ఇంతింటి కథ...

The Story Of Suryas Wives In Mythology - Sakshi

పురానీతి

త్వష్టప్రజాపతి కుమార్తె సంజ్ఞాదేవి. ఈమెకే ఉష అని కూడా పేరు. ఈమె సూర్యభగవానుడి భార్య. సూర్యుడి చురుకుదనాన్ని చూసి ఇష్టపడే పెళ్లి చేసుకుంది ఉష. కానీ పెళ్లి అయి కొంతకాలం గడిచాక భర్త నుంచి వెలువడే వెలుగు, వేడిని భరించలేకపోయింది. ఆయన తీక్షణత తగ్గించమని ఒకటి రెండుసార్లు అడిగి చూసింది. అది తన సహజ లక్షణ మనీ, తన తీక్షణతను తగ్గించుకోవడం కుదరదని చెప్పాడు సూర్యుడు.

కొంతకాలం ఎలాగో భరించింది. వైవస్వతుడు, యముడు, యమి అనే  సంతానం కలిగారు. ఆ తర్వాత ఆమెలో మరల మునుపటి మార్పు వచ్చింది. తన కోసం వెలుగునూ, వేడినీ తగ్గించుకోమని భర్తను అడిగిందామె. ఎప్పటిలాగే తనని సహిస్తూ, సహధర్మచారిణిగా సహజీవనం చేయాలని నచ్చచెప్పాడు సూర్యుడు. సరేనని తలాడించిందామె. అయితే, తనకు ప్రస్తుతం అమ్మానాన్నల మీద మనసు మళ్లిందనీ, కొంతకాలం అక్కడ గడిపి వస్తానని చెప్పి పుట్టింటికి పయనం కట్టిందామె. భర్త తేజస్సు భరించలేకపోవడం తప్పించి తనకూ ఆయనకూ మనస్పర్థలంటూ ఏమీ లేవు పైగా తానంటే సూర్యుడికి ఎనలేని ప్రేమ అని తెలుసామెకు. అందుకే కొంతకాలం పాటైనా భర్తకు తాను దూరంగా ఉండాలి కానీ, భర్త తనకు దూరంగా  ఉండకూడదనుకుంది. దాంతో ఒక ఆలోచన వచ్చిందామెకు. ముమ్మూర్తులా తననే పోలి ఉన్న తన నీడకు ప్రాణం పోసింది. ఆ రూపానికి ఛాయ అని పేరు పెట్టి, తనలాగే ప్రవర్తిస్తూ, తన పతిని సేవిