36 గ్రహాలపై మనలాగే మరికొం‍దరు!

Aliens Cover story In Sakshi Funday

కవర్‌ స్టోరీ 

భూమ్మీద మన మనుషులం మనుగడ సాగిస్తున్నాం. విశాల విశ్వంలో భూమిలాంటి గ్రహాలు ఎన్నో ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. భూమిలాంటి గ్రహాలు ఉన్నప్పుడు, మనుషుల్లాంటి జీవులు మరోచోట ఉండొచ్చు కదా! ఈ విషయమై మనుషుల్లో చిరకాలంగా కుతూహలం దాగి ఉంది. దీని నివృత్తి కోసం కొందరు అన్వేషణ సాగిస్తున్నారు. ఈ అన్వేషణలో అనేక విషయాలు అడపాదడపా బయటపడుతూనే ఉన్నాయి. టెలిస్కోప్‌లు, ఉపగ్రహాల సాయంతో భూమిలాంటి కొన్ని గ్రహాలనైతే శాస్త్రవేత్తలు ఇంతవరకు గుర్తించగలిగారు గాని, మనుషుల్లాంటి గ్రహాంతర జీవులను మాత్రం గుర్తించలేకపోయారు. అంతమాత్రాన గ్రహాంతర జీవుల ఉనికిని కొట్టిపారేయడానికి కూడా వీల్లేదని కొందరు శాస్త్రవేత్తల అభిప్రాయం.

అంతరిక్షంలోని ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలు ఎన్నెన్నో ఉన్నాయి. భూమిని పోలిన గ్రహాల గురించి, సౌర కుటుంబానికి వెలుపల ఉన్న మరికొన్ని గ్రహాలపై జీవించే గ్రహాంతర జీవుల ఉనికి గురించి రకరకాల కథనాలూ ఊహాగానాలూ ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి. వీటిపై బోలెడంత కాల్పనిక సాహిత్యం ఉంది. కొన్ని సినిమాలూ ఉన్నాయి. వీటన్నింటికీ మించి భూమిని పోలిన గ్రహాల గురించి, గ్రహాంతర జీవుల గురించి అడపాదడపా శాస్త్రవేత్తలు చెబుతున్న అంచనాకు సంబంధించిన కథనాలు కూడా పత్రికలు, టీవీ చానళ్ల ద్వారా జనాలకు తెలుస్తూనే ఉన్నాయి. మనం నివసిస్తున్న భూమి మీద తప్ప మరెక్కడా తెలివి గల మనుషుల్లాంటి జీవులు ఉండే అవకాశమే లేదంటూ అమెరికన్‌ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ మూడేళ్ల కిందట కొట్టిపారేసింది. అప్పటి ‘నాసా’ వాదనకు భిన్నమైన కథనాలు ఇటీవల వెలువడుతుండటం విశేషం. 

భూమిలాంటి గ్రహాలు 600 కోట్లు!
అనంత విశ్వంలో భూమిని పోలిన గ్రహాలు ఏకంగా సుమారు ఆరువందల కోట్ల వరకు ఉన్నాయని శాస్త్రవేత్తల తాజా అంచనా. అంతేకాదు, అలాంటి వాటిలో కనీసం ముప్పయ్యారు గ్రహాలపై మనుషుల్లాగే తెలివితేటలు కలిగిన జీవులు ఏర్పరచుకున్న నాగరికతలు మనుగడలో ఉండవచ్చని కూడా వారి అంచనా. భూమిలాంటి గ్రహాల గురించి, గ్రహాంతర జీవుల ఉనికి గురించి శాస్త్రవేత్తలు ఇటీవల వెల్లడించిన వివరాలను తెలుసుకుందాం...

సూర్యుని కేంద్రంగా భూమి సహా తొమ్మిది గ్రహాలు, ఈ గ్రహాలలోని కొన్నింటి ఉపగ్రహాలతో కూడి ఉన్న సౌర కుటుంబం విశాల విశ్వంలోని ఒక గెలాక్సీలో ఉన్న విషయం చాలామందికి తెలిసినదే. మన గెలాక్సీ పేరు ‘మిల్కీవే’. దీనినే తెలుగులో ‘పాలపుంత’ అని పిలుచుకుంటున్నాం. అంతరిక్షంలో ఇలాంటి అనేక గెలాక్సీలు ఉన్నాయి. భూమిలాంటి ఆరువందల కోట్ల గ్రహాలు ఎక్కడెక్కడో వేర్వేరు గెలాక్సీలలో కాదు, మన గెలాక్సీలోనే ఉన్నాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఇదే గెలాక్సీలో సూర్యుని పోలిన నక్షత్రాలు అనేకం ఉన్నాయి. అలాంటి నక్షత్రాల చుట్టూ గ్రహాలు కూడా ఉన్నాయి. సూర్యుని పోలిన ప్రతి ఐదు నక్షత్రాల్లో ఒక దాని చుట్టూ భూమిలాంటి గ్రహాలు తిరుగుతూ ఉన్నాయని, వాటిలో కొన్నింటి పరిమాణం భూమిలో సగం నుంచి భూమికి రెట్టింపు వరకు ఉన్నాయని కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఇటీవల తమ తాజా అంచనాను వెల్లడించారు. భూమిలాంటి ఆ ఆరువందల కోట్ల గ్రహాలపైనున్న నేల ఆవాసయోగ్యంగా ఉన్నట్లు కూడా వారు చెబుతున్నారు. ‘నాసా’ కెప్లార్‌ మిషన్‌ పంపిన సమాచారాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత ఈ విషయమై ఒక అంచనాకు వచ్చినట్లు చెబుతున్నారు. 

ఈ అంచనాకు ఎలా వచ్చారంటే..?
మన పాలపుంతలో దాదాపు 40,000 కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. వీటిలో సూర్యుడిని పోలిన నక్షత్రాలు 7 శాతం ఉన్నాయి. సూర్యుడిని పోలిన నక్షత్రాలను ‘జీ–టైప్‌’ నక్షత్రాలని శాస్త్రవేత్తలు పిలుస్తున్నారు. ఇలాంటి జీ–టైప్‌ నక్షత్రాలు దాదాపు 2800 కోట్లు. వాటన్నింటికీ వాటి వాటి గ్రహ వ్యవస్థలు ఉన్నాయి. సుమారుగా ప్రతి ఐదు జీ–టైప్‌ నక్షత్రాలలో ఒక దాని చుట్టూ తిరుగుతున్న గ్రహాల్లో భూమిని పోలిన గ్రహాలు కూడా ఉన్నాయి. ఈ లెక్కన మన పాలపుంతలో భూమిలాంటి గ్రహాలు కనీసంగా సుమారు 560 కోట్లు ఉంటాయని, కాస్త అటు ఇటుగా చూసుకుంటే ఇవి దాదాపు 600 కోట్ల వరకు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని బ్రిటిష్‌ కొలంబియా యూనివర్సిటీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్త జేమీ మాథ్యూస్‌ చెబుతున్నారు.

మన పాలపుంతలో భూమిని పోలిన దాదాపు 600 కోట్ల గ్రహాలపైనున్న నేల, వాటిపై వాతావరణం ఆవాస యోగ్యంగా ఉండే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయని ఆయన అంటున్నారు. ఇదివరకటి పరిశోధనల్లో పాలపుంతలోని సూర్యుని వంటి ‘జీ–టైప్‌’ నక్షాత్రాల చుట్టూ తిరిగే గ్రహాల్లో భూమిని పోలిన గ్రహాలు 0.02 శాతం వరకు ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయితే, తాజా అంచనాల ప్రకారం ఇవి 7 శాతం వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. జేమీ మాథ్యూస్‌ నేతృత్వంలోని బ్రిటిష్‌ కొలంబియా వర్సిటీ పరిశోధకుల తాజా అధ్యయనాన్ని ‘ది అస్ట్రోఫిజికల్‌ జర్నల్‌’ గత నెల ప్రచురించింది.

గ్రహాంతర వాసుల ఉనికిపై అంచనా
మన సౌర కుటుంబం ఏర్పడి దాదాపు 450 కోట్ల ఏళ్లు గడిచాయి. మరో వంద కోట్ల ఏళ్లు గడిచాక– అంటే సుమారు 350 కోట్ల ఏళ్ల కిందట భూమిపై జీవం ఆవిర్భవించింది. దాదాపు 2 లక్షల ఏళ్ల కిందట మనుషుల ఆవిర్భావం జరిగింది. నానా పరిణామాల తర్వాత సుమారు 6 వేల ఏళ్ల కిందట నాగరికతలు ఏర్పడ్డాయి. ఇదే లెక్కన మన పాలపుంతలోని సూర్యుని పోలిన గ్రహాలలో దాదాపు సూర్యుని వయసు గల నక్షత్రాలు, వాటి చుట్టూ తిరిగే భూమిని పోలిన గ్రహాలలో దాదాపు 36 గ్రహాలపై మానవులను పోలిన తెలివితేటలు గల జీవులు ఉండటానికి ఆస్కారం ఉందని బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ నాటింగ్‌హామ్‌కు చెందిన అస్ట్రోఫిజిక్స్‌ ప్రొఫెసర్‌ క్రిస్టోఫర్‌ కాన్సెలైస్‌ చెబుతున్నారు. గ్రహాంతర జీవుల ఉనికికి సంబంధించి ఈ విధంగా అంచనా కట్టే పద్ధతిని ‘అస్ట్రోబయోలాజికల్‌ కోపర్నికన్‌ లిమిట్‌’ అంటారని ఆయన వివరిస్తున్నారు.

ఇదివరకటి కాలంలో గ్రహాంతరవాసుల గురించిన అంచనాలను వెల్లడించడానికి శాస్త్రవేత్తలు గ్రహాంతర ప్రాంతాల నుంచి వచ్చే సిగ్నల్స్‌పై ఆధారపడేవారు. గ్రహాంతర ప్రదేశాల నుంచి భూమిపైకి సిగ్నల్స్‌ వచ్చిన సందర్భాలు ఉన్నా, గ్రహాంతరవాసుల ఉనికికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు మాత్రం ఇప్పటి వరకు దొరకలేదు. అయితే, నాటింగ్‌హామ్‌ శాస్త్రవేత్తలు పాత పద్ధతిలో కాకుండా, మనం ఉంటున్న భూమి మీద అధునాతన మానవ సమూహాలు ఏర్పడటానికి పట్టిన కాలాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. ఇదే లెక్కన సూర్యుని పోలిన మిగిలిన నక్షత్రాల చుట్టూ తిరిగే భూమిలాంటి గ్రహాలపై దాదాపు ఎన్నిచోట్ల మానవులను పోలిన తెలివైన జీవుల సమూహాలు ఉండటానికి వీలుంటుందో ఒక అంచనాను రూపొందించారు. మానవుల్లాంటి తెలివైన గ్రహాంతర జీవులకు ఆవాసానికి ఆస్కారమున్న గ్రహాలు భూమి నుంచి సుమారు 17 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్లు చెబుతున్నారు. 

గ్రహాంతరవాసుల ఉనికి కోసం జరిపే తమ పరిశోధనలో వారి ఉనికి ఒకవేళ బయటపడినా, దాని ప్రయోజనం అంతవరకే పరిమితం కాదని ప్రొఫెసర్‌ కాన్సెలైస్‌ అంటున్నారు. గ్రహాంతరవాసుల ఉనికి ఎక్కడైనా ఆధారాలతో సహా ధ్రువీకరించుకోగలిగితే, భూమిపై మానవ నాగరికత ఇంకెన్నాళ్లు మనుగడ సాగించగలదో అంచనా వేయడానికి వీలవుతుందని ఆయన చెబుతున్నారు. పాలపుంతలో భూమ్మీద తప్ప మరే గ్రహంపైనా నాగరిక సమూహాలు మనుగడలో లేవని ఒకవేళ రుజువైతే, మానవాళికి అది అంత మంచి సమాచారం కాదని కూడా అంటున్నారు. అలా కాకుండా, పాలపుంతలోని మరికొన్ని గ్రహాలపై కూడా నాగరిక సమాజాలు మనుగడలోనే ఉన్నట్లు రుజువైతే, మానవాళికి అంతకు మించిన శుభవార్త ఉండదని, అదే గనుక జరిగితే, ఇప్పటి శాస్త్రవేత్తలు కొందరు అంచనా వేస్తున్నట్లుగా భూమిపై మనుషుల మనుగడ మరికొద్ది వందల ఏళ్లకే పరిమితం కాకుండా, ఇంకా చాలాకాలం కొనసాగగలదని ప్రొఫెసర్‌ కాన్సెలైస్‌ అభిప్రాయపడుతున్నారు.

