తెగిన ఆనకట్ట..23 మంది మృతి!

Tiware Dam Breach In Maharashtra - Sakshi

మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ప్రమాదం

23 మంది చనిపోయుంటారని అనుమానం

11 మృతదేహాలు లభ్యం

సాక్షి, ముంబై : గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా  చిప్లున్‌ తాలుకాలోని తెవరీ ఆనకట్ట తెగింది. ఈ దుర్ఘటనలో దాదాపు 23 మంది వరకు చనిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇప్పటివరకు 11 మృతదేహాలు లభ్యమయ్యాయి. తెవరీ ఆనకట్టకు 20 లక్షల క్యూబిక్‌ మీటర్ల నీటిని నిల్వచేసే సామర్థ్యం ఉండగా, మంగళవారం రాత్రి తెగిందని అధికారులు వెల్లడించారు. దీంతో ఆనకట్ట కింద ఉన్న ఏడు గ్రామాల్లో వరదలాంటి పరిస్థితి ఏర్పడింది. 12 ఇళ్లు కొట్టుకుపోయాయి. రత్నగిరి అదనపు ఎప్పీ మాట్లాడుతూ ‘ఇప్పటివరకు 11 మృతదేహాలను బయటకు తెచ్చాం. ఆయా గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాం’ అని చెప్పారు. మరణించిన వారి బంధువులకు ప్రభుత్వం రూ. 4 లక్షల నష్ట పరిహారం ప్రకటించింది. ముఖ్యమంత్రి ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. 

వరద నీటి ఉధృతికి దెబ్బతిన్న ఇళ్లు 

ముందే చెప్పినా పట్టించుకోలేదు: ఆనకట్టకు పగుళ్లు ఉన్నట్లు గతేడాది నవంబర్‌లోనే గుర్తించి జిల్లా అధికారులకు చెప్పి మరమ్మతులు చేయించమన్నామనీ, అయినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తివరే ఆనకట్ట చిప్లున్, దపోలీ తాలూకాల్లో విస్తరించి ఉంది. అయితే ఈ ఆనకట్ట ఏ తాలూకా పరిధిలోకి వస్తుందనే విషయంపై వివాదం ఉండటంతో రెండు తాలూకాల అధికారులూ పట్టించుకోలేదని చనిపోయిన వ్యక్తి బంధువు ఒకరు చెప్పారు. మరో వ్యక్తి మాట్లాడుతూ ‘అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ రోజు ఇలా జరిగింది. నా తల్లిదండ్రులు, భార్య, ఏడాదిన్నర వయసున్న బిడ్డ గల్లంతయ్యారు. నా సోదరుడు తన వాహనం తెచ్చుకోడానికి వెళ్లి తిరిగిరాలేదు’ అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. గల్లంతైన వారి కోసం జాతీయ విపత్తు స్పందన దళం గాలింపు చేపడుతున్నారు. ప్రమాదానికి కారణం ప్రభుత్వమేనని స్థానిక ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఆనకట్టకు మరమ్మతులు చేయాల్సిందిగా తాము ఎన్నిసార్లు కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఆనకట్ట గోడలకు పగుళ్లు ఉన్నాయని అధికార యంత్రాంగానికి చెప్పామనీ, అయినా వారు ఏ చర్యలూ తీసుకోలేదని ప్రజాప్రతినిధులు నిందించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top