అనుబంధాలకు ఆవలివైపు 

Sakshi Funday Special Story By PV Narsimharao

కొత్త కథలోళ్లు

అర్ధరాత్రి దాటింది. పల్లెంతా పండు వెన్నెల్లో కలత నిదురలో కలగంటోంది. మంచమ్మీద మల్లేశు అటు నుంచి ఇటు పక్క తిరగేసాడు. కంటి మీద కునుకు వాలక రాత్రంతా జాగారమే, దోమ కాట్లతో పాటు ఆలోచనలు. ‘అసలు తెల్లారకుంటేనే బాగుండును’ అనుకుంటూ  లేచాడు. వీధివసారాతో అరుగుమీద కూర్చుని చుట్ట వెలిగించాడు. రేపు తలచుకుంటేనే గుండెల్లో కలుక్కుమంటోంది. పిల్లల్ని తీసుకుని ఆడు బైరెల్లిపోతాడు. మల్ల ఒంటరి బతుకు తనూ తులిశమ్మా మిగిలిపోతారిక్కడ. కాపలాకుక్కల్లా వీధిగుమ్మంలో ఒకరూ, వంటింట్లోనోకరూ. ఔను అదికాదు గానీ.. కునుకురాకపోతే నీకిదే వూసా, ఎప్పుడోచ్చిందో తులిశమ్మ మార్దవంగా మందలిస్తూ పక్కనే కూలబడింది. చాలా సేపు మౌనంగా ఉండిపోయారిద్దరూ. ఆచ్ఛాదనలేని భుజాల మీంచి పైట చెంగు కప్పుకుంటూ అంది తులిశమ్మ.

 ‘రేపు మల్లొ్లక పాలి చెప్పిసూడిమి యింటాడుగావాల...’ మల్లేషుకు తెలుసు భార్యదీ తన పరిస్థితే అని. వెన్నుపట్టి మీంచి జారిపోతున్నా చూరు వాసాలట్టుకునైనా నిలబడిపోదామన్న ఆశ! 
‘ఆడిష్టం, ఆడి కష్టం..ఎలగ జరగాలనుంటే అదే జరుగుతాది. మన వొశిమా! ఎల్లి చేరబడు’ సగం కాలి ఆరిన చుట్టను అవతలికి గిరాటేసి మంచం మీద వాలిపోయాడు మల్లేశు. 

‘ఇంకేమి నిద్ర, కోడి కూసేయేల దగ్గరైంది’ అనుకుంటూ లేచింది తులిశమ్మ. కొడుకు రాంబాబు తొలిసారి హైదరాబాదుకు పయనమైనప్పుడే అసమ్మతి తెలిపింది తులిశమ్మ. 

‘చెక్కా ముక్కామీద ఎవసాయం గిట్టుబాటవడం లేదు. ఏదో మూట సంపాయించుకోస్తానని ఆడి తాపత్రయం పాపం! పిల్లలున్నారు ఇదివరకటి రోజులు కావుగదా!’ సర్ది చెప్పాడు మల్లేశు. అలా వూరొదిలి వెళ్ళినవాళ్ళు పెద్ద పండుగ దాకా మళ్ళీ కంటపళ్ళేదు. ఫోన్లతోనే యోగక్షేమాలు. అదీ ముక్తసరిగానే మనసు విప్పి కష్టం సుఖం చెప్పుకునేంత సమయం లేదు. కళ్ళలోకి చూస్తూ ముఖకవళికలు గమనిస్తూ మనోగతాన్ని తెలుసుకునే వీలూ లేదు. ఆమధ్య మల్లేశుకు తీవ్రమైన సుస్తీ  చేసినప్పుడు నాలుగైదు కబుర్లెళితే గానీ రాలేకపోయారు. ఇరుగూ పొరుగూ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పుడొచ్చాడు రాంబాబు ఒక్కడే. పిల్లల చదువులు పాడైపోతాయి. డబ్బిచ్చి కొనుక్కొంటున్న పట్నం చదువులా మజాకా? ఆస్పత్రిలో ఆ నాల్రోజులూ వుండి అట్నుండటే వెళ్ళిపోయాడు.

అవతలి గదిలో రాంబాబు పట్టెమంచమ్మీద దొర్లుతున్నాడు. తల్లీదండ్రుల సంభాషణ అస్పష్టంగా చెవినపడుతోంది. తనకూ తెలుసు వాళ్ళ ఆవేదనా ఆరాటమూ. కరెంటు పోయినట్టుంది. పక్కన చాపమీద పడుకున్న పద్మ లేచి, కిరోసిన్‌ దీపం వెలిగించి గూట్లో ఉంచింది. కిందనే దొర్లుతున్న పిల్లలు ఊక్కబోతకు లేచిపోకుండా విసనకర్రతో విసురుతూ వాళ్ళ పక్కనే చేరబడింది. రాంబాబు మనసు ఊగిసలాడుతోంది. ఎటూ తెల్చుకోలేని అనిశ్చితి. రేపే బయల్దేరాలి. అక్కడ మళ్ళీ మాములే! పట్నం బతుకు...బరువు బరువు.. పరుగు పరుగు..తనెందుకెళ్ళాడు హైదరాబాదుకు? అప్పటి తన లక్ష్యం? వర్షాధారిత వ్యవసాయం మన్నుతిని మన్ను కక్కటం తప్ప ఎర్రని ఏగానీ మిగిల్చింది లేదు. పైగా మదుపులకు అప్పులు, ఎన్నాళ్ళిలా? భవిష్యత్తేంటీ.

అప్పల్రావుడూ, వీరయ్య మామా, సూరిదద్దా లాంటి ఇంకెందరో సన్న, చిన్నకారు రైతులు కూలీలతోపాటు వలసెళ్ళిపోయారు. అదుగో ఆ రోజుల్లోనే దిగబడ్డాడు వెంకటి. తన యీడువాడే. వరసకు బావవుతాడు. పదోతరగతి పరీక్షలు రాసీ రాసీ విసుగొచ్చి వదిలేసాడు. వ్యవసాయం అచ్చిరాక, కష్టించటం కలిసిరాక, వ్యసనాలకు ఒంటబట్టించుకుని ఊరమ్మట చెక్కర్లు కొడుతూ జాలీగా ఎంజాయి చేస్తుండేవాడు. ఓ చీకటిరాత్రి ఇంట్లో ఎరువుకోసం దాచి వుంచిన సొమ్ముతో ఊడాయించేసాడు. 

‘ఒళ్లొంగని పోరంబోకెదవ! ఎక్కడో తగలబడనీ’ పట్టించుకోలేదు ఇంటి వాళ్ళూ. అలా ఓ రెండేళ్ళపాటు అయిపూ ఆజాలేని వాడు హఠాత్తుగా ఓరోజు వూళ్ళోకి దిగబడ్డాడు. టీషర్టు, జీన్‌ పేంటు చలువ కళ్ళద్దాలూ మేజోళ్ళూ, వీప్మీద బ్యేగు, నెత్తిమీద క్యాపూ అరచేత పట్టనంత సెల్‌ఫోనూ ఆ హంగూ ఆర్భాటం చూసి ఏం చేస్తున్నావెక్కడున్నావని అడిగిన వాళ్ళకూ అడగని వాళ్ళకూ కూడా ‘బిజినెన్సు, లేబరు సప్లి కన్సల్టేసను’ అంటూ సెల్‌ఫోనులో సంభాషణ అవకుండానే తన బిజీ షెడ్యూల్‌ని ప్రదర్శించుకున్నాడు.

తరవాత చుట్టూ చేరినవాళ్ళనుద్దేశించి ‘ఇక్కడేం కూలి? ఏం డబ్బు? ఏం పనులు? సిటీలోన చూడాలి, కష్టం తక్కువ రాబడెక్కువ. సరదాలూ, సుఖాలూ. లైపంటే అదే...’’  నోరూరించే ప్రసంగాలు ప్రవహించేసాడు. గంజిపట్టి ఆరేసిన నూలు బట్టలా ముడతలు పడ్డ వాళ్ళను ఇస్త్రీ చేసి మడతెట్టీసేడు. చాలామంది కుటుంబాల్తో బయల్దేరిపోయారు. తన మనసూ పీకింది. కానీ పొలం? అయ్య ఏటంటాడో!

‘చెరువు దిగువన నీకున్న మడిచెక్క భోగబంధా కింద ఉంచీ. ఎవడైనా యాభయి వేలిస్తాడు. సిటీలోన రోజువారీ ఫైనాన్సుకిచ్చుకుంటే చేతినిండా సొమ్మే సొమ్ము’’ ఎగదోసాడు వెంకటి. ఆపనే చేసాడు. లబోదిబోమన్నారు తల్లీదండ్రీ.

‘పరుగెట్టి పాల్తాగడం కంటే నిలబడి నీళ్ళే తాగుదాం. గంజో అంబలో తాగి అందరం ఒక్కకాడే ఉందాం సావైన బతుకైన ఇక్కడే సుకం’ సణుగుతూ కన్నీళ్ళెట్టుకుంది పద్మ.  ‘ఈ పల్లెటూర్ల పిల్లలు చదువు సంకనాకి పోతాది. అదే సిటీలోనైతే ఇంజినీర్లూ, డాక్టర్లయిపోతారు... మనూరి నాయిడోరి పిల్లల్లాగ, ఆలోచించుకోండి’ ఎరవేసాడు వెంకటి. మరింక మాటాడలేకపోయారు. వెంకటి వెంటే బయల్దేరాడు పద్మనీ పిల్లల్నీ తీసుకుని. సిటీకి దూరంగా శాటిలైటు కోలనీ అది. రేకుల షెడ్డులో మకాం. అందులోనే వంటావార్పూ, పడకా, సంసారం. సర్కారుబడి అందుబాట్లో లేదక్కడ. ప్రైవేటు స్కూల్లో చేర్పించాడు పిల్లలీద్దర్నీ. ఫీజులు, పుస్తకాలు, యూనిఫాం, బ్యాగులు, బ్యాడ్జీలు, షూలూ, రాకపోకలకు స్కూల్‌ బస్‌... పొలమ్మీద తెచ్చిన యాభయివేలు ఆరిపోయినాయి. ఇద్దరికీ కూలిపన్లు దొరుకుతున్నాయి. వారాంతానికి ఒక్కసారి పేమెంటు, ఆదివారం ఆటవిడుపు. తన కమీషన్‌ డబ్బులు ఉంచుకొని మిగతా మూడువేలు చేతిలో పెడతాడు వెంకటి. బాగనే ఉందకున్నారు. ఓ ఆదివారం ఉదయం వచ్చిన వెంకటి  ‘పదబావా’ అంటూ లాక్కెళ్లాడు తనని. మధ్యలో చికెన్‌ చీకులూ, కాల్చిన ఎండుచేపలూ కట్టించుకుని మద్యం దుకాణంలోకి దూరారిద్దరూ. ఆఖర్న ‘బిల్లిచ్చీ బావా’ అంటూ బయటకొచ్చీసాడు వెంకటి. 

అయిదువందలు పోయినా అనుభవం బాగుంది. అదే మరి! సిటీలైపు! సొమ్ముకి సొమ్ము! సరదాకి సరదా! తన అరచేతిలో గుట్కాపాకెట్‌ ఉంచుతూ గాలికొట్టాడు వెంకట్‌. వారానికోసారి సరదా రోజువారీ అలవాటుగా మారింది. రోజులు గడిచిపోతున్నాయి. ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆకలి మందగిస్తోంది. నీరసం ఆవహిస్తోంది. ఓరోజు పని మధ్యలో భళ్లున వాంతి అయింది. కళ్లు తిరుగుతున్నట్టనిపిస్తే పని చేస్తున్నచోటే కూర్చుండిపోయాడు నిస్సత్తువగా. ‘మస్టరేయించుకుని పనెగ్గొడితే కుదరదు’ గదమాయించేడు సూపరువైజరు. 

‘కుదటపడేవరకు పన్లోకి రావద్దు’ కసురుకుంటూ ఆర్డరేసాడు. ఇంటిపట్టునే ఉండిపోయాడు తను. రోజూ కాలనీలోకి బండిమీద వస్తున్న సంచి వైద్యుడు రెండు ఇంజక్షన్లిచ్చి రెండు మాత్రలు చేతిలో పెట్టి రెండువందలు అందుకొని వెళ్ళిపోతున్నాడు. ఏమాత్రం గుణం కనపళ్లేదు. ఆమాటే అతన్తో అంటే పెద్దాసుపత్రిలో పరీక్షలు చేయించాలి, పదిహేనువేలు పట్టుకుని పదమన్నాడు. చేత చిల్లిగవ్వలేదు, వెంకటే దిక్కు. 

‘అంత సర్దుబాటు కాదిప్పుడు, సర్కారు దవాఖానాకెళ్ళిపో’ సలహా పారేసి తప్పుకున్నాడు వెంకటి. విసుక్కొంటూ, విదిలిస్తున్న ఉచిత వైద్యానికి రెండు బస్సులు మారాలి లేదా ఆటోకి రెండు వందలు పొయ్యాలి. అదీ కొన్నాళ్లే. ఇన్నాళ్లుగా మిగుల్చుకున్నా కష్టఫలం ఆవిరైపోయింది. రోజువారీ జరుగుబాటు పద్మ చెమటోడిస్తేనే. ఇంటద్దె, కరెంటుబిల్లు, స్కూలు ఫీజులూ, బకాయిలకు, తాఖీదులొస్తున్నాయి. 
ఇంటికి కబురెళ్ళింది. ఆగమేఘాల మీద దిగిపోయారు తల్లీదండ్రీ. 

మంచానికంటుపోయిన కొడుకుని చూసి తల్లడిల్లిపోయారు. వెంటనే అద్దెకారు మాట్లాడి ఇంటికి తీసుకొచ్చేసారు పిల్లలతో సహా. మంచి వైద్యం, మంచిపోషణ, అన్నిటికీ మించి అయినవాళ్ళ ఆదరణ, కొద్దిరోజులకే కోలుకున్నాడు. విషయం తెలుసుకున్న వెంకటి నుంచి నిన్ననే ఫోన్‌ కబురు, వెంటనే పన్లోకి చేరాలంటూ. మళ్లీ పోవాలంటే మనస్కరించడం లేదు. పట్నం భ్రమలన్నీ పటాపంచలైనాయి. కానీ ఇక్కడ చేసేది మాత్రం ఏముంది? ఉన్న కాస్త పొలం పరాయి చేతికి చిక్కుకుంది. ఆ సొమ్మూ అలాగే ఖర్చయిపోయింది. ఇంక తప్పదు కదా. రేపటి ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. 

‘....ఎల్లి ఏంబాగుపడ్డాం, ఒంటినిండా రోగాలు, ఇల్లు మునగ అప్పులు, బుర్రల్ల ఎసనాలు.. ఆ కూలేదో, కష్టమేదో ఇక్కడే చేసుకుంటే కాలమెల్లిపోదా..’  కళ్లొత్తుకుంటూనే సంచులు సర్దుకుంది పద్మ. ఊరికి తెల్లారింది. నోట్లో వేప్పులేసుకోని చెరువువైపు బయల్దేరాడు  రాంబాబు. వీధి చివర్న సింహాద్రి తాత ఇంట్లోంచి ఒక్కసారిగా ఏడ్పులు విన్పించాయి.

