హతమార్చి.. ముఖం ఛిద్రం చేసి..

తంగడపల్లిలో కల్వర్టు కింద మహిళ మృతదేహం..
ఎక్కడో చంపి.. శవాన్ని ఇక్కడ పడేసిన దుండగులు!
అత్యాచారం చేసి హతమార్చారని అనుమానాలు
‘దిశ’ఘటనలా ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం
చేవెళ్ల: నుజ్జునుజ్జయిన ముఖం.. కల్వర్టు కింద రక్తపు మడుగులో వివస్త్రగా పడి ఉన్న మహిళ మృతదేహం.. మంగళవారం ఉదయం అటుగా వెళ్లిన యువకుడు ఇచ్చిన సమాచారంతో రంగారెడ్డి జిల్లా తంగడపల్లిలో ఈ దారుణోదంతం వెలుగుచూసింది. ‘దిశ’ఘటనలా ఉందంటూ జరిగిన ప్రచారం కలకలం రేపింది. ఎక్కడో హతమార్చి మృతదేహాన్ని ఇక్కడ పడేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లికి చెందిన యువకుడు శేరిల్ల నవీన్ ఉదయం ఏడు గంటల సమయంలో బహిర్భూమికి వెళ్తుండగా, వికారాబాద్– హైదరాబాద్ రహదారిపై గల కల్వర్టు కింద మహిళ మృతదేహం కనిపించింది. ముఖం మొత్తం నుజ్జయి, నగ్నంగా పడి ఉన్న ఆమె గురించి వెంటనే అతను సర్పంచ్ భర్తకు తెలిపాడు.
సమాచారం అందుకున్న చేవెళ్ల సీఐ బాలకృష్ణ, ఎస్‌ఐ రేణుకారెడ్డి సిబ్బందితో అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. దుండగులు బండరాళ్లతో మోదటంతో ముఖం గుర్తుపట్టరాని విధంగా మారింది. మృతదేహం వద్ద ఓ నైలాన్ తాడు తప్ప మరే ఆధారాలు లభ్యం కాలేదు. మహిళ వివస్త్రగా పడి ఉండగా, ఆమె దుస్తులు, హత్యకు ఉపయోగించిన ఆయుధాలు పరిసరాల్లో ఎక్కడా కనిపించలేదు. మృతదేహాన్ని వంతెన పైనుంచి తాడుతో కిందికి దించిన తరువాత ముఖంపై బండరాళ్లతో మోదినట్టుగా ఉంది. పక్కనున్న రాళ్లపై రక్తం అంటుకుని ఉండటంతో పోలీసులు ఈ అంచనాకు వచ్చారు. మహిళ ఒంటిపై రెండు బంగారు గాజులు, వేలికి బంగారు ఉంగరం, మెడలో బంగారు లాకెట్ ఉన్నాయి. ఘటన స్థలంలో పెనుగులాట జరిగిన ఆనవాళ్లు లేవని, అంటే వేరే ప్రాంతంలో లైంగికదాడికి పాల్పడి, హతమార్చి మృతదేహాన్ని ఇక్కడ పడేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అన్ని కోణాల్లో దర్యాప్తు: డీసీపీ
ఘటన జరిగిన తీరు.. మరో ‘దిశ’ఉదంతంలా ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. ఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే కేసును ఛేదిస్తామన్నారు. మృతదేహాన్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పడేసినట్లు తెలుస్తోందని, లభ్యమైన బంగారు నగలను ల్యాబ్‌కు తరలిస్తామని చెప్పారు. ఘటనపై సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్లను అప్రమత్తం చేశామన్నారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఈ రహదారి మీదుగా రాకపోకలు సాగించిన వాహనాలను సీసీ కెమెరాల ద్వారా పరిశీలిస్తున్నామన్నారు. నాలుగు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఎస్‌ఓటీ అడిషనల్ డీజీపీ సందీప్‌కుమార్‌తో పాటు క్లూస్‌టీం సభ్యులు కూడా ఘటన స్థలాన్ని పరిశీలించారు. జాగిలాలు ఘటనా స్థలంలోనే తచ్చాడాయి. మృతదేహాన్ని చేవెళ్ల ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి, అక్కడే భద్రపరిచారు.
భయమేసింది..
మాది తంగడపల్లి. డ్రైవింగ్ చేస్తాను. ఉదయం 7 గంటలకు బహిర్భూమికని బైక్‌పై వచ్చాను. కల్వర్టు కింద తెల్లగా, బొమ్మలా ఏదో కనిపించింది. దగ్గరికెళ్లి చూస్తే మహిళ మృతదేహం.. ఒక్కసారిగా భయమేసింది. ఇటువంటివి ఇంతకుముందెప్పుడూ చూడలేదు. వెంటనే అక్కడి నుంచి వెళ్లి సర్పంచ్ భర్త సత్తయ్యగౌడ్‌కు చెప్పాను. అనంతరం పోలీసులు వచ్చి పరిశీలించారు. – శేరిల్ల నవీన్, తంగడపల్లి, ఘటనను మొదటగా చూసిన వ్యక్తి
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి