హక్కుల రక్షణలో అలసత్వం

Editorial On Protecting The Rights Of Dalits - Sakshi

దళిత వర్గాల హక్కుల పరిరక్షణకు ఎంతో చేస్తున్నామని చెప్పుకునే ప్రభుత్వాల పరువు తీసే నిజాలివి. దేశంలో అత్యధిక ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ(అత్యాచారాల నిరోధక) చట్టం అమలు తీరును పర్యవేక్షించడంలో, తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నాయని మంగళవారం లోక్‌సభలో కేంద్ర సామాజిక న్యాయ మంత్రి తావర్‌చంద్‌ గెహ్లోత్‌ చేసిన ప్రకటన వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతోంది. రాజ్యాంగంలోని వివిధ అధికరణలు షెడ్యూల్‌ కులాలు, తెగల రక్షణకు పూచీపడు తున్నాయి. ముఖ్యంగా 17వ అధికరణ అంటరానితనాన్ని ఏ రూపంలో పాటించినవారైనా శిక్షార్హు లని చెబుతోంది. ఆ అధికరణకు అనుగుణంగా 1955లో అంటరానితనాన్ని నిషేధించే చట్టాన్ని తీసుకొచ్చారు. దానికి మరింత పదునుపెడుతూ 1976లో పౌరహక్కుల రక్షణ చట్టాన్ని చేశారు. 

అయితే అందులోని లోపాలను పరిహరిస్తూ 1989లో ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం వచ్చింది. ఆ చట్టం కింద అన్ని రాష్ట్రాలూ, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నిఘా, పర్యవేక్షణ కమిటీలు ఏర్పడాలి. రాష్ట్ర స్థాయి కమిటీలు ఏడాదికి కనీసం రెండుసార్లు, జిల్లా స్థాయి కమిటీలు కనీసం మూడు నెలలకోసారి సమావేశం కావాలి.  అయితే దేశంలోని 25 రాష్ట్రాలూ, కేంద్ర పాలిత ప్రాంతాలూ ఈ కమిటీల గురించి పట్టించుకోవడం లేదని గెహ్లోత్‌ చేసిన ప్రకటన ఆశ్చర్యం కలిగిస్తుంది. 2016 మొదలుకొని 2018 వరకూ చూస్తే ఆ కమిటీలు ఒక్కసారైనా సమావేశం కాలేదని ఆయన చెబుతున్నారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో 25 మందితో ఏర్పడే కమిటీలో హోంమంత్రి, ఆర్థికమంత్రి, సాంఘిక సంక్షేమ మంత్రి తదితరులతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు 16 మంది ఉండాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మొదలుకొని ఉన్నతాధికారులుండాలి. జిల్లా స్థాయి కమిటీల్లో కలెక్టర్, ఎస్పీలతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఉంటారు. 

ఎస్సీ, ఎస్టీ(అత్యాచారాల నిరోధక) చట్టం అమలు తీరుపై నిఘా వుండాలని, ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలనడం వెనక ముఖ్య కారణముంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా 1985 జూలై 17న ప్రకాశం జిల్లా కారంచేడులో దళితుల ఊచకోత జరిగింది. దళితులపై అమలవుతున్న అత్యాచారాలను, హత్యాకాండను నిలువరించడంలో పౌర హక్కుల రక్షణ చట్టం దారుణంగా విఫలమవుతున్నదని పలు దళిత, ప్రజా సంఘాలు అప్పట్లో ఆరోపించాయి. మరింత సమగ్రమైన చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేశాయి. పార్లమెంటులో సైతం అన్ని పార్టీలూ ముక్తకంఠంతో కోరడంతో పౌర హక్కుల రక్షణ చట్టం స్థానంలో మరో చట్టాన్ని తీసుకు రావాలని నిర్ణయించారు. చివరకు 1989లో ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం వచ్చింది. కానీ విషాద మేమంటే ఆ తర్వాత మరో మూడేళ్లు గడిచాకగానీ ఆ చట్టానికి సంబంధించిన మార్గ దర్శక సూత్రాలు రూపొందలేదు. ఈలోగా 1991 ఆగస్టులో చుండూరు మారణకాండ చోటు చేసుకుంది. 

2014లో ఆ చట్టానికి సవరణలు తీసుకొచ్చారు.  రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నిఘా, పర్యవేక్షణ కమిటీలుండాలని భావించడంలో కీలకమైన ఉద్దేశం వుంది. ఆ చట్టం సరిగా అమలు కావడంలేదని, తమను వేధిస్తున్న వారిపై కేసు పెట్టడంలో పోలీసులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని దళితులు ఆరోపిస్తుంటారు. దళితులను వేధించేవారిలో పెత్తందారీ కులాలకు చెందినవారు, స్థాని కంగా డబ్బు, పలుకుబడి ఉన్నవారే అధికం. అందువల్ల సహజంగానే పోలీసులు చూసీ చూడనట్టు ఉండిపోతారు. అవతలివారి నుంచి డబ్బు తీసుకుని రాజీకి రావాలని ఒత్తిళ్లు తెస్తారు, బెదిరిస్తారు. కమిటీలు చురుగ్గా పని చేస్తుంటే కిందిస్థాయి అధికారులు అప్రమత్తంగా వుంటారు. ఫిర్యాదు అందిన వెంటనే చర్యలకు సిద్ధపడకపోతే సంజాయిషీ చెప్పుకోవాల్సి వస్తుందన్న భయం వారిని వెన్నాడు తుంది. 

అటు పోలీ సుల వద్దా, ఇటు న్యాయస్థానాల్లోనూ కేసులు పెండింగ్‌ పడినప్పుడు ఏ దశలో, ఎందుకు నిలిచి పోయాయో కమిటీలు పరిశీలించి... ఆ అవరోధాలను తొలగించే ప్రయత్నం చేస్తాయి. ప్రత్యేక కోర్టుల ఏర్పాటులో జాప్యంవల్ల లేదా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు లేకపోవడంవల్ల కేసుల విచారణ నత్త నడకన సాగుతున్నదని తేలితే అందుకు అవసరమైన చర్యకు సిఫార్సు చేస్తాయి. నిర్ణీత కాల వ్యవధిలో కమిటీలు సమావేశమవుతుంటే ఇలాంటి సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. కానీ మూడేళ్లపాటు 25 రాష్ట్రాలూ, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కమిటీలు ఒక్కసారి కూడా సమావేశం కాలేదంటే ఎస్సీ, ఎస్టీ వర్గాల హక్కుల పరిరక్షణ విషయంలో ప్రభుత్వాలు ఎంతగా అలసత్వం ప్రద ర్శిస్తున్నాయో సులభంగానే తెలుస్తుంది. 

కేంద్రమంత్రి ఇచ్చిన సమాధానంలో ఆసక్తికరమైన అంశాలున్నాయి. దేశంలో ఒక్క హరియాణా మాత్రమే 2016, 2017 సంవత్సరాల్లో నిబంధనలు తు.చ. తప్పకుండా పాటించింది. 2018లో ఒకసారి మాత్రమే సమావేశం నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో వరసగా మూడేళ్లూ రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కమిటీలు సమావేశమే కాలేదని మంత్రి ఇచ్చిన జవాబు చూస్తే అర్థమవుతుంది. దళితుల విషయంలో చంద్రబాబుకున్న చిన్న చూపేమిటో వివిధ సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. 

దేశ జనాభాలో ఎస్సీ కులాలు 16.6 శాతమైతే, ఎస్టీ వర్గాలవారు 8.6 శాతం. ఈ వర్గాలవారు సామాజికంగా ఎదగడానికి, అభివృద్ధి సాధించడానికి వివక్ష, వేధింపులు, దాడులు అవరోధంగా ఉంటున్నాయి. ఆ వర్గాల సంక్షేమానికి వివిధ పథకాలు అమలు చేయడం ఎంత అవసరమో... ఆ వర్గాలు నిర్భయంగా, గౌరవప్రదంగా జీవించడానికి అవసరమైన పరిస్థితులు కల్పించడం కూడా అంతే ప్రధానం. అయితే ఏటా సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ రాష్ట్రాల్లోని నిఘా, పర్యవేక్షణ కమిటీల పనితీరుపై ఇస్తున్న సమాచారం నిరాశాజనకంగానే వుంటోంది. ఈ విషయంలో రాష్ట్రాలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహ రించాలి. చట్ట నిబంధనల్ని ప్రభుత్వాలే పాటించకపోతే ఇక సాధారణ పౌరుల నుంచి ఏం ఆశించగలం?

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top