    ‘ఏమైందేమైందంటూ’ చేరుకుంటున్నారంతా. సింహాద్రికి చాన్నాళైంది అనారోగ్యం, ఆపైన వృద్ధాప్యం, కొడుకులు కుటుంబాలతో దూరానెక్కడో ఉంటున్నారు. కబుర్లు వెళ్తూనే ఉన్నాయి. సెలవు దొరకలేదని, పిల్లలకు పరీక్షలనీ దాటేసుకుంటూ వచ్చారింత వరకూ. అర్ధరాత్రి నుంచి సింహాద్రి పరిస్థితి విషమించింది. పక్కవీధిలో ఉంటున్న ఆరోగ్య కార్యకర్త పరీక్షించి 108 అంబులెన్సుకు ఫోన్‌  చేసింది. సింహాద్రి భార్య మంచం పక్కనే కూలబడిపోయింది. ఇద్దరికీ ఇరుగుపొరుగు సపర్యలు, పరిచర్యలు అందిస్తున్నారు. అంబులెన్సు నుంచి దిగిన వాళ్ళు సింహాద్రిని పరీక్షించి ముఖం మీంచి ముసుగువేసారు. అప్పటికే గాలిపోయింది మరి. అయిన వాళ్లందరికీ కబుర్లు ఫోన్లోనే.

సింహద్రి కొడుకుల గురించి తలా ఓమాట. ‘రేషన్‌ కార్డు తనికీలున్నాయి. రద్దయిపోద్ది అనగానే దిగిపోతారు’ ‘ఇన్సూరెన్స్‌ చెక్కులందుకోటానికి వస్తార్లే. పెద్దకర్మ సరికైనా సెలవ దొరుకుతాదో లేదో మరి.. పెద్ద పెద్ద ఉజ్జోగాలు కదా...’  ‘అంత దూరాన్నించి రాటానికి ఒకరోజైనా పడతాది, రైలు బండి దొరకద్దా. అంతవరకూ వీధిలో శవముంచుకుని పొయ్యి ఎలిగించలేం కదా పట్టిండి.’

 గ్రామస్తులు నడుం కట్టారు. సింహాద్రి కట్టె లేచింది. రాంబాబు ఓ చెయ్యేసాడు. ఎవరో తలకొరివి పెట్టారు. చెరువులో స్నానం చేసొచ్చి ఇంట్లో బట్టలు మార్చుకుంటున్నాడు రాంబాబు.
‘పోనీ.. గుంటలకైనా ఇక్కడ యిడీరాదా! కావాలంటే మీరిద్దరూ ఎల్లిపోండి’ ఆశ చావని తులిశమ్మ ఆఖరి ప్రయత్నం. పక్కనే కోడలు ముక్కు ఎగబీలుస్తూంది.

‘మనూరి బడిలో కూడా ఇప్పుడు ఇంగ్లీష్‌ చదువులు మొదలవుతాయట. పైగా అమ్మ ఒడి పథకం కింద సొమ్మూ అందుతాదట. గౌరమ్మ వదిన చెప్పుతున్నాది’ అంది పద్మ రాంబాబు ముఖంలోకి చూస్తూ.
‘అవున్నాయినా, మొన్నా మద్దిన రచ్చబండ కాడ ఆఫీసర్లు సెప్పతన్నారు అయేవో కొత్త కొత్త పథకాలట, గ్రామసచివాలయంలోన నమోదు సేసుకోండని..’ మల్లేశు బుజ్జగింపు. 

‘‘పద్మా! సాల అటుకు మీద నుంచి పలుగూపారా దించుమీ. ఉపాధి హామీ పన్లు బాగా ఉన్నాయట. ఇక్కడే కూల్జేసుకుందాం. అందరం ఒక్కాడే ఉందాంలే’ రాంబాబు ముఖంలో స్థిర నిర్ణయంతో నిండిన ప్రశాంతత. అందరి కళ్లలో ఆనందం తొలకరించింది. మండు వేసవిలో కుండపోత వర్షం! గుండెల నిండా తృప్తితో కూడిన శ్వాస. వీధిగడపలో ప్రయాణానికి సిద్ధంగా ఉంచకున్న మూటాముల్లెను అవలీలగా భుజానికెత్తుకుని ఉత్సాహంగా ఇంట్లోకి నడిచాడు వృద్ధమల్లేశు. మబ్బులు వీడిన ఎర్రని యెండ చూరు మీంచి జారుతూ వీధిలోంచి పారుతోంది.
- పి.వి. నరసింహారావు 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top