సందిగ్ధ కాలంలో ‘శార్వరి’

Editorial About Ugadi Festival In Gravel Period Due To Coronavirus - Sakshi

తీపి చేదుల సమ్మిశ్రమంగా సాగిన వికారికి వీడ్కోలు పలికి, కాలయవనికపైకి సరికొత్తగా అరుదెంచే శార్వరిని స్వాగతించే రోజిది. సగటు మనిషి ఆశాజీవి. అందుకే నిష్క్రమిస్తున్న సంవత్సరం సుఖ దుఃఖాల, సంతోషవిషాదాల, మంచిచెడ్డల సంగమంగా సాగిపోయినా రాబోయే కాలమంతా తన జీవితాన్ని సుఖమయం చేస్తుందని, చుట్టుముట్టిన కష్టాలన్నీ మబ్బు వీడినట్టు మాయమవుతాయని బలంగా విశ్వసిస్తాడు. కానీ ఆ విశ్వాసాన్ని చెదరగొట్టేలా ఈసారి కరోనా మహమ్మారి పిలవని పేరంటంలా మన ముంగిట్లో వాలింది. పర్యవసానంగా చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా దేశ వ్యాప్త లాక్‌డౌన్‌ అమలవుతోంది. కనుకనే ఈ శార్వరికి ఎదురేగి స్వాగతం పలకడానికి అవసరమైన ఉత్సాహోద్వేగాలు కానరావడం లేదు.

ఏం జరుగుతుందో, మున్ముందు ఎలాంటి పరిస్థితులుంటాయోనన్న సందిగ్ధ వాతావరణమే రాజ్యమేలుతోంది. ఉగాదికి వచ్చే కొత్త పంచాంగంలో ముందుగా రాశిఫలాలను తిరగేయడం సర్వసాధారణం. తమ రాశికి రాజపూజ్యమే నికరంగా రాసి పెట్టి వుండాలని, అవమానాలుండొద్దని, ఉన్నా అవి నామమాత్రం కావాలని అందరూ ఆశిస్తారు. ఆ తర్వాతే పంటలెలా పండుతాయో, ఈతిబాధల సంగతేమిటో, ఏయే విపత్తులు విరుచుకుపడతాయో వాకబు చేసుకుంటారు. అలాగని ఆ ఫలితాల చుట్టూతా సంచరించరు. భగవంతుడి సృష్టిలో అన్నీ సుదినాలు, శుభ ఘడియలేనని, మన నుదుటి రాతనుబట్టే శుభాశుభాలు వచ్చిపోతుంటాయని సరి పెట్టుకుని అడుగు ముందుకేస్తారు. ఒకరకంగా ఇది మంచిదే. ఈ వైఖరి దేన్నయినా నిబ్బరంగా ఎదుర్కొనే ధైర్యాన్నిస్తుంది. 

ఉగాది రుతువుల రాణి వసంత రుతువును వెంటేసుకుని వస్తుంది. అందుకే అప్పటికల్లా ప్రకృతి సమస్తం కొత్త కాంతిని సింగారించుకుంటుంది. ఏ చెట్టుచూసినా ఆకుపచ్చని లేత చివుళ్లతో శోభాయ మానంగా దర్శనమిస్తుంది. దీన్నంతటినీ చూసి కోయిల హుషారుగా గొంతెత్తుతుంది. రామచిలుక తీపి పలుకుల్ని నోట నింపుకుంటుంది. ఉగాది పండుగంటేనే షడ్రుచుల సమ్మిళితమైన పచ్చడి. జీవన గమనం సమస్తం కష్టసుఖాల కలబోతని, వాటన్నిటినీ సమంగా స్వీకరించి, సంయమనంతో వ్యవహరించాలని చెప్పడమే ఈ షడ్రుచుల వెనకుండే తాత్వికత. వెలుతురు కోసం ఎప్పుడూ వెంప ర్లాడి, చీకటి ముసిరిన వేళ చలనరహితంగా మారే రకం కాదు మనిషి. ఎదురయ్యే సవాళ్లను ఛేదిస్తూ, విపత్తులొచ్చినప్పుడు దృఢ చిత్తంతో ఎదుర్కొని మునుముందుకు సాగడమే మనిషికి తెలుసు.

ఉగాది పచ్చడిలోని రుచులన్నీ నిత్య జీవనంలో మనిషికి తారసపడే రకరకాల అనుభవాలనూ, అను భూతులనూ గుర్తుకుతెచ్చేవే. అదే సమయంలో పచ్చడిలో కలగలిసి భిన్న రుచులందించే పదా ర్థాలన్నీ శరీరానికి మేలు చేసే ఔషధాలే. ప్రపంచంలో ఎన్ని సంస్కృతులున్నాయో అన్ని రకాల ఉగా దులున్నాయి. జనవరి 1తో మొదలై డిసెంబర్‌ 31తో ముగిసే గ్రిగేరియన్‌ కేలండర్‌  1582 నుంచి మొదలుకాగా, ఇరాన్‌లాంటి ఒకటి రెండు దేశాలు తప్ప దాదాపు ప్రపంచదేశాలన్నీ దాన్నే ఉపయోగి స్తున్నాయి. కానీ నిత్య వ్యవహారికంలో ఆ కేలండర్‌ను అనుసరించే భిన్న దేశాలు, భిన్న ప్రాంతాల ప్రజలు తమ సంస్కృతితో ముడిపడి, రకరకాల పేర్లతో వుండే ఉగాదులను జరుపుకుంటూనే వుంటారు.

భూగోళం అంతటా పగలూ, రాత్రీ సమానంగా వుండే ఈక్వినాక్స్‌(విషువత్తు) సమ యంలో(అది సాధారణంగా మార్చి 20 లేదా 21న వస్తుంది) ఇరాన్‌ ప్రజలు తమ కొత్త సంవ త్సరారంభాన్ని జరుపుకుంటారు. తమ పనులన్నిటికీ ఆ కేలండర్‌నే ఉపయోగిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా వుండే జోరాస్ట్రియన్లదీ అదే తోవ. రెండు తెలుగు రాష్ట్రాలూ, కర్ణాటకల్లో ఉగాదిగా పిలిచే ఈ పర్వదినం...కశ్మీర్‌లో నవ్‌రే, మహారాష్ట్రలో గుడిపడ్వా, సింధీలో చేతిచాంద్‌ పేరిట వేర్వేరు నెలల్లో వస్తుంది. తమిళ, పంజాబీ, ఒడియా, మలయాళీ, నేపాలీ, సింహళీ  ఉగాదులు ఏప్రిల్‌లో వస్తాయి. గుజరాతీలకు దీపావళి తర్వాత నూతన సంవత్సరం వస్తుంది. టిబెటిన్లు తమ ఉగాది లోసర్‌ను జన వరి–మార్చి మధ్య జరుపుకుంటారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని వివిధ ప్రాంతా   ల్లోనూ, ప్రపంచంలోని వేర్వేరు దేశాల్లోనూ నివసించే కోట్లాది తెలుగువారు ఉగాది జరుపుకుంటారు. 

కష్టసుఖాలతో నిమిత్తం లేకుండా ఉగాది పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవడం మనకు రివాజు. కానీ ఈసారి దేశంపై పంజా విసిరిన కరోనా మహమ్మారి ఆ ఆనందోత్సాహాలపై నీళ్లు జల్లింది. అనేక దేశాలతోపాటు మన దేశం కూడా గడప దాటాలంటే భయంతో వణుకుతోంది. ఆందోళనలు మిన్నంటినప్పుడో, అల్లర్లు చెలరేగినప్పుడో, ఉద్రిక్తతలు ఏర్పడినప్పుడో విధించే కర్ఫ్యూ...అంతా సవ్యంగా వున్నా వచ్చిపడింది. కాకపోతే దీన్ని లాక్‌డౌన్‌ అంటున్నారు. 21 రోజు లపాటు ఇదిలాగే కొనసాగుతుందని మంగళవారం దేశ ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ వింత పరిస్థితి ప్రజలకూ కొత్తే. పాలకులకూ కొత్తే. అందుకే దీన్ని అందరితో తు.చ. తప్పకుండా పాటింపజేయడం ఎలాగన్న విచికిత్సలో పాలకులుంటే...తమ చుట్టు పట్ల జాడ కనబడని వైరస్‌ కోసం ఇలా దిగ్బంధించడమేమిటన్న ప్రశ్న పౌరుల్లో ఉంది.

కానీ చైనా, ఇటలీ, స్పెయిన్‌ తదితర దేశాల అనుభవాలు మన కళ్లముందే వున్నాయి. పై నుంచి కింది వరకూ ఏకస్వామ్య వ్యవస్థ పకడ్బందీగా రాజ్యమేలే చైనాలో ఎంత కఠినంగా వ్యవహరించినా అదుపు చేయ డానికి 40 రోజులకు పైగా పట్టింది. ఇటలీ, స్పెయిన్‌లలో పాలకులు పొంచివున్న పెనుముప్పును సకాలంలో అంచనా వేయకపోవడం వల్లా, ఆ తర్వాతైనా పౌరులతో కఠినంగా పాటింపజేయక పోవడం వల్లా దారుణమైన ఫలితాలు చవిచూడాల్సివచ్చింది. ఒక్క రోగి వేలమందికి ఈ వ్యాధిని అంటిస్తాడని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. కరోనా మహమ్మారిపై హోరాహోరీగా పోరాడుతున్న గడ్డుకాలంలో ప్రవేశిస్తున్న ఈ శార్వరి మనందరి సమష్టి పోరాటానికి నైతిక ధృతిని, ద్యుతిని అందిస్తుందని ఆశిద్దాం. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top