అఫ్గాన్‌లో ఆత్మాహుతి దాడి: 11 మంది మృతి

తమకు సంబంధం లేదన్న తాలిబన్లు
కాబూల్ : అఫ్గనిస్తాన్‌లో విషాదం చోటుచేసుకుంది. దేశ రాజధానిలో గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో 11 మంది మృత్యువాత పడగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కాబూల్‌లోని షోర్ బజార్ ప్రాంతంలోని గురుద్వార లక్ష్యంగా ఉదయం ఏడున్నర గంటల సమయంలో దుండగులు కాల్పులకు తెగబడ్డారని స్థానిక మీడియా వెల్లడించింది. భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపి మరీ 11 మందిని పొట్టనబెట్టుకున్నట్లు పేర్కొంది. ఈ విషయం గురించి అఫ్గాన్ హోం మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి తారిక్ ఏరియన్ మాట్లాడుతూ... షోర్ బజార్‌లోని ధరమ్‌శాలలో ఆత్మాహుతి దళాలు దాడులకు తెగబడ్డాయని వెల్లడించారు. అక్కడ భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు పేర్కొన్నారు. గురుద్వార లోపల చిక్కుకుపోయిన సిక్కులను భద్రతా బలగాలు ఆస్పత్రికి తరలిస్తున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా... తమకు ఈ దాడులతో ఎటువంటి సంబంధం లేదని తాలిబన్ సంస్థ ప్రకటించింది. కాగా అఫ్గాన్‌లో సిక్కులపై దాడిని భారత గృహ, పట్టణ అభివృద్ధి శాఖా మంత్రి హర్దీప్ సింగ్ పూరి తీవ్రంగా ఖండించారు. ‘‘గురుద్వారపై ఆత్మాహుతి దాడి ఖండించదగినది. వివిధ దేశాల్లో మైనార్టీలపై జరుగుతున్న మతపరమైన దాడులకు ఇది నిదర్శనం. మత స్వాతంత్ర్యం, స్వేచ్చను కాపాడాల్సిన సమయం’’ అని ఆయన ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా... తమకు ఈ దాడులతో ఎటువంటి సంబంధం లేదని తాలిబన్ సంస్థ ప్రకటించగా... ఇది తమ పనే అని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ప్రకటన విడుదల చేసింది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి