టవర్లెక్కిన యువకులు

Protest on Cell Towers in Kadthal For Land Issue - Sakshi

ఇంటికి వెళ్లే దారి ఇరుకుగా మారిందని కడ్తాల్‌లో యువకుడి నిరసన

విక్రయించిన భూమికి పూర్తి డబ్బులు ఇవ్వలేదని

రావిచేడ్‌లో మరో యువకుడు..

కడ్తాల్‌: మండల కేంద్రంతో పాటు రావిచేడ్‌ గ్రామంలో తమ  సమస్యల పరిష్కారం కోసం ఇద్దరు యువకులు సెల్‌టవర్లు ఎక్కి నిరసన తెలిపిన ఘటనలు బుధవారం చోటుచేసుకున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. తన ఇంటికి వెళ్లే దారి ఇరుకుగా ఉందని, ఈ దారిలోనే మరో వ్యక్తి ఇంటి నిర్మాణంలో భాగంగా మెట్ల నిర్మాణం చేపట్టాడని ఆరోపిస్తూ కడ్తాల్‌ మండల కేంద్రానికి చెందిన ఓర్సు లక్ష్మణ్‌ సెల్‌టవర్‌ ఎక్కి రెండుగంటల  పాటు నిరసన వ్యక్తం చేశాడు. రహదారి ఇరుకు మారడంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉందని, మెట్ల నిర్మాణాన్ని తొలగించాలని డిమాండ్‌ చేశాడు. ఈ విషయమై గ్రామపంచాయతీ కార్యాలయంతో పాటు మండల పరిషత్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, గ్రామ సర్పంచ్‌ లక్ష్మీనర్సింహారెడ్డి, పంచాయతీ కార్యదర్శి రాంచంద్రారెడ్డి సెల్‌ టవర్‌ వద్దకు చేరుకొని సమస్యను రాతపూర్వకంగా తెలియజేయడంతో లక్ష్మణ్‌ సెల్‌ టవర్‌ పైనుంయి కిందకు దిగాడు. దీంతో గ్రామస్తులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

రావిచేడ్‌లో..
సొంత అన్నకు భూమిని విక్రయిస్తే ఇంత వరకు డబ్బులు పూర్తిగా ఇవ్వలేదని ఆరోపిస్తూ మండల పరి«ధిలోని రావిచేడ్‌ గ్రామానికి చెందిన రాజుగౌడ్‌ సెల్‌టవర్‌ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న ఏఎస్‌ఐ యాదయ్య పోలీస్‌ సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకుని రాజుగౌడ్‌తో ఫోన్లో మాట్లాడినప్పటికీ టవర్‌ పైనుంచి దిగలేదు. సుమారు ఆరుగంటల పాటు టవర్‌ పైనే ఉండటంతో భూమిని కొనుగోలు చేసిన అతని అన్నను అక్కడికి రప్పించారు. భూమికి సంబంధించిన డబ్బులు ఇచ్చేందుకు సోదరుడు అంగీకరించడంతో పోలీసులు కిందకు దిగాలని కోరడంతో అతడు టవర్‌ దిగాడు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top