లైఫ్‌ ఈజ్‌ వండర్‌ఫుల్‌

Sushmita Sen reveals she fell very sick in 2014 - Sakshi

పోరాటం

మెరుగైన చికిత్స కోసం జర్మనీ వెళ్లినప్పుడు అక్కడి వైద్యులు సుస్మితకు ‘సినాథెన్‌’ అనే పరీక్ష చేశారు. స్టెరాయిడ్స్‌ లేకుండా జీవితాన్ని కొనసాగించే అవకాశాలు ఉన్నదీ లేనిదీ తేల్చి చెప్పే పరీక్ష అది. ఆ పరీక్షను సుస్మితకు రెండుసార్లు చేసి వైద్యులు చెప్పిందేమిటంటే... ఆమె ఇక ఎప్పటికీ స్టెరాయిడ్స్‌ వాడుతూనే ఉండాలని! వాడకుంటే బతకడం కష్టమని!!

సెలబ్రిటీల జీవితాల్లోని గ్లామర్‌ ఒక్కటే మనకు కనిపిస్తుంది. తమ జీవితంలోని కల్లోల సమయాల్లో వాళ్లు చేసిన పోరాటం గురించి వాళ్లకై వాళ్లు బయటపెడితే తప్ప ప్రపంచానికి ఎప్పటికీ తెలిసే అవకాశం లేదు. నాలుగేళ్ల క్రితం దీపికా పడుకోన్‌ తను డిప్రెషన్‌లోకి వెళ్లిన బాలీవుడ్‌ ప్రారంభపు రోజుల గురించి బహిర్గత పరిచినప్పుడు అభిమానులు నిర్ఘాంతపోయారు. ఇంత చలాకీగా, చక్కగా కెరీర్‌లో ఎదుగుతున్న అమ్మాయి జీవితంలోనూ డిప్రెషన్‌ ఉందా అని ఆశ్చర్యపోయారు. అయితే అంతకన్నా ఆశ్చర్యం ఆ డిప్రెషన్‌ నుంచి బయటపడేందుకు ఆమె చేసిన పోరాటం. అలాంటి స్ఫూర్తిదాయకమైన పోరాటమే ‘విశ్వసుందరి’ సుస్మితా సేన్‌ జీవితంలో ఉందని ‘ఇండియా టుడే’కి ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడయింది.

2014లో బెంగాలీ సినిమా ‘నిర్బాక్‌’ చిత్రీకరణ పూర్తి అవుతుండగా సుస్మిత ఒక్కసారిగా కుప్పకూలిపోయి, తీవ్రమైన ఆనారోగ్యానికి గురయ్యారు. అలా ఎందుకయ్యిందో వెంటనే ఎవరూ తెలుసుకోలేకపోయారు. అనేక నిర్థారణ పరీక్షలు జరిపాక ఆమె దేహంలో అడ్రినల్‌ గ్రంథి.. కార్టిసాల్‌ను ఉత్పత్తి చెయ్యడం ఆగిపోయిందని వైద్యులు కనిపెట్టారు. కార్టిసాల్‌ అనేది ఒక ఉత్ప్రేరక హార్మోన్‌. రక్తంలోని గ్లూకోజ్‌ స్థాయులను, జీర్ణక్రియను నియంత్రిస్తుంది. నొప్పుల్ని, వాపుల్ని నివారిస్తుంది. జ్ఞాపకశక్తికి సహాయకారిగా ఉంటుంది. దేహంలోని ఉప్పును, నీటిని సమన్వయపరిచి రక్తపోటును అదుపులో ఉంచుతుంది. మనిషి ఆరోగ్యానికి ఇంత కీలకమైన కార్టిసాల్‌ను అడ్రినల్‌ గ్రంథులు మూత్రపిండాల పైభాగంలో ఉంటాయి. అవి కార్టిసాల్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కోల్పోవడం వల్లనే సుస్మిత అకస్మాత్తుగా పడిపోయి, ఆ వెంటనే పూర్తి అనారోగ్యంలోకి వెళ్లారు.

కారణం తెలిసిన వెంటనే వైద్యులు ఆమెకు చికిత్స మొదలు పెట్టారు. ‘హైడ్రోకార్టిసన్‌’ అనే స్టెరాయిడ్‌ను ఇచ్చి, ప్రతి ఎనిమిది గంటలకొక ఇంజెక్షన్‌ తీసుకోవాలనీ లేకుంటే కోలుకోవడం కష్టం అని చెప్పారు. ఆ తర్వాత ఇంజెక్షన్‌లకు ప్రత్యామ్నాయంగా మాత్రల్ని సిఫారసు చేశారు. దాదాపు రెండేళ్ల పాటు (2015–16) ఆ స్టెరాయిడ్‌ను వాడారు సుస్మిత. ఆ సమయంలో ఆమె నరకం అనుభవించారు. అంతకంటే ఎక్కువగా స్టెరాయిడ్‌ దుష్ప్రభావంతో శారీరకంగా, మానసికంగా ఆమె నలిగిపోయారు. చర్మం మునుపటి మెరుపు కోల్పోయింది. జుట్టు ఊడిపోవడం మొదలైంది. ఒంట్లో స్టెరాయిడ్‌ నిల్వలు పేరుకుని పోయి ముఖం చిన్నబోయింది. మెరుగైన చికిత్స కోసం జర్మనీ వెళ్లినప్పుడు అక్కడి వైద్యులు సుస్మితకు ‘సినాథెన్‌’ అనే పరీక్ష చేశారు. స్టెరాయిడ్స్‌ లేకుండా జీవితాన్ని కొనసాగించే అవకాశాలు ఉన్నదీ లేనిదీ తేల్చి చెప్పే పరీక్ష అది.

