అతిథి దేవోభవ!

Special Story on Guests - Sakshi

సందర్భం

తల్లి, తండ్రి, గురువు తర్వాత అతిథిని దేవుడిగా చూడమంది మన సంస్కృతి. ఒక మనిషి తన తావు నుంచి మన తావుకు వచ్చినప్పుడు అతని గౌరవం, మర్యాద దెబ్బ తినకుండా ఆదరించి పంపడం చాలా అవసరమైన గొప్ప సంస్కారమని మన సంస్కృతిచెబుతుంది. మన పురాణాలు కూడా ఉదాహరణలిస్తున్నాయి.

ఇంటికి వచ్చిన శత్రువునైనా ఆదరించాలనిభారతీయ సంస్కృతి చెబుతుంది. ‘అతిథి’ అంటే తిథి, వార, నక్షత్రాలు లేకుండా వచ్చేవాడని అర్థం. అంటే అనుకోకుండా రావటమన్నమాట. అలా వచ్చారంటే వారు భగవంతునితో సమానం. సాక్షాత్తు ఆ దేవుడే అతిథి రూపంలో మన ఇంటికి వచ్చి, మనకు సేవ చేసే భాగ్యం కలిగించాడని దీని భావం.మన సంప్రదాయంలో నలుగురిని భగవంతుడిగా భావించాలని కృష్ణ యజుర్వేదంలోని తైత్తరీయోపనిషత్తు చెబుతుంది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. మొదటి ముగ్గురితో మనకు రక్త సంబంధం, విజ్ఞాన సంబంధం ఉంటాయి. కాని నాలుగో వ్యక్తితో ఎటువంటి సంబంధమూ లేకపోయినా వారిలోనూ భగవంతుడిని దర్శించాలని ఈఉపనిషత్తు చెబుతోంది.

ఇంటికి వచ్చిన అతిథి ఎవరో మనకు తెలియకపోయినా, గుమ్మంలోకి రాగానే, కాళ్లుకడుక్కోవడానికి నీరు ఇచ్చి, లోపలకు సాదరంగా ఆహ్వానించి, దాహానికి మంచి నీళ్లు ఇచ్చి, వింజామర వీచి, కుశల సమాచారాలు అడగాలి. వచ్చిన అతిథికి బడలిక తీరాక, భోజనం చేయమనిఅడగాలి. ఇంట్లో ఆహార పదార్థాలు తక్కువగా ఉన్నప్పటికీ, అతిథిని సంతృప్తి పరచి, ఆతిథ్యం ఇచ్చేవారు ఉపవాసం చేయాలని పెద్దలు చెబుతారు. అలాగే అతిథికి కేటాయించిన గదిలో సుగంధ పరిమళాలు వెదజల్లేలా ధూపం, వెలుగు కోసం దీపం ఉంచాలని, భగవంతుడికి నైవేద్యం సమర్పించినట్లుగా, పవిత్ర భావంతో భోజనం వడ్డించాలని, భోజనం అయిన తరవాత అతిథికి అక్షంతలు ఇచ్చి, వారి దీవెనలు అందుకోవాలని భారతీయ సంప్రదాయం చెబుతోంది.వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి విశ్వామిత్రుడు రాజలాంఛనాలతో, తన పరివారంతో అకస్మాత్తుగా వచ్చినప్పుడు వశిష్ఠుడు తన దగ్గరున్న కామధేనువును స్మరించి వారందరికీ షడ్రసోపేతమైన భోజనం వడ్డించి, వారిని సంతృప్తులను చేయడం మనకు కనిపిస్తుంది.పాండవులు అరణ్య వాసంలో ఉండగా వారి వద్దకు దుర్వాసుడు తన శిష్యులతో అతిథిగా వస్తాడు. అప్పటికి పాండవులు భోజనాలు ముగించి, అక్షయపాత్రను కడిగి బోర్లించారు. అతిథిని ఏ విధంగా గౌరవించాలో తోచక ద్రౌపది శ్రీకృష్ణుyì ని ప్రార్థించింది. ఆయన వెంటనే దుర్వాస మహర్షికి, ఆయన శిష్యులకు కడుపు నిండిపోయేలా చేశాడు. వారు పాండవులదగ్గరకు వచ్చి, కడుపులు నిండుగా ఉన్నాయని, పాండవులను ఆశీర్వదించి తరలి వెళ్లిపోయారు. అలా పరోక్షంగా ఆ అతిథులను సంతృప్తులనుచేశారు.

శ్రీకృష్ణుని బాల్యమిత్రుడు కుచేలుడు శ్రీకృష్ణుని దర్శించుకోవటానికి రాజ్యానికివచ్చాడు. కృష్ణుడు సింహాసనం దిగి వచ్చి, కుచేలు కి అతిథి సత్కారాలు చేసి, దారిద్య్ర బాధలు తొలగించాడు. స్నేహితుడే అయినా
అతిథిలా వచ్చాడు. ఆనందంగా తరలివెళ్లాడు. రామాయణంలో శ్రీరామచంద్రుడు అతిథి గొప్పదనం చెబుతూ ‘రావణుడు వచ్చి శరణు కోరినా ఆయనకు నేను అతిథిలా భావించి, సేవించుకుంటాను’ అంటాడు.
గొప్ప అతిథి మర్యాదలు చేసినవాడిగా బలి చక్రవర్తిని చెప్పుకోవచ్చు. ఆయన యజ్ఞం చేసి, వచ్చిన అతిథులకు అడిగినది లేదనకుండా దానం చేశాడు. అంతేనా? వామనుడు అతిథిగా వచ్చి, మూడు అడుగుల నేల కోరగానే, అన్నీ ధారపోసి, అందరి మన్ననలు పొందాడు.  శూద్రకుడు రచించిన మృచ్ఛకటికం నాటకంలో ఒకనాటి రాత్రి ఒక దొంగ చారుదత్తుడి ఇంటికి దొంగతనానికి వస్తాడు. అతడికి ఆ ఇంట్లో ఏమీ దొరకదు. అందుకు చారుదత్తుడు బాధపడి, అయ్యో వచ్చిన అతిథి రిక్తహస్తాలతో వెళ్లిపోతున్నాడే అనుకుంటాడు. చిరుతొండనంబిని పరీక్షించడానికి శివుడే అతిథి రూపంలో వస్తాడు. బిడ్డలు ఉన్న ఇంట్లోనే భోజనం చేస్తానంటాడు. అప్పటికి వారికుమారుడు శిరియాళుడు మరణిస్తాడు. అతిథి మర్యాదలు ఎలా చేస్తాడో తెలుసుకోవటం కోసమే శివుడు ఈ పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో చిరుతొండ నంబి నెగ్గి, శివసాయుజ్యం పొందాడని బసవ పురాణం చెబుతోంది.

భారతంలో సక్తుప్రస్థుడి కుటుంబం వారం రోజులుగా తిండి లేక అవస్థలు పండుతుంది. ఆ రోజు వారికి పేలాల పిండి దొరుకుతుంది. నలుగురు నాలుగు భాగాలు చేసుకుని తినబోతారు. అంతలోనే ఇంద్రుడు అతిథిగా వస్తాడు. ఆయనను ఆహ్వానించి నక్తుప్రస్థుడు తన భాగాన్ని ఆయనకు వడ్డిస్తాడు. ఆయనకు ఆకలి తీరదు. తర్వాత భార్య, ఆ తరవాత కుమారుడు, కోడలు కూడా వారివారి భాగం పేలాల పిండితోఅతిథిని సంతృప్తిపరుస్తారు.  మెచ్చిన ఇంద్రుడు ఆ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు ప్రసాదిస్తాడు.మానవులే కాదు జంతువులు కూడా అతిథి సత్కారం చేశాయి. ఒక పావురాల జంటలో ఆడ పావురం, ఇంటికి వచ్చిన అతిథి కోసం అగ్నిలో దూకుతుంది. తన మాంసంతో అతిథిని సంతృప్తి పరుస్తుంది.రామాయణంలో అరణ్యవాసం చేస్తున్న రాముడు సీతను వెతుకుతూ, తన ఆశ్రమానికి వచ్చినప్పుడు శబరి పండ్లతో అతిథి సత్కారాలు చేసింది.ఇక ఈ ఉదంతం అందరికీ తెలిసిందే. అత్రి మహర్షి భార్య అనసూయ ఇంటికి త్రిమూర్తులు అతిథిలుగా వస్తారు. ఆతిథ్యం ఇచ్చేవారు వివస్త్రలుగా వడ్డించాలని నియమం పెడతారు. అప్పుడు అనసూయ త్రిమూర్తులను చంటిపిల్లలుగా మార్చి, వారికి పాలిచ్చి అతిథిసత్కారాలు పూర్తి చేస్తుంది.

అతిథికి భోజనం పెడితేనే కానీ భోజనం చేయకూడదనే నియమం కొందరికి ఉండేది. సుమారు 50 సంవత్సరాల క్రితం వరకు ఇంటికి అతిథులు రావాలనే ఆశతో వంట సిద్ధంగా ఉంచేవారు. ఇవాళ అతిథులకు వెళ్లడానికి సమయం ఉండటం లేదు. ఆతిథ్యం ఇచ్చేవారికి సమయం ఉండటం లేదు. అతిథులు వచ్చిపోయే ఇల్లు, ఊరు, దేశం కళకళలాడతాయి. మనం వొండుకొని మనం మాత్రమే తినే జీవితంలో నిజమైన రుచి ఉందంటారా?– వైజయంతి పురాణపండ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top