భార్యతో గొడవపడి ఆత్మహత్య

చిత్తూరు,కాణిపాకం(యాదమరి): ఐరాల మండలం కాణిపాకం పరిధిలోని జంగాలపల్లె గ్రామంలో భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల మేరకు.. పాకాలకు చెందిన విజయభాస్కర్(44)కు ఐరాల మండలం జంగాలపల్లెకు చెందిన అమృతతో 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. ఆయన తిరుమలలో ట్యాక్సీ డ్రైవర్గా పనిచేస్తున్నారు. పాకాలలో కొన్ని రోజులు, తిరుమలలో కొన్ని రోజులు నివాసం ఉన్నారు. ప్రస్తుతం అత్తగారి ఇల్లు అయిన జంగాలపల్లెలో నివాసం ఉంటున్నారు. రోజూ మద్యం తాగి వస్తుండడంతో అమృత భర్తతో గొడవపడేది. ఇదే విషయమై సోమవారం మధ్యాహ్నం ఇద్దరూ ఘర్షణ పడ్డారు. తన భర్త రోజూ తాగొచ్చి కొడుతున్నాడని అమృత పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ నిమిత్తం ఇంటికెళ్లే సరికి దూలానికి చీరతో ఉరేసుకుని విజయభాస్కర్ మృతిచెంది ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి