అడ్డు తొలగించేందుకే హతమార్చారు

Wife Helps Husband Murder in Kakinada East Godavari - Sakshi

భర్త హత్యకు సహకరించిన భార్య  

వివాహేతర సంబంధమే కారణం

తూర్పు గోదావరి, సర్పవరం (కాకినాడ రూరల్‌): కాకినాడ నగరంలోని గొడారిగుంట దుర్గానగర్‌లో ఈ నెల 19న అర్ధరాత్రి అత్యంత కిరాతకంగా లారీ డ్రైవర్‌ నక్కా బ్రహ్మానందం అనే బ్రహ్మాజీ (29) హత్యకు గురయ్యాడు. ఈ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. దీనిపై సర్పవరం పోలీసు స్టేషన్‌లో సోమవారం జిల్లా అడిషనల్‌ ఎస్పీ (అడ్మిన్‌) కరణం కుమార్, ఇన్‌చార్జి డీఎస్పీ వి.భీమారావు, సీఐ గోవిందరాజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. లారీ డ్రైవర్‌గా పనిచేసే బ్రహ్మానందం అతని మరదలు మంగలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. వీరికి పాప, బాబు ఉన్నారు. వీరు గొడారిగుంట దుర్గానగర్‌లో అద్దింట్లో నివాసం ఉంటున్నారు. భార్య మంగలక్ష్మి కాకినాడ కార్పొరేషన్‌లో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. అల్లవరం మండలం డి.రావులపాలెం గ్రామం సావరంపేటకు చెందిన ఈతకోటసూర్యప్రకాష్‌ అనే సూర్య డిగ్రీ పూర్తి చేసి కానిస్టేబుల్‌ అవుదామని కాకినాడలో ట్రైనింగ్‌కు వచ్చాడు.

సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న అడిషనల్‌ ఎస్పీ కరణం కుమార్, చిత్రంలో నిందితుడు సూర్యప్రకాష్‌
శిక్షణ మధ్యలో మానేసి కార్పొరేషన్‌లో పారిశుద్ధ్య సూపర్‌వైజర్‌గా చేరాడు. ఈ క్రమంలో మంగలక్ష్మి, సూర్యప్రకాష్‌ల మధ్య ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇలా మంగలక్ష్మి ఇంటి పక్కన అద్దెకు సూర్యప్రకాష్‌ దిగాడు. మూడు నెలల కిందట ప్రియురాలికి తాళి కట్టాడు. వీరి పరిచయానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి హతమార్చేందుకు వ్యూహం పన్నారు. ఈ క్రమంలోనే మూడు రోజుల కిందట సూర్యప్రకాష్‌ విధులకు సెలవు పెట్టి సొంతూరుకు వెళ్లాడు. హత్య చేద్దామని ముందు రోజు రెక్కీ నిర్వహించాడు. ఈ నెల 19న రాత్రి మంకీ క్యాప్, చేతులకు గ్లౌస్, స్వెట్టర్‌ ధరించి మోటారు సైకిల్‌తో పాటు ఆయుధం తీసుకుని వచ్చాడు. అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో బ్రహ్మానందం ఇంట్లోకి ప్రవేశించాడు. భర్త హత్యకు భార్య సహకరించడంతో అతికిరాతకంగా నరికి చంపి పరారయ్యాడు. మరుసటి రోజు తెల్లవారు జామున సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మిస్టరీని ఛేదించారు. నిందితుడు ఈతకోట సూర్యప్రకాష్‌తో పాటు హతుడి భార్య మంగలక్ష్మిని సోమవారం అరెస్టు చేశారు. 

పోలీసు అవుదామని వచ్చి..
సంఘట వివరాలను అడిషనల్‌ ఎస్పీ కుమార్‌ వివరించారు. సూర్యప్రకాష్‌ ఉంటున్న గదిని పరిశీలించగా డైరీలో మంగ వెడ్స్‌ సూర్య అని.. మంగ బంగారం అని కాగితంపై రాసి ఉందన్నారు. వీటి ఆధారంగానే సులువుగా నిందితుడిని పట్టుకున్నామన్నారు. పోలీసు అవుదామని వచ్చి కటకటాలు పాలయ్యాడని, అలాగే ప్రియుడి వ్యామోహంతో భర్తను కోల్పోయి, పిల్లలకు దూరమై జైలుకు మంగలక్ష్మి వెళ్తుందన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top