‌ మోటార్స్, ప్యూజో మోటార్‌సైకిల్స్, గిప్స్‌ల్యాండ్‌ ఏరోనాటిక్స్‌ తదితర అంతర్జాతీయ సంస్థలను ఎంఅండ్‌ఎం కొనుగోలు చేసింది.  సీఈవోగా కూడా బాధ్యతలు చేపట్టనున్న పవన్‌ గోయెంకా .. ఎంఅండ్‌ఎంలో అంచెలంచెలుగా ఎదిగారు.

కొత్త బాధ్యతల్లో...
► ప్రస్తుతం గ్రూప్‌ ప్రెసిడెంట్‌ (స్ట్రాటజీ విభాగం)గా ఉన్న అనీష్‌ షా.. ఇకపై డిప్యూటీ ఎండీగాను, గ్రూప్‌ సీఎఫ్‌వోగాను వ్యవహరిస్తారు. ప్రస్తుత సీఎఫ్‌వో వీఎస్‌ పార్థసారథి ఇకపై.. మహీంద్రా లాజిస్టిక్స్, ఆటో మొబిలిటీ సర్వీసెస్‌ను కలిపి ఏర్పాటు చేసే మొబిలిటీ సేవల విభాగానికి సారథ్యం వహిస్తారు.  
► ప్రస్తుతం వ్యవసాయ పరికరాల విభాగం ప్రెసిడెంట్‌గా ఉన్న రాజేష్‌ జెజూరికర్‌.. ఇక మీదట ఎంఅండ్‌ఎం బోర్డులో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరుగా (ఆటో, వ్యవసాయ విభాగాలు) చేరతారు.  
► టెక్‌ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నాని.. 2020 ఏప్రిల్‌ 1 నుంచి గ్రూప్‌ బోర్డులో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరుగా చేరతారు.
► 2020 ఏప్రిల్‌ 1న పదవీ విరమణ చేయనున్న గ్రూప్‌ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ దూబే.. ఆ తర్వాత నుంచి నాన్‌–ఎగ్జిక్యూటివ్, సలహాదారు హోదాలో కొనసాగుతారు.

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top