అందమైన గెలుపు

Women who have settled in other areas are likely to get opportunities in film modeling - Sakshi

‘‘మీ లక్ష్యం ఏంటి?’’ మిస్‌ ఇండియా, మిస్‌ వరల్డ్, మిస్‌ యూనివర్స్‌ .. ఏ బ్యూటీ కంటెస్ట్‌లోనైనా కామన్‌ క్వశ్చన్‌ ఇది. కంటెస్టెంట్స్‌ ఇచ్చే సమాధానమూ సర్వ సాధారణమే.. ‘‘అనాథలకు సేవ చేయడం’’ అంటూ! అయితే అందాల కిరీటం దక్కగానే ధ్యేయం మారిపోతుంది.

సినిమా ఇండస్ట్రీలో అవకాశాల తలుపులు తట్టే ప్రయత్నం మొదలవుతుంది. గత కొన్నేళ్లుగా ఇదే సంప్రదాయంగా కొనసాగుతోంది. కానీ ఆ సంప్రదాయాన్ని కాదని.. సినిమా, మోడలింగ్‌ రంగాల్లో అవకాశాలు వచ్చినా సింపుల్‌గా ‘నో’ చెప్పి ఇతర రంగాల్లో స్థిరపడ్డ అందాల రాణులూ ఉన్నారు. వాళ్ల గురించి తెలుసుకుందాం.

ఇంద్రాణి రెహ్మాన్‌
మన దేశంలో అందాల పోటీలు 1952లో ప్రారంభమయ్యాయి. ఆ యేటి బ్యూటీ ‘మిస్‌ ఇండియా యూనివర్స్‌’ ఇంద్రాణి రెహ్మాన్‌. సినిమా రంగాన్ని ఎంచుకోక.. తనకు ఇష్టమైన శాస్త్రీయ నృత్యంలోనే సాధన చేశారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచారు. పద్మశ్రీ బిరుదూ పొందారు. హార్వర్డ్‌ మొదలు ఎన్నో యూనివర్శిటీల్లో బోధించారు. జూలియర్డ్‌ స్కూల్‌లో ఫ్యాకల్టీ మెంబర్‌గా ఉన్నారు. 

రీటా ఫారియా
1966లో ‘మిస్‌ వరల్డ్‌’గా ఎన్నికైన రీటా ఫారియా మిస్‌ వరల్డ్‌ కిరీటాన్ని పొందిన తొలి భారతీయురాలే కాదు.. ఫస్ట్‌ ఏషియన్‌ కూడా. అలా ఆమె క్రౌన్‌ ధరించిందో లేదో ఇలా మోడలింగ్, సినిమా చాన్సెస్‌ ఆమె ఇంటి కాలింగ్‌ బెల్‌ నొక్కాయి. ‘నో చాన్స్‌’ అని చెప్పింది. ఆమె ఆశ, ఆశయం అంతా డాక్టర్‌ కావాలనే. తర్వాత  డాక్టర్‌ డేవిడ్‌ పావెల్‌ అనే ఎండోక్రైనాలజిస్ట్‌ను పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలతో ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో స్థిరపడ్డారు రిటా ఫారియా. 

కవితా భంభాని
1969లో ‘మిస్‌ ఇండియా’గా ఎన్నికయ్యారు కవితా భంభాని. ఇండియన్‌ ఆర్ట్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌లోకి అడుగు పెట్టారు. ఇంటీరియర్‌ డిజైనర్‌గా ఖ్యాతి సంపాదించారు. సినిమా రంగంతో ఆమెకున్న  కనెక్షనల్లా హీరో అనిల్‌ కపూర్‌ ఆమెకు మరిది కావడమే. అవును.. అనిల్‌ కపూర్‌ భార్య సునీతా కపూర్‌.. కవితా భంభాని చెల్లెలు. 

అలమ్‌జీత్‌ కౌర్‌
1978 ‘మిస్‌ ఇండియా యూనివర్స్‌’ అలమ్‌జీత్‌ కౌర్‌. లా చదువుతున్నప్పుడు మిస్‌ ఇండియా కంటెస్ట్‌లో పాల్గొన్నారు. మిస్‌ యూనివర్స్‌ కంటెస్ట్‌లో బెస్ట్‌ నేషనల్‌ కస్ట్యూమ్‌ అవార్డ్‌ కూడా అందుకున్నారు. ఈ పోటీల తర్వాత మళ్లీ న్యాయశాస్త్ర రంగంలోకి వచ్చారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. 

దీప్తీ దివాకర్‌
1981లో ‘మిస్‌ ఇండియా వరల్డ్‌’గా ఎన్నికయ్యారు దీప్తీ దివాకర్‌. ఆమె భరతనాట్య కళాకారిణి. ప్రపంచ వ్యాప్తంగా నృత్య ప్రదర్శనలు ఇస్తున్నారు. రచనా వ్యాసాంగం కూడా చేస్తారు. ‘ట్రీ ఆఫ్‌ వర్స్‌’ అనే ఆధ్యాత్మిక కవితా సంకలనాన్ని ప్రచురించారు.

ఉత్తరా మాత్రే ఖేర్‌
1982 ‘మిస్‌ ఇండియా వరల్డ్‌’ కిరీటాన్ని గెల్చుకున్నారు. స్వల్ప కాలమే మోడల్‌గా పనిచేసి, తర్వాత  ఆ రంగానికి స్వస్తి చెప్పారు. రెస్టారెంట్‌ బిజినెస్‌లోకి దిగారు. ప్రస్తుతం నాసిక్‌లో భర్తతో కలిసి వ్యవసాయం చేస్తున్నారు. ఓ ట్రస్ట్‌నూ నిర్వహిస్తున్నారు. 

అన్నీ థామస్‌
1998 ‘మిస్‌ ఇండియా వరల్డ్‌’ అన్నీ థామస్‌. డాక్టర్‌ కావాలనుకున్నారు. కాని ఈ బ్యూటీ కంటెస్ట్‌ తర్వాత మెడిసిన్‌ తన కప్‌ ఆఫ్‌ టీ కాదని గ్రహించి.. ఈవెంట్‌ మేనేజర్‌గా స్థిరపడ్డారు. ప్రస్తుతం దుబాయ్‌ కేంద్రంగా పనిచేస్తున్నారు. 

సారా కార్నర్స్‌
2001లో ‘మిస్‌ ఇండియా వరల్డ్‌’గా కిరీటాన్ని అందుకున్నారు సారా. తొమ్మిదేళ్ల వయసు నుంచే మోడలింగ్‌లో ఉన్న ఆమె ఈ కంటెస్ట్‌ తర్వాత మోడలింగ్‌కు గుడ్‌బై చెప్పి బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌లోకి అడుగుపెట్టారు. రచయిత్రి కూడా. పిల్లల కోసం కథలు రాస్తారు. 

వాసుకీ సుంకవల్లి
న్యూయార్క్‌ యూనివర్శీటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందిన వాసుకీ 2011లో ‘మిస్‌ ఇండియా యూనివర్స్‌’గా గెలుపొందారు. రెయిన్‌ మేకర్‌ సంస్థ సహ స్థాపకురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 

వన్యా మిశ్రా
2012 ‘మిస్‌ ఇండియా వరల్డ్‌’ వన్యా మిశ్రా. ఇంజనీరింగ్‌ గ్రాడ్యూయేట్‌ అయిన ఆమె తన కాలేజ్‌మేట్‌తో కలిసి ఫ్యాషన్‌ అంyŠ  లైఫ్‌ స్టయిల్‌ స్టోర్‌ నిర్వహిస్తున్నారు. 

శిల్పా సింగ్‌
2012 ‘మిస్‌ ఇండియా యూనివర్స్‌’ శిల్పా సింగ్‌. క్యూబ్‌ 26 అనే టెక్‌ స్టార్టప్‌తో బిజినెస్, మార్కెటింగ్‌ రంగంలో స్థిరపడ్డారు. మిస్‌ ఇండియా నుంచి మార్కెటింగ్‌ హెడ్‌ దాకా సాగిన తన ప్రయాణాన్ని టెడెక్స్‌ టాక్‌లో పంచుకున్నారు కూడా. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top