ట్రంప్‌ విజయగర్వం

American Senate Acquitted Impeachment Of Donald Trump - Sakshi

ముందే ఊహించినట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌పై సెనేట్‌లో అభిశంసన తీర్మానం గురువారం వీగిపోయింది. మరో తొమ్మిది నెలల్లో అధ్యక్ష పదవికి జరగబోయే ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున రెండో దఫా పోటీ చేయబోతున్న ట్రంప్‌కు ఇది ముందస్తు విజయమని చెప్పాలి. దాదాపు రెండున్నర శతాబ్దాల అమెరికా చరిత్రలో ఇప్పటికి ముగ్గురు అధ్యక్షులు అభిశంసనను ఎదుర్కొనవలసి రాగా, ఆ ముగ్గురిలో ఎవరికీ రెండోసారి పోటీచేసే ఛాన్స్‌ రాలేదు. ఇప్పటికే ట్రంప్‌ అనుకూలురు, వ్యతిరేకులుగా నిట్టనిలువున చీలిపోయిన అమెరికా సమాజం వచ్చే నవంబర్‌లో జర గబోయే అధ్యక్ష ఎన్నికల సమయానికల్లా మరిన్ని వైపరీత్యాలు చవి చూడాల్సివస్తుందని తీర్మానం వీగిపోయాక ట్రంప్‌ చేసిన ప్రసంగం గమనిస్తే అర్థమవుతుంది. రిపబ్లికన్లను ఉద్దేశించి చేసిన ఆ ప్రసంగం ఆద్యంతమూ ప్రత్యర్థులను పరుష పదజాలంతో దూషించడం, సొంత పార్టీకి చెందిన మహిళా నేతలపై కూడా చవకబారు వ్యాఖ్యలు చేయడం కనబడుతుంది. డెమొక్రాట్ల ఆధిక్యత ఉన్న దిగువ సభ ట్రంప్‌ అభిశంసనను సమర్థించగా, రిపబ్లికన్లు సెనేట్‌లో తమకున్న ఆధిక్యతతో దాన్ని అడ్డుకోగలిగారు. కనుకనే అమెరికా మీడియా మొత్తం అధ్యక్ష ఎన్నికల ముందు డెమొక్రాట్లు ఇలాంటి వృధా ప్రయాసకు ఎందుకు దిగారని నిలదీసింది. కానీ సెనేట్‌ విజయాన్ని అత్యంత ఘనమైన విజ యంగా ట్రంప్‌ నమ్మమంటున్నారు. సభలో తమ పార్టీ వారెవరూ జారిపోకుండా ఆయన చూసు కోగలిగారు. ఆ ఒక్క విషయంలోనూ ట్రంప్‌ సమర్థతను మెచ్చుకోవాలి.

ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు పార్టీలకు అతీతంగా ఓటేయడం అమెరికాలో రివాజు. ఈసారి రిపబ్లికన్లలో మిట్‌ రోమ్నీ ఒక్కరే ఆ పని చేశారు. ఆయన గతంలో అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్‌ అభ్యర్థిగా ఒబామాపై పోటీచేసి ఓడిపోయారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా తీసుకొచ్చిన అభిశంసన తీర్మానంలో రెండు అంశాలున్నాయి. అందులో ఒకటి అధికార దుర్వినియోగానికి సంబంధించింది కాగా, రెండోది కాంగ్రెస్‌ అధికారాన్ని ట్రంప్‌ అడ్డగించారన్నది. రోమ్నీ మొదటి అంశంలో డెమొక్రాట్లతో ఏకీభవించి ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటేశారు. కానీ రెండో అంశంలో ట్రంప్‌కు అనుకూలంగానే వ్యవహరించారు. అయినా ఆయనను ట్రంప్‌ తీవ్రంగా విమర్శించారు. అధ్యక్ష ఎన్నికల చరిత్రలో ఆయనంత నాసిరకమైన ప్రచారాన్ని ఎవరూ నిర్వహించలేదన్నారు. ఈ విజయంతో ట్రంప్‌కు పట్టపగ్గాల్లేకుండా పోయాయని పార్టీలోని మహిళా ఎంపీలపై ఆయన చేసిన వ్యాఖ్యలు రుజువు చేశాయి. కనీసం వారంతా తన పార్టీవారని, తనకు అనుకూలంగా ఓటేసిన వారన్న ఇంగితజ్ఞానం కూడా ట్రంప్‌కు లేకపోయింది. అరిజోనా ప్రతినిధి డెబీ లెస్కోను పేరుతో మొదలుపెట్టి పలు అసందర్భ వ్యాఖ్యలు చేశారు. న్యూయార్క్‌ ప్రతినిధి ఎలైస్‌ స్టెఫానిక్‌ను ‘ఆమె అందంగా వుంటారని తెలుసు. కానీ నోరు తెరిచినప్పుడు కూడా అంతే అందంగా వుంటారని తెలియలేదు. నిజానికి ఆమె మాటలతో వారిని చంపేశారు’ అని నోరు పారేసుకున్నారు.

మహిళలు మాత్రమే కాదు...నల్లజాతి ఎంపీలన్నా ఆయనకు చులకనే. జిమ్‌ జోర్డాన్‌ను ‘ఆయన తన శరీరాన్ని చూసుకుని పొంగిపోతారనుకుంటాను. ముఖ్యంగా తన చెవులు చూసుకుని...’ అంటూ అవ మానకరంగా మాట్లాడారు. ట్రంప్‌ వ్యక్తిగతంగా ఎలాంటివారో కొంత వెనక్కెళ్లి చూస్తే అర్ధ మవుతుంది.  కొందరు మహిళలపై చేసిన లైంగిక దాడుల గురించి ఆయన గొప్పగా చెప్పుకుంటున్న టేప్‌ 2016 అధ్యక్ష ఎన్నికల ముందు ‘వాషింగ్టన్‌ పోస్ట్‌’ బయటపెట్టినప్పుడు ‘ఇది నా జీవితంలో చెడ్డరోజు. ఎందుకంటే అధ్యక్షుడిగా నా అవకాశాలను ఇది ఇబ్బందుల్లో పడేసింది’ అన్నారు. అంటే ఆయనకు చేసిన పనులపై పశ్చాత్తాపం లేదు. అది అధ్యక్ష పదవికి ఎసరు పెడుతుందన్న భయం ఒక్కటే ఉంది. అభిశంసన అంశాల్లో అధికార దుర్వినియోగం కూడా ఉందన్న సంగతిని కూడా మరిచి, ‘అప్పుడే అయిపోలేదు. ప్రతిభావంతులైన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. డెమొక్రాటిక్‌ పార్టీ నాయకుడు జోయ్‌ బిడెన్‌కు మున్ముందు ఏం జరుగుతుందో చూడండి’ అంటూ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. తమ తీర్మానం వల్ల ట్రంప్‌ వైదొలగవలసి వస్తుందని డెమొక్రాట్లు కూడా అనుకోలేదు. అమెరికా ప్రజలు కూడా అనుకోలేదు. కానీ ఆయనలో పరివర్తన వస్తుందని, ఇకపై బాధ్యతతో, జవాబుదారీతనంతో వ్యవహరిస్తారని ఆశించారు. అయితే అది జరగకపోగా, అందుకు విరుద్ధంగా ఆయన మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉన్నదని పార్టీలో సహ మహిళా సభ్యులపైనా, ఇతరులపైనా, ప్రత్యర్థులపైనా ఆయన చేసిన వ్యాఖ్యలు రుజువు చేస్తున్నాయి. గతంలో అభిశంసన తీర్మానాలను ఎదుర్కొన్న అధ్యక్షులు నిస్సహాయతలో పడేవారు. వారు సైతం చట్టాలకూ, రాజ్యాంగానికి లోబడి పనిచేయక తప్పదన్న అభిప్రాయం అమెరికా పౌరుల్లో కలిగేది. కానీ ట్రంప్‌ వాలకం చూస్తే దేశ పౌరులకు ఆయన సూపర్‌మాన్‌ అనిపిస్తుంది. తాను అన్నిటికీ అతీతుడినన్న భావన, ప్రత్యర్థులు తనను ఏం చేయలేరన్న భరోసా ఆయనలో కనిపిస్తుంది. ఇది ప్రమా దకరమైనది.

ట్రంప్‌పై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన రికార్డుల్ని వైట్‌ హౌస్‌ విడుదల చేయాలా లేదా, అక్కడి సిబ్బంది సాక్ష్యాలను సేకరించవచ్చా లేదా అన్న అంశాలపై న్యాయస్థానాలు విచారించి నిర్ణయించేలోగానే డెమొక్రాట్లు అభిశంసనపై ఎక్కడ లేని తొందరా ప్రదర్శించారు. తీర్మానం ఓడినా, రాజకీయంగా ట్రంప్‌ను బట్టబయలు చేస్తుందని, వచ్చే ఎన్నికల్లో అది తమకు లాభిస్తుందని భావిం చారు. ఇది ట్రంప్‌ను కాపాడటానికి సంబంధించిన సమస్య కాదని, మొత్తంగా అధ్యక్ష పదవిలో ఉండేవారి పరిమితుల్ని, జవాబుదారీతనాన్ని నిర్ణయించేదని రిపబ్లికన్లు సైతం అనుకోలేదు. ట్రంప్‌ వ్యవహారశైలిపై అభ్యంతరం వ్యక్తం చేయలేని సెనేట్‌ నిస్సహాయస్థితి గమనించాక, ముందూము నుపూ వచ్చే డెమొక్రాటిక్‌ అధ్యక్షుడు సైతం అదే మాదిరి వ్యవహరించబోరన్న గ్యారెంటీ ఏమీ లేదు. ఇది అమెరికా నమ్ముకున్న ప్రజాస్వామ్య వ్యవస్థకు చేటు తెస్తుంది.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top