చాక్లెట్‌ నేరం.. సతీష్‌ మృతి కేసు ట్విస్ట్‌

Twist On Inter Student Sathish Suspicious Death At Dmart Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : హయత్ నగర్ శ్రీ చైతన్య కళాశాల విద్యార్థి సతీష్‌ మృతి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వనస్థలిపురం డిమార్ట్‌ వద్ద ఆదివారం రాత్రి  శ్రీచైతన్య కాలేజీ విద్యార్థి సతీష్‌ అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. డిమార్ట్‌ సెక్యూరిటీ సిబ్బంది కొట్టడం వల్లే తమ కూమారుడు మృతి చెందాడని సతీష్‌ తల్లిదండ్రులు ఆరోపిస్తుండగా, డిమార్ట్‌ సెక్యూరిటీ సతీష్‌ను కొట్టలేదని, చాక్లెట్‌ దొంగిలించాడనే భయంతో అతను కిందపడిపోయి మృతి చెందాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు.

(చదవండి : చాక్లెట్‌ నేరం; విద్యార్థిపై డీమార్ట్‌ సిబ్బంది దాడి)

‘షాపింగ్‌ చేస్తుండగా సతీష్‌ చాక్లెట్‌ను జేబులో వేసుకున్నాడు. సెక్యూరిటీ గార్డ్‌ తనిఖీలు చేస్తున్న సమయంలో సతీష్‌ దానిని కిందపడేశాడు. అయినప్పటికీ ఇంకో మహిళా సెక్యూరిటీ చాక్లెట్‌ను తీసుకొని సతీష్‌ను పట్టుకున్నారు. దీంతో సతీష్‌ సొమ్మసిల్లి సెక్యూరిటీ గార్డ్‌ మీద పడిపోయాడు. సెక్యూరిటీ గార్డ్‌ ఇదంతా యాక్టింగ్‌ అని, ఇలాంటి వాళ్లను చాలామందిని చూశానని అన్నారు. అప్పటికే మేమంతా సతీష్‌ దగ్గరకు వచ్చి  కాళ్లు, చేతులు రఫ్‌ చేశాం. వెంటనే దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే సతీష్‌ చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. డీ మార్ట్‌ సెక్యూరిటీ సతీష్‌ను కొట్టలేదు. చాక్లెట్‌ దొంగిలించినందుకు సతీష్‌ భయంతో పడిపోయాడు. ఈ విషయాన్ని వెంటనే ప్రిన్సిపల్‌కు తెలియాజేశాం’ అని సతీష్‌ తోటి విద్యార్థులు పేర్కొన్నారు. 

తప్పు చేశారని తేలితే ఉపేక్షించం : ఎల్బీనగర్‌ డీసీపీ
సతీష్‌ మరణం దురదృష్టకరమని ఎల్బీనగర్‌ డీసీపీ సన్‌ ప్రీత్‌ సింగ్‌ అన్నారు. ఈ ఘటనపై సతీష్‌ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు. డీమార్ట్‌ సెక్యూరిటీ గార్డ్‌ ఘర్షణకు దిగి దాడి చేయడం వల్లే తమ కుమారుడు మృతి చెందాడని సతీష్‌ తండ్రి ఆరోపిస్తున్నారని, ఒకవేళ అదే నిజమైతే చర్యలు తీసుకుంటామని చెప్పారు. డీమార్ట్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాలను, సైంటిఫిక్‌ ఎవిడెన్స్‌ను కలెక్ట్‌ చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. తప్పు చేశారని తేలితే ఉపేక్షించేది లేదని డీసీపీ పేర్కొన్నారు. 

డీమార్ట్‌ సిబ్బంది దాడి వల్లే మృతి
డీమార్ట్‌ సెక్యూరిటీ సిబ్బంది దాడి చేయడం వల్లే తమ కుమారుడు మృతి చెందాడని సతీష్‌ తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. 25 లక్షల ఎక్స్‌ గ్రేషియా చెల్లించాలంటూ సతీష్‌ బంధువులు డీమార్ట్‌ ఎదుట ఆందోళనకు దిగారు. శ్రీచైతన్య కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంగానే సతీష్‌ మృతి చెందారని, ఆ కాలేజీ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఔటింగ్‌ పంపించే సమయంతో కాలేజీ యాజమాన్యం తమ అనుమతి తీసుకోలేదని ఆరోపించారు.

అనుమతి తీసుకున్నాం
కాలేజీ నుంచి విద్యార్థులను ఔటింగ్‌ పంపడానికి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా తీసుకుంటామని హయత్‌ నగర్‌ శ్రీచైతన్య కాలేజీ ప్రిన్సిపల్‌ పేర్కొన్నారు. సతీష్‌ని బయటకు పంపేముందు తల్లిదండ్రులకు ఫోన్‌ చేశామని, వారు లిఫ్ట్‌ చేయలేదన్నారు. దీంతో సతీష్‌ నాయక్‌ బావ అనుమతి తీసుకొని ఔటింగ్‌కు పంపించామని చెప్పారు. గంట పాటు ఔటింగ్‌కు అనుమతి కోరుతూ సతీష్‌ లెటర్‌ కూడా ఇచ్చారని తెలిపారు. సతీష్‌ మృతి పట్ల కళాశాల యాజమాన్యం తప్పులేదన్నారు. సతీష్‌ చనిపోవడం బాధాకరమని, ఇలాంటి ఘటనలు జరగకుండా భవిష్యత్తులో మరిన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top