పెళ్లి చేసుకున్నాడు.. వదిలేశాడు!

న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించిన వివాహిత
సాక్షి, పెళ్లకూరు: ప్రేమించానంటూ వెంట పడ్డాడు. పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించాడు. చివరకు కులాలు పట్టింపు లేదంటూ నమ్మించాడు. తల్లిదండ్రులు చేరదీయకపోయినా కడవరకు తోడుంటానంటూ మెడలో మూడు ముళ్లు వేసి కులాంతర వివాహం చేసుకున్నాడు. నాలుగు నెలలకే వదిలేసి వెళ్లాడని, తనకు న్యాయం చేయాలంటూ ఓ మహిళ శుక్రవారం న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి కథనం మేరకు.. మండలంలోని అనకవోలు దళితకాలనీకి చెందిన దగ్గోలు స్వర్ణలతను కే.జంగాలపల్లికి చెందిన మంగానెల్లూరు మణిబాబు రెండేళ్లుగా ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. వృద్ధురాలైన తల్లికి ఆసరాగా ఉంటున్న స్వర్ణలత తొలుత మణిబాబు ప్రేమను తిరస్కరించింది.
ప్రేమించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని మణిబాబు చెప్పడంతో ఎట్టకేలకు ప్రేమించింది. ఇద్దరి అంగీకారంతో జొన్నవాడ కామాక్షితాయి ఆలయంలో నాలుగు నెలలు కిందట రహస్యంగా వివాహం చేసుకున్నారు. నెల్లూరు ఎన్టీఆర్ నగర్లో నాలుగు నెలలు సంతోషంగా కాపురం ఉన్నారు. ఇటీవల మణిబాబు తల్లిదండ్రులు, బంధువులు మాయమాటలు చెప్పడంతో తనను ఒంటరిగా వదిలి వెళ్లాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో జంగాలపల్లి గ్రామానికి వెళ్లి విచారించగా మణిబాబును కనబడకుండా దాచిన బంధువులు, తక్కువ కులం అంటూ దుర్భాషలాడి గెంటేశారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయమై తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు పోలీసులను కోరింది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి