డ్రైవర్‌ కల్పన

Special Story About Bus Driver Kalpana From Kolkata - Sakshi

కోల్‌కతాలో బస్సు నడపడం అంత తేలికైన పనికాదు. ఇరుకైన రోడ్లు, ట్రాఫిక్, రద్దీగా ఉండే నివాస–మార్కెట్‌ ప్రాంతాలు.. ప్రతి ట్రిప్‌ని కష్టంగా మారుస్తాయి.  అయినా సరే ఆ వీధుల్లో పీ.. పీ.. పీ.. అని హారన్‌ కొడుతూ ఒడుపుగా స్టీరింగ్‌ తిప్పుతూ బస్సు నడుపుతోంది బక్కపల్చగా ఉన్న ఓ యువతి. ఆమె పేరు కల్పనా మొండల్‌. వయసు 21. ఆమెను చూసిన ప్రయాణికులు ఒక మహిళ అయి ఉండి బస్సు ఎలా నడిపిస్తుంది అని ఆసక్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇంతకీ ఎవరీ కల్పన? ఆమె ఎందుకు బస్సు నడిపిస్తోంది?

కల్పనా మొండల్‌ గురించి మనకు పెద్దగా తెలియదు. కానీ, సోషల్‌ మీడియాలో బాగా ప్రాచుర్యం పొందిన బస్సు డ్రైవర్‌. కోల్‌కతా శివారులోని నోసారిలో కల్పన కుటుంబం ఉంది. ఆర్థిక పరిస్థితుల కారణంగా తను చదువుకోలేదు. కుటుంబంలో నలుగురు సభ్యులు. అక్క, తల్లి, తండ్రి, తను. అందరూ ఇంటిలాంటి ఒక గదిలో ఉంటున్నారు. కల్పన తండ్రి సుభాష్‌ ప్రైవేట్‌ బస్సు డ్రైవర్‌గా పని చేసేవాడు. చిన్నప్పుడు తండ్రికి సాయంగా ఉండటానికి తరచూ కల్పన కూడా బస్సులో వెళ్లేది. తండ్రి రోజుకు రెండు రూపాయలు ఇచ్చేవాడు. ఆ డబ్బులతో కల్పన మిఠాయి కొనుక్కొనేది. బస్సు డ్రైవింగ్‌ చేయగా వచ్చే తండ్రి ఆదాయంతోనే నడిచే ఆ కుటుంబం ఓ రోజు పెద్ద కుదుపుకు లోనయ్యింది.

తండ్రికి ధైర్యం చెప్పి..
రెండేళ్ల క్రితం కల్పన తండ్రి ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదంలో రెండు కాళ్లకు ఆపరేషన్‌ అయ్యి మెటల్‌ ప్లేట్స్‌ వేశారు. కుటుంబం గడిచే పరిస్థితి లేక కల్పన తనే కుటుంబాన్ని పోషించాలని నిర్ణయించుకుంది. ‘డ్రైవింగ్‌ నేర్చుకొని ముందు కాలనీలోనే ట్రక్కులు నడిపేది. గోడౌన్లకు లోడు చేర్చేది. మేజర్‌ అయిన తర్వాత లైసెన్స్‌ తీసుకొని బస్సు నడపడం నేర్చుకుంది. నాకు వెన్నుదన్నుగా నిలిచింది’ అంటూ కూతురు గురించి గొప్పగా ఉత్సాహంగా చెబుతూ ఉంటాడు సుభాష్, ‘ఆపరేషన్‌ అయ్యాక మేటల్‌ ప్లేట్స్‌ కారణంగా నా కాళ్లను వంచలేకపోయాను. దీంతో మానసికంగా చాలా కృంగిపోయాను. అలాంటి సమయంలో నా కూతురు కల్పన హామీ ఇచ్చింది నేను కుటుంబాన్ని నడుపుతాను అని. అప్పటికే చుట్టుపక్కల కాలనీలలో రాత్రిపూట కొన్నాళ్లపాటు డ్రైవింగ్‌ నేర్చుకుంటూ ప్రయత్నించింది. బాగా నేర్చుకున్నప్పటికీ 34సి మార్గంలో (ఎస్‌ప్లానేడ్‌–బరానగర్‌) బస్సు యజమాని కల్పనకు బస్సు ఇవ్వడానికి అంగీకరించలేదు. ఎందుకంటే అది చాలా రద్దీ రూటు. వాళ్లు అంగీకరించేవరకు ప్రయత్నించి సాధించింది. అప్పుడు తిరస్కరించినవాళ్ల బస్సునే ఆమె ఇప్పుడు చాకచక్యంగా నడపడం చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. కుటుంబ శ్రేయస్సు కోసం తన భవిష్యత్తు త్యాగం చే సింది నా తల్లి కల్పన’ అంటూ కూతురి గొప్పతనం చెబుతాడు సుభాష్‌. తల్లి మంగళ మాట్లాడుతూ –‘మొదట్లో తండ్రి (సుభాష్‌) కల్పన వెనకాల కూర్చొని సూచనలు ఇస్తూ ఉండేవాడు. కానీ, ఎప్పుడూ తన చేతిని పట్టుకొని నేర్పలేదు’ అంటారు ఆమె.

పోలీసులు సెల్ఫీలు తీసుకుంటారు!
ఇక కల్పన మాట్లాడుతూ ‘ట్రాఫిక్‌ పోలీసులు నన్ను రద్దీ దారుల్లో నడపమని ప్రోత్సహిస్తుం టారు. ఇంకొంతమంది నాతో సెల్ఫీలు దిగి ఆసక్తిగా నా గురించి అడుగుతుంటారు’ అంటుంది. అంతేకాదు, ఇప్పుడామెకు డ్రైవింగ్‌ స్కూల్‌ పెట్టుకోవడానికి కూడా అనుమతి వచ్చింది. ‘‘ప్రయాణీకులు కొందరు బస్సు ఎక్కినప్పుడు ముందు నన్ను చూడరు. కానీ, ఆ తర్వాత నేను ఓ మహిళనని గమనించి ఆసక్తిగా చూస్తూ ఉండటాన్ని నేను నా డ్రైవింగ్‌ సీట్‌ నుంచే అద్దంలో చూసి తెలుసుకుంటుంటాను’ సంబరంగా చెబుతుంది కల్పన. కనీసం పదోతరగతి కూడా పాస్‌కాని కల్పన ఇప్పుడు ప్రైవేట్‌గా చదువుకొని పదవ తరగతి పరీక్షలు రాయాలనుకుంటోంది. ‘అప్పుడైతే ప్రభుత్వంలో డ్రైవర్‌ పోస్ట్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నా తండ్రి కలనే నేను నెరవేర్చాలనుకుంటున్నాను’ అని ఉత్సాహంగా చెబుతుండటం చూస్తుంటే ముచ్చటేస్తుంది.  కుటుంబానికి కష్టం వస్తే పెద్దవాళ్లు చూసుకుంటారులే అనుకోకుండా తానే కుటుంబానికి అండగా నిలబడ్డ కల్పన తన తోటి అమ్మాయిలకే కాదు, యువకులకూ రోల్‌మోడల్‌. 
నిర్మలారెడ్డి చిలకమర్రి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top