శాంతి సమాధానం సాఫల్యం దేవుడు ఇచ్చే సంపదలు!

Peace Answer Accomplishments Are God Given Treasures - Sakshi

‘పస్కా’ అనే పులియని రొట్టెల పండుగను యెరూషలేములో ఎంతో ఘనంగా ప్రతి ఏడాదీ జరుపుతారు. ప్రపంచంలోని యూదులంతా ఇప్పటికీ ఈ పండుగ చేసుకోవడానికి యెరూషలేముకొచ్చి అక్కడి మహా దేవాలయంలో దేవుని ఆరాధిస్తారు. యేసు ఆయన శిష్యులు కూడా పస్కా పండుగ కోసమే ఒకసారి యెరూషలేము కొచ్చారు. ఐగుప్తు దాస్య విముక్తికి సూచనగా కొన్ని వందల ఏళ్ళ క్రితం ఇశ్రాయేలీయులు ఆ పండుగను దేవుని ఆదేశాల మేరకు వాగ్దానదేశానికి వెళ్తున్న అరణ్యంలో తొలిసారిగా ఆచరించారు. అప్పటి నుండీ దేవుని ప్రజలు కొన్ని వందల ఏళ్లుగా పస్కా పండుగను ఆచరిస్తూనే ఉన్నారు. ఈసారి పస్కా పండుగ లో యేసే సిలువలో తనను తాను పస్కా పశువుగా బలియాగం చెయ్యబోతున్నాడు. యేసు ఆ విషయాన్ని తన శిష్యులకు ఎంతగా బోధించినా వారికర్థం కావడం లేదు. ప్రభువు శిష్యుల్లో ఒకడైన యూదా ఇస్కరియోతైతే, ఏకంగా యేసును అమ్మి డబ్బు సంపాదించుకునేందుకు అదొక మంచి అవకాశమని నమ్మాడు.

యెరూషలేములో  ప్రధాన యాజకులను, యూదుల పెద్దలను కలుసుకొని, యేసు చుట్టూ ఎప్పుడు చూసినా వేలాది మంది ప్రజలుంటారు. కాబట్టి ఎవరూ లేని చోట ఆయన్ని అప్పగిస్తానని ఒప్పందపడి అందుకు ప్రతిఫలంగా ముప్పై వెండి నాణేలు యూదా తీసుకున్నాడు.యూదా లోకి దేవుని శత్రువైన సాతాను ప్రవేశించాడని, తమతో చేతులు కలిపిన యూదాను చూసి యేసు శత్రువులైన యాజకులు, అధిపతులు ఎంతో సంతోషించారని బైబిల్‌ చెబుతోంది( లూకా 22:3–6).యేసుప్రభువును సంతోషపెట్టాల్సిన యూదా ఆయన శత్రువులను సంతోషపెట్టడం ఆశ్చర్యంగా ఉంది కదూ?? దేవుని రాజ్యం డబ్బుకు, ఈ లోకప్రలోభాలకు సంబంధించినది కాదని, అది పూర్తిగా పరలోక సంబంధమైన విలువలకు, అత్యున్నతమైన సాక్ష్యపు ప్రమాణాలకు సంబంధించిన అంశమని యేసు ప్రభువు పదే పదే తన శిష్యులకు, ప్రజలకు కూడా తన బోధల్లో స్పష్టం చేశాడు. డబ్బుకు విలువ లేదని, దాని విలువ ప్రభువుకు తెలియదనీ కాదు.

యేసు, ఆయన శిష్యులు కూడా తమ ఆహారం తదితర అవసరాల కోసం తప్పకుండా డబ్బు వెచ్చించారు. ఎప్పటికప్పుడు యేసు అభిమానులే ఆ డబ్బు సమకూర్చారు, ప్రభువు ఆ డబ్బు సంచిని యూదా వద్దనే పెట్టాడు కూడా. అయితే డబ్బే సర్వం కాదని యేసు నమ్మాడు, అలాగే జీవించాడు, తన శిష్యులకు అదే బోధించాడు కూడా. లోకం డబ్బుతోనే నడుస్తుంది. కాని డబ్బు కోసమే లోకం నడవకూడ దని ప్రభువు బోధించాడు, తన జీవనశైలితో అదే అంశాన్ని యేసు చాటాడు కూడా. డబ్బుతో కొనలేని, వెలకట్టలేని కుటుంబ ప్రేమలు, స్నేహబంధాలు, శాంతి, సమాధానం, తృప్తి, జీవన సాఫల్యం, ప్రేమ, క్షమాపణ, ప్రజల ఆదరాభిమానాలు, ఇవన్నీ ప్రభువు మాత్రమే ఇవ్వగలిగిన దేవుని రాజ్యసంబంధమైన మూలధనాలు, అమూల్య సిరులు. ఇల్లు, తిండి, డబ్బు లేనోళ్ళు పేదోళ్ళని లోకం నిర్వచిస్తుంది. అన్నమున్నా అది తినేందుకు ఆకలి, అవకాశం లేని వాళ్ళు, మెత్తటి పాన్పు, గొప్ప బంగాళా ఉన్నా హాయిగా నిద్రపోయి, అందులో ఆనందించే వీలు లేని వాళ్ళు.

దేవుని కోసం, దేవుని ప్రేమను పొరుగువాడికి చాటేందుకు కాక, ధనార్జనే ధ్యేయంగా జీవితమంతా స్వార్థం కోసం బతికే వాళ్ళే నిరుపేదలని, దారిద్య్రరేఖకు దిగువన జీవించేవాళ్ళని యేసుప్రభువు బోధలు, ఆయన జీవితమూ నిర్వచించాయి. ఈ ‘బాలశిక్ష’ స్థాయిలోనే యూదా ఇస్కరియోతు ఫెయిల్‌ అయ్యాడు. ‘కామాతురత’ కన్నా భయంకరమైనది ‘ధనప్రలోభం’!! దైవిక రాజ్య విస్తరణలో తనకు సాయం చేసేందుకు దేవుడు పిలిస్తే, మధ్యలో దారి తప్పి ధనప్రలోభానికి గురై, పరిచర్యల్లో నిర్వీర్యులై, భ్రష్టులైన మహామహులెంతో మంది ఉన్నారు. వాస్తవమేమిటంటే, నశించిపోతున్న ఆత్మల్ని రక్షించే అతి ప్రాముఖ్యమైన పని కోసం దేవుడు లోకంలోని అత్యుత్తమ శ్రేణికి చెందిన వ్యక్తులనెన్నుకొని వారిని తనకు పరిచారకులుగా నియమించుకున్నాడు. పోతే, ధనార్జన లాంటి చిన్నపనుల కోసం దేవుడు లోకంలోని కుబేరులనెన్నుకున్నాడు. ఈ తేడా తెలియకనే, యూదా ఇస్కరియోతు దేవుడు తనకిచ్చిన వెలలేని భాగ్యానికి ముప్పై వెండి నాణేల విలువ కట్టి, చరిత్రహీనుడయ్యాడు.
– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top