బలవన్మరణాలు..

Four Suicide Cases Filed in One Day Hyderabad - Sakshi

వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు కారణాలతో నలుగురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..పరీక్షలో ఫెయిల్‌ అవుతాననే భయంతో.. బాలిక బలవన్మరణం

దుండిగల్‌: పరీక్షల్లో ఫెయిల్‌ అవుతాననే భయంతో ఓ బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సం ఘటన దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సూరారం దయానంద్‌ నగర్‌కు చెందిన రాజేందర్‌ కుమార్తె కీర్తిప్రియ (17) ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కాగా కీర్తిప్రియ ఇంటర్‌ మొదటి సంవత్సరం సబ్జక్టుల్లో ఫెయిలైంది. దీంతో మనస్తాపానికి లోనైన ఆమె  ఆదివారం కుటుంబ సభ్యులు చర్చికి వెళ్లిన సమయంలెఓ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీనిని గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను కిందకు దింపి చూడగా అప్పటికే ఆమె మృతిచెందింది. కీర్తి తల్లి స్వర్ణకళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అప్పుల బాధ తాళలేక యువకుడు..

అమీర్‌పేట: ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌లో నష్టాలు రావడంతో పాటు షేర్ల కొనుగోలు కోసం చేసిన అప్పులు తీర్చలేక పోతున్నానని మనస్తాపానికి లోనై ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన  ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఇన్స్‌పెక్టర్‌  మురళీకృష్ణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్నూల్‌ పట్టణం, సరస్వతీనగర్‌కు చెందిన శివకుమార్‌ (35) ఉన్నత చదువులు పూర్తి చేసి ఏడాది క్రితం కోయంబత్తూర్‌ వెళ్లి అక్కడే కార్యాలయం ఏర్పాటు చేసుకుని షేర్‌ మార్కెట్‌ వ్యాపారం చేస్తున్నాడు. షేర్లు కొనుగోలు చేసిన 10  నెలల వ్యవధిలోనే వాటి విలువ కనిష్ట స్థాయికి పడిపోయింది. దీంతో లాభాలు వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో నెల రోజుల క్రితం నగరానికి వచ్చి వెంగళరావునగర్‌లోని ఓం సాయి బాయ్స్‌ హాస్టల్‌లో పేయింగ్‌ గెస్ట్‌గా ఉంటున్నాడు.అయితే షేర్ల కొనుగోలు కోసం చేసిన అప్పులు తీర్చేదారి కనిపించకపోవడంతో శనివారం మధ్యాహ్నం ఎలుకల మందు తాగిన శివకుమార్‌ కర్నూలులో ఉన్న తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. వారు హాస్టల్‌ నిర్వాహకుడికి ఫోన్‌ చేసి చెప్పడంతో అతను అపస్మారక స్థితిలో ఉన్న శివకుమార్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్‌పెక్టర్‌ తెలిపారు.

వ్యక్తి అనుమానాస్పద మృతి
బొల్లారం: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తిరుమలగిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. సీఐ రవికుమార్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చంద్రగిరి కాలనీ సూర్యతేజ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న రామ కృష్ణ చైతన్య(44)  ఓ ప్రైవేట్‌ కంపెనీలో సేల్స్‌ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. అతను 16 ఏళ్ల క్రితం రజని వైష్ణవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.  వీరికి ఒక కుమార్తె.  గత కొన్నేళ్లుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 10న అతడి భార్య రజనీ విడాకుల పత్రాలను పంపించింది. అప్పటి నుంచి మనస్తాపంతో బాధపడుతున్న అతను ఇంట్లో ఉంటూ మద్యానికి బానిసయ్యాడు. శనివారం రాత్రి మద్యం తాగి బెడ్‌రూంలోని సీలింగ్‌ ఫ్యాన్‌కు బెడ్‌ షీట్‌తో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం దీనిని గుర్తించిన వాచ్‌మెన్‌ పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరచి చూడగా అప్పటికే చైతన్య మృతి చెంది ఉన్నాడు. అతడి బంధువు రాధ  ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

తాగిన మైకంలో వ్యక్తి...
జీడిమెట్ల: తాగిన మైకంలో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. దుండిగల్‌ తండా–2కు చెందిన భవాని, చక్రవర్తి (40) భార్యభర్తలు. చక్రవర్తి ఓ కెమికల్‌ పరిశ్రమలో వంట పని చేసేవాడు. శనివారం రాత్రి మద్యం తాగి వచ్చిన చక్రవర్తి భార్యను కొట్టాడు. దీంతో ఆమె మరో గదిలోకి వెళ్లి తలుపులు మూసుకుంది. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆమె మంచినీటి కోసం బయటికి రాగా చక్రవర్తి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీంతో ఆమె స్థానికుల సహాయంతో అతడిని కిందకి దింపి చూడగా అప్పటికే మృతి చెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top