ఇవి ప్రమాద సంకేతాలు

Sakshi Editorial On Amphan And Nisarga Cyclones

రెండు నెలలు... రెండు తుపాన్లు! రెండింటి మధ్యా వ్యవధి 14 రోజులు మాత్రమే. ఈ రెండూ భారీ నష్టం కలిగించే తుపానులని వాతావరణ విభాగం ప్రకటించింది. ఒకపక్క కరోనా మహమ్మారిని ఎదుర్కొనడం ఎలాగో తెలియక సామాన్యులు సతమతమవుతూ ఉపాధి లేక, తిండి దొరక్క కష్టాలు పడుతుండగా వచ్చిపడిన ఈ విపత్తులు తూర్పు, పడమర తీరాలను వణికించాయి. ఇందులో ఒకటి– మే నెలలో బంగాళాఖాతంలో ఏర్పడిన అంపన్‌ తుపానైతే, రెండోది అరేబియా సముద్రంలో ఏర్పడి బుధవారం ముంబై సమీపంలో తీరం దాటిన నిసర్గ. అంపన్‌ 1999 తర్వాత బంగాళా ఖాతంలో ఏర్పడ్డ అతి పెద్ద తుపాను. ప్రత్యేకించి పశ్చిమబెంగాల్‌కు 200 ఏళ్లలో ఇంత భారీయెత్తున ఎప్పుడూ తుపాను రాలేదు. అది సృష్టించిన విలయం, విధ్వంసం అంతా ఇంతా కాదు. తుపాను విరుచుకుపడిన రాత్రి 72మంది చనిపోగా వేలాది వృక్షాలు నేలకొరిగాయి. భారీగా పంట నష్టం సంభవించింది. అంపన్‌ తుపాను వల్ల లక్ష కోట్ల మేర ఆస్తి నష్టం జరిగిందని పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం ప్రకటించింది. దేశంలోని నాలుగు మెట్రో నగరాల్లో ఒకటైన కోల్‌కతా చివురుటాకులా వణికింది. ఒడిశా కూడా పెను నష్టం చవిచూసింది. నిసర్గ సైతం అదే స్థాయిలో భయపెట్టింది. ముంబై మహానగరం వందేళ్లలో కనీవినీ ఎరుగనంతగా విధ్వంసాన్ని చవిచూడక తప్పదని వాతా వరణ నిపుణులు అంచనా వేశారు. అయితే ముంబై ముప్పును తప్పించుకుంది. 120 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచడం, ఇళ్లు కూలడంవంటి ఉదంతాలు చోటు చేసుకున్నాయి. ఆరుగురు మరణించారు. పొరుగునున్న గుజరాత్‌లో కూడా ముప్పు తప్పించుకుంది.

వెంటవెంటనే వచ్చిన ఈ రెండు తుపానులకూ మూల కారణాలు పర్యావరణ విధ్వంసంలోనే వున్నాయి. ఉష్ణమండల ప్రాంతాల్లో ఏర్పడే తుపానులన్నీ సముద్ర జలాలు వేడెక్కడం వల్లే సంభవిస్తాయి. సముద్ర ఉపరితలం ఉష్ణోగ్రతలు 26.5 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు మించి పెరిగితే తుపానులు ఏర్పడతాయని నిపుణులంటారు. మొన్న మార్చిలో ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా వుండే ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) విడుదల చేసిన నివేదిక చూస్తే పర్యావరణానికి ఏ స్థాయిలో ముప్పు ఏర్పడుతున్నదో అర్థమవుతుంది. భూతాపం కారణంగా వాతావరణంలో కలుగు తున్న మార్పులు మానవజీవనంపై పెను ప్రభావం చూపబోతున్నాయని ఆ నివేదిక హెచ్చరించింది. అధిక ఉష్ణోగ్రతల వల్ల ఆర్కిటిక్‌ సముద్రంలో మంచు పలకలు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయని, పర్యవసానంగా వాతావరణంలో పెనుమార్పులు చోటు చేసుకుని సాంఘికార్థిక అభివృద్ధి, ప్రజారోగ్యం, వలసలు పెను సమస్యలుగా మారతాయని, ఆహార భద్రతకు ముప్పు ఏర్ప డుతుందని తెలిపింది. ప్రపంచ దేశాల వాతావరణ విభాగాలు, అంతర్జాతీయ నిపుణులు, వివిధ దేశాలకు చెందిన శాస్త్ర, సాంకేతిక పరిశోధన సంస్థలు వగైరాలతో సంప్రదించి ఏటా ఈ నివేదిక రూపొందిస్తారు. ప్రపంచంలో పర్యావరణ పరిస్థితి ఏవిధంగా వున్నదో అంచనా వేయడానికి హవాయీ దీవుల్లో కార్బన్‌ డై ఆక్సైడ్‌ స్థాయిని నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. అక్కడ మొన్న జనవరి, ఫిబ్రవరి నెలల్లో కార్బన్‌ డై ఆక్సైడ్‌ కనీవినీ ఎరుగని స్థాయిలో పెరిగిందని నిపుణులు నిర్ధారించారు. ఈమధ్యే బ్రిటన్‌ వాతావరణ విభాగం ప్రపంచ ఉష్ణోగ్రతలు వచ్చే నాలుగేళ్లలో 1.06 డిగ్రీల సెంటి గ్రేడ్‌ నుంచి 1.62 డిగ్రీల సెంటిగ్రేడ్‌ మధ్య పెరిగే అవకాశం వున్నదని తెలిపింది. కర్బన ఉద్గారాలు 1990 స్థాయిలో కనీసం 60 శాతం తగ్గకపోతే ప్రకృతి వైపరీత్యాలు ఉన్నకొద్దీ ఉగ్రరూపం దాలుస్తాయని పాతికేళ్లనాడే నిపుణులు తేల్చిచెప్పారు. అయినా ప్రభుత్వాలు మేల్కొనకపోవడంతో నానాటికీ భూగోళానికి ముప్పు ఎక్కువవుతోంది. డబ్ల్యూఎంఓ తొలి నివేదిక విడుదల చేసిన 1994లో వాతావరణంలో కార్బన్‌డై ఆక్సైడ్‌ పరమాణువుల స్థాయి 357 పీపీఎం కాగా, ఇప్పుడది 414.11 పీపీఎం. నిరుటితో పోల్చినా అది 3 పీపీఎంలు పెరిగింది. పరిస్థితి ఇంతగా క్షీణిస్తున్నప్పుడు తరచుగా ఉత్పాతాలు విరుచుకుపడటంలో ఆశ్చర్యం ఏముంది?

తాజా నివేదిక చూసైనా ప్రపంచ దేశాల వైఖరిలో మార్పొస్తుందని ఆశిస్తున్నామని డబ్ల్యూఎంఓ సెక్రటరీ జనరల్‌ పెటెరీ తాలస్‌ అంటున్నారు. ముఖ్యంగా వచ్చే నవంబర్‌లో స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరగబోయే వాతావరణ సదస్సులో తమ నివేదికను ప్రముఖంగా ప్రస్తావిస్తామని, వచ్చే పదేళ్లలో 2010నాటి స్థాయి కర్బన ఉద్గారాల్లో 45 శాతం కోత పడేందుకు అనువైన కార్యాచరణను సమష్టిగా రూపొందించుకోవాలని కోరుతామని చెబుతున్నారు. ఇంతవరకూ జరిగిన ప్రపంచ వాతా వరణ సదస్సుల వాలకం చూస్తే గ్లాస్గో సదస్సు ఫలితంపై ఎవరికీ పెద్దగా ఆశలు ఏర్పడవు. ఒకపక్క పర్యావరణానికి ముప్పు ముంచుకొస్తున్నదని చెప్పినా ఏ దేశమూ చిత్తశుద్ధితో నివారణ చర్యలపై దృష్టి పెట్టడం లేదు. పర్యవసానంగానే అంపన్, నిసర్గ వంటి తుపానులు విరుచుకుపడుతున్నాయి. నిసర్గ తుపాను వాస్తవానికి వాతావరణ శాస్త్రవేత్తలను పరుగులెత్తించింది. అల్పపీడనంగా వున్న దశలోనే తుపాను హెచ్చరిక జారీ చేయడం మన వాతావరణ విభాగం చరిత్రలో తొలిసారి నిసర్గ విషయంలోనే జరిగిందని అధికారి చెప్పారంటే అది మొదటినుంచి ఎంత దుందుడుకుగా వున్నదో ఊహించవచ్చు. సాధారణంగా అల్పపీడనం వాయుగుండంగా మారినప్పుడో, అది తీవ్ర వాయు గుండంగా మారినప్పుడో మాత్రమే తుపాను హెచ్చరిక జారీచేస్తారు. కానీ ఉన్నట్టుండి ఏర్పడ టమేకాక, పెనువేగంతో అది కదిలింది. నిసర్గ జూన్‌ 1న వాయుగుండంగా మారి, ఆ మర్నాటికే తీవ్ర వాయుగుండంగా, వెంటనే తుపానుగా పరివర్తనం చెందింది. అంపన్‌ మాత్రం మూడురోజుల తర్వాత తుపానుగా మారింది. తమ అభివృద్ధి నమూనాలను మార్చుకుంటామని ఈ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ప్రపంచ దేశాలు ప్రతినబూనితేనే పరిస్థితి తెరిపిన పడుతుంది. భూగోళం సురక్షితంగా వుంటుంది. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top