పీజియన్‌ మెష్‌తో లీఫ్‌ కంపోస్టర్‌

Leaf Composter with Pigeon Mesh - Sakshi

ఎండాకులను చక్కని ఎరువుగా మార్చేందుకు అతి సులువుగా, అతి తక్కువ ఖర్చుతో, కేవలం పది నిమిషాల్లో మీరే లీఫ్‌ కంపోస్టర్‌ను తయారు చేసుకోవచ్చు.

కావలసిన వస్తువులు:  
1. పీజియన్‌ మెష్‌.
8 అడుగుల పొడవు “ 3 అడుగుల వెడల్పు ఉండే పిజియన్‌ మెష్‌.
ఏ హార్డ్‌వేర్‌ స్టోర్‌లోనైనా దొరుకుతుంది. యువి ట్రీటెడ్‌ మెష్‌ కాబట్టి ఎండకు, వానకు తట్టుకొని నిలబడుతుంది.  

2. జిప్‌ టైస్‌ ప్యాకెట్‌.
ఒక ప్యాకెట్‌లో 30 జిప్‌ టైస్‌ ఉంటాయి. ఏ హార్డ్‌వేర్‌ స్టోర్‌లోనైనా దొరుకుతాయి.

తయారు చేసుకునే పద్ధతి:
► పీజియన్‌ మెష్‌ను సిలిండర్‌ మాదిరిగా నిలువుగా, గుండ్రంగా ఉండేలా మడవండి. రెండు కొసలు దాదాపు ఒక అడుగు – అర అడుగు మేరకు ఒకదానిపైకి మరొకటి వచ్చే విధంగా మడిచి పట్టుకొని.. పీజియన్‌ మెష్‌ ఊడిపోకుండా జిప్‌ టైలతో కట్టేయండి.

► ఏదైనా చెట్టు కింద నేల పైన ఈ లీఫ్‌ కంపోస్టర్‌ను నిలబెట్టండి. దాని చుట్టూతా మట్టిని కొంచెం లోతు తవ్వి.. ఆ మట్టిని కంపోస్టర్‌ చుట్టూ ఎగదోయండి. లీఫ్‌ కంపోస్టర్‌ పడిపోకుండా నిలబడడానికి ఇలా చేయాలి.

► దీనికి మూడు వైపులా వెదరు కర్రలు లేదా తీసేసిన కర్టెన్‌ రాడ్లను నేలలో పాతి, వాటికి కంపోస్టర్‌ను కట్టేసినా పర్వాలేదు పక్కకు ఒరిగిపోకుండా, పడిపోకుండా ఉంటుంది.  

► అంతే.. 7–8 అడుగుల ఎత్తు.. 2.5 – 3 అడుగుల వ్యాసార్థం కలిగిన లీఫ్‌ కంపోస్టర్‌ రెడీ అయినట్టే.

► ఇందులో రోజూ / ఎప్పుడు ఉంటే అప్పుడు ఎండాకులు వేయండి. వారానికోసారి కొంచెం మట్టి లేదా పశువుల పేడ లేదా ఎవరినైనా అడిగి తెచ్చిన కంపోస్టు ఎరువును కొంచెం వేయండి. లేదా సూక్ష్మజీవరాశితో కూడిన తోడు (మైక్రోబియల్‌ కల్చర్‌) వేసినా కూడా ఆకులు అలములు కొద్ది వారాల్లో కంపోస్టుగా మారతాయి.

► మొక్కలకు నీరు పోసినట్లు రోజూ ఈ కంపోస్టర్‌లోని ఆకులపైన కూడా నిరు పోయండి. అవి తేమగా ఉండేంతగా నీరు చాలు. ఇది నేలపైనే నిలబడి ఉంటుంది కాబట్టి, నీరు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు.

► కంపోస్టర్‌ అడుగు భాగంలో రెండు నెలల్లోనే కంపోస్టు తయారవుతుంది. అప్పుడు ఇక ఎండాకులు వేయడం ఆపేయండి. అయితే, నీరు మాత్రం రోజూ తగుమాత్రంగా పోయటం అవసరం. నీరు చిలకరించడం మానకండి.

► ఇంకో నెల తర్వాత (మొత్తం 3 నెలల్లో) అందులో ఆకులన్నీ కంపోస్టుగా మారతాయి. అప్పుడు పీజియన్‌ లీఫ్‌ కంపోస్టర్‌ను ఎత్తివేసి, కంపోస్టును చెట్టు చుట్టూ సర్దేయండి. లేదా కుండీల్లో మొక్కలకు/ఇంటిపంటలకు వేయండి. అంతే.. అద్భుత ప్రకృతి వనరులైన ఎండాకులను తగులబెట్టకుండా, మున్సిపాలిటీకి భారంగా మార్చకుండా.. చక్కని సహజ ఎరువుగా మార్చి నేలతల్లికి చేర్చేశారన్న మాటే!
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top