ఆ పరీక్షను సుస్మితకు రెండుసార్లు చేసి వైద్యులు చెప్పిందేమిటంటే... ఆమె ఇక ఎప్పటికీ స్టెరాయిడ్స్‌ వాడుతూనే ఉండాలని! ఆ మాటతో సుస్మిత ప్రపంచం తలకిందులైపోయింది. రోజుకు 60 మిల్లీ గ్రాముల స్టెరాయిడ్స్‌ను వైద్యులు సిఫారసు చేశారు. శక్తి మరీ సన్నగిల్లుతున్నప్పుడు ఆ మోతాదును 100 మిల్లీ గ్రాముల వరకు పెంచుకోవచ్చని చెప్పారు. ప్రెస్‌ కాన్ఫరెన్సులు అవీ ఉన్నప్పుడు మోతాదును పెంచి వేసుకునేవారు సుస్మిత. ఆ మోతాదుల ప్రభావంతో ఆమె కంటి చూపు మందగించింది. దేహంలోని శక్తి హరించుకుపోయింది. ఆ సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌లో తన గురించి మొత్తం రాసుకోవాలని భావించి కూడా ఆఖరు నిముషంలో ఆ ప్రయత్నం మానుకున్నారు. ‘సుస్మితాసేన్‌ ఇలాక్కాదు తన అభిమానులకు గుర్తుండి పోవాలసింది’ అనుకున్నారు. బతుకును ఇచ్చే నెపంతో చావుకు దగ్గర చేస్తున్న స్టెరాయిడ్‌తో ఫైట్‌ చెయ్యాలనుకున్నారు.

డాక్టర్లు గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా ఏ పనీ చేయకూడదని, అలా చేస్తే బ్రెయిన్‌కు రక్తం సరఫరా అవదని, అది మరింత ప్రమాదం అని డాక్టర్లు హెచ్చరించినప్పటికీ సుస్మిత వినలేదు. తన దేహంలో ఏం జరుగుతోందో తనకై తను తెలుసుకునే ప్రయత్నం చేశారు. తన అనారోగ్యంపై యోగాను ప్రయోగించుకున్నారు. 2016 అక్టోబర్‌ నాటికి మరీ శిథిలమైపోయారు. వెంటనే ఆమెను అబూధాబి ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ కూడా సుస్మితకు సినాథెన్‌ పరీక్ష జరిపి ఆమెను డిశ్చార్చ్‌ చేశారు. అక్కడి నుంచి దుబాయ్‌ వెళుతుండగా.. అబుధాబి డాక్టర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది.. ‘సుస్మితా మీరు ఈ పూట డోస్‌ వేసుకున్నారా?’’ అని. ‘‘లేదు. ఏదైనా తిని వేసుకుంటాను’’ అన్నారు. సుస్మిత. ‘‘అక్కర్లేదు. మీరిక పిల్స్‌ వేసుకోనక్కర్లేదు’’ అన్నాడు డాక్టర్‌. సుస్మిత ఆశ్చర్యపోయి, ‘‘ఎందుకు?’’ అని అడిగారు.అప్పుడు డాక్టర్‌ చెప్పిన మాటకు ఆమె కొన్ని క్షణాల వరకు మామూలు మనిషి కాలేకపోయారు. డాక్టర్‌ను అడిగి మళ్లీ అదే మాట చెప్పించుకున్నారు.

‘‘మీరిక కార్టిసాల్‌ పిల్స్‌ వేసుకోనక్కర్లేదు సుస్మితా. ఎందుకంటే మీ ఆడ్రినల్‌ గ్రంథులు కార్టిసాల్‌ను తిరిగి ఉత్పత్తి చెయ్యడం మొదలు పెట్టాయి’’ అని చెప్పారు డాక్టర్‌. ఒక విధంగా అది వండర్‌. ఎందుకంటే తన ముప్పై ఐదేళ్ల ప్రాక్టీస్‌లో ఎప్పుడూ అలాంటి అనుభవాన్ని చూడలేదట ఆ డాక్టర్‌. ఇక సుస్మిత అయితే తన అదృష్టాన్ని తనే నమ్మలేకపోయారు. 2016 అక్టోబర్‌లోనే మందులు మానేశారు. మానేశాక కొంతకాలం మానడం వల్ల సంభవించే దుష్పరిణామాలు ఆమెను బాధించినా, తట్టుకుని నిలబడ్డారు. ఈ విషయాలన్నీ ఇంటర్వ్యూలో చెబుతూ.. ‘వైద్యులు చెయ్యొద్దన్న దానిని చెయ్యడం నా ఉద్దేశం కాదు. మరణాన్ని తప్పించుకునే పోరాటప్రయత్నంలో నేను ఎలా మార్పు చెందుతానో అలా మారడానికి నా మనసు అంగీకరించలేదు కాబట్టి.. వైద్యులు వారిస్తున్నా నేను చెయ్యాలనుకున్నట్లుగా యోగా చేశాను. జిమ్నాస్టిక్స్‌ని కూడా మొదలు పెట్టాను’’ అన్నారు సుస్మిత.     ∙

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top