విశ్వాసాల నుంచి పరిశోధనల దిశగా...
గ్రహాంతరవాసుల ఉనికిపై ఆలోచనలు ఈనాటివి కావు. ప్రాచీన నాగరికతలు పుంజుకున్న కాలంలోనే గ్రహాంతరవాసుల ఉనికికి సంబంధించిన ఊహలు, కల్పనలు మనుషుల్లో ఉండేవి. సూర్యుని వంటి నక్షత్రాలు, భూమిలాంటి గ్రహాలు ఈ విశాల విశ్వంలో ఉంటాయనే విశ్వాసం ఉండేది. భూమిలాంటి గ్రహాలు మరికొన్ని ఉన్నాయని, వాటిపైనా మనుషులను పోలిన జీవులు ఉంటారనే ఊహలు, వాటికి సంబంధించిన వర్ణనలు వివిధ దేశాల పురాణాల్లో కనిపిస్తాయి. గ్రహాంతరాలలో మానవుల వంటి తెలివైన జీవులకు సంబంధించిన విపులమైన వర్ణనలు ప్రాచీన జైన గ్రంథాల్లో ఉన్నాయి. గ్రహాంతరవాసులకు సంబంధించిన ప్రస్తావనలు ఉన్న తొలి గ్రంథాలు జైన గ్రంథాలేనని చరిత్రకారుల అంచనా. భూమిపై మాత్రమే కాకుండా, విశాల విశ్వంలోని మరికొన్ని గ్రహాలపై కూడా మానవుల వంటి జీవులు ఉంటారని బలంగా విశ్వసించే వాదం వ్యాప్తిలోకి వచ్చింది.

దీనినే ‘కాస్మిక్‌ ప్లూరలిజం’ అంటారు. మధ్యయుగాలకు చెందిన ముస్లిం రచయితలు ఫక్ర్‌ అల్‌ దిన్‌ అల్‌ రాజి, మహమ్మద్‌ అల్‌ బకీర్‌ వంటివారు తమ రచనల్లో ‘ఖురాన్‌’ నుంచి ఆధారాలను చూపుతూ ‘కాస్మిక్‌ ప్లూరలిజం’ భావనను సమర్థించారు. పదిహేనో శతాబ్దికి చెందిన ఇటాలియన్‌ ఖగోళవేత్త కోపర్నికస్‌ విశ్వం నమూనాను రూపొందించిన తర్వాత ‘కాస్మిక్‌ ప్లూరలిజం’ సిద్ధాంతాన్ని జనాలు మరింత బలంగా నమ్మడం ప్రారంభించారు. కోపర్నికస్‌ తర్వాతి కాలంలో ఇంగ్లిష్‌ వైద్యుడు, తత్వవేత్త జాన్‌ లాకె, ఇటాలియన్‌ ఖగోళవేత్త, తత్వవేత్త గియార్దానో బ్రూనోలతో పాటు ఆధునిక కాలంలో బ్రిటిష్‌ సంతతికి చెందిన జర్మన్‌ ఖగోళవేత్త విలియమ్‌ హెర్షెల్‌ వంటివారు సైతం ‘కాస్మిక్‌ ప్లూరలిజం’ భావనను సమర్థిస్తూ వచ్చారు. 

టెలిస్కోప్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత భూమికి చేరువలో ఎక్కడైనా జీవరాశులు ఉండకపోతాయా అనే అన్వేషణ ప్రారంభమైంది. తొలినాటి టెలిస్కోప్‌ల పరిమితుల మేరకు నాటి శాస్త్రవేత్తలు కొంత దూరం వరకు మాత్రమే చూడగలిగేవారు. అలాంటి ప్రయత్నాలు చేసిన వాళ్లలో పంతొమ్మిదో శతాబ్ది తొలినాళ్లకు చెందిన అమెరికన్‌ ఖగోళవేత్త పెర్సివాల్‌ లోవెల్‌ అంగారకునిపై కృత్రిమంగా నిర్మించిన కాలువలు తనకు కనిపించాయని ప్రకటించాడు. అంగారకునిపై నాగరిక ప్రపంచం ఉందనేందుకు ఇదే నిదర్శనమనే వాదన వినిపించాడు. ఈ విషయమై ఏకంగా ‘మార్స్‌ అండ్‌ ఇట్స్‌ కెనాల్స్‌’ అంటూ పుస్తకమే రాసి పడేశాడు. తర్వాతి కాలంలో మరింత శక్తిమంతమైన టెలిస్కోప్‌లతో చేసిన పరిశోధనల్లో ఇది తప్పని తేలింది. అంగారకుని ఉపరితలంపై గల ఎత్తుపల్లాల్లోని వెలుగునీడలను చూసి లోవెల్‌ అపోహపడి ఉంటాడని శాస్త్రవేత్తలు తేల్చారు. ఒకవైపు టెలిస్కోప్‌ల ద్వారా అన్వేషణ కొనసాగిస్తూనే, మరోవైపు అంతరిక్షంలోకి ఉపగ్రహాలను కూడా పంపడం మొదలయ్యాక గ్రహాంతర జీవుల కోసం అన్వేషణ మరింత ముమ్మరమైంది. 

సౌర కుటుంబంలోనే ఇంకెక్కడైనా మానవుల మనుగడకు ఆస్కారం ఉండే ప్రదేశాలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి గడచిన శతాబ్దకాలంగా ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఈ ప్రయత్నాల్లో భాగంగా సాగుతున్న పరిశోధనల్లో నానాటికీ కొత్త కొత్త విషయాలు బయటపడుతూనే ఉన్నాయి. ఈ ఏడాది మార్చిలో ఒక అధ్యయనం బుధగ్రహంపై కొన్ని ప్రదేశాలు ఆవాసయోగ్యంగా ఉన్నట్లు వెల్లడించింది. భూమికి దగ్గరగా ఉండే శుక్ర, అంగారక గ్రహాలపై కూడా జీవజాలం ఆచూకీ కోసం శాస్త్రవేత్తలు అన్వేషణ సాగిస్తూనే ఉన్నారు. అలాగే, సౌర కుటుంబంలోనివే అయిన గురుగ్రహానికి ఉపగ్రహమైన ‘యూరోపా’, శనిగ్రహానికి ఉపగ్రహాలైన ‘ఎన్‌సెలాడస్‌’, ‘టైటాన్‌’వంటి వాటిపై జీవం మనుగడకు అవకాశం ఉండవచ్చని ఇప్పటి వరకు దొరికిన ఆధారాల నేపథ్యంలో అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మన పాలపుంతలోనే భూమిని పోలిన మరో ముప్పయ్యారు గ్రహాలపై గ్రహాంతరజీవులు ఉండవచ్చన్న తాజా అంచనా వెలుగులోకి రావడం విశేషం.

గ్రహాంతర పరిశోధనల కోసం ‘నాసా’ రోబోలు!
గురుని ఉపగ్రహమైన యూరోపా, శని గ్రహానికి ఉపగ్రహాలైన ఎన్‌సెలాడస్, టైటాన్‌ల ఉపరితల విశేషాలను తెలుసుకోవడానికి అమెరికన్‌ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ రోబోలను పంపాలని భావిస్తోంది. భూమి కంటే భిన్నమైన గురుత్వాకర్షణ, ఎగుడుదిగుడు ఉపరితలాలతో నిండి ఉన్న వీటిపై సునాయాసంగా సంచరించడం ఇప్పటివరకు వినియోగంలో ఉన్న రోవర్‌లకు సాధ్యం కాదనే అంచనాతో ‘నాసా’కు చెందిన జెట్‌ ప్రొపల్షన్‌ లాబొరేటరీ ఈ రోబోలను ప్రత్యేకంగా ఫుట్‌బాల్‌ ఆకారంలో రూపొందించడానికి సమాయత్తమవుతోంది.

ఈ రోబోలకు ‘స్పారో’ (స్టీమ్‌ ప్రొపెల్డ్‌ అటానమస్‌ రిట్రీవల్‌ రోబోస్‌ ఫర్‌ ఓషియానిక్‌ వరల్డ్స్‌) అని నామకరణం కూడా చేశారు. ఇవి ఎలాంటి ఎగుడుదిగుడు ఉపరితలాలపైన అయినా కప్ప మాదిరిగా దుముకుతూ సంచరించగలవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యూరోపా, ఎన్‌సెలాడస్, టైటాన్‌ల ఉపరితలాలపై గడ్డకట్టి పేరుకుపోయిన మంచు అడుగున ఉప్పునీటి సముద్రాలు ఉండవచ్చని వారు అంచనా వేస్తున్నారు. గురు, శని గ్రహాలకు చెందిన ఉపగ్రహాలపైకి ‘స్పారో’ను పంపినట్లయితే, మరిన్ని విశేషాలు బయటపడగలవని ఆశిస్తున్నారు. 
- పన్యాల జగన్నాథదాసు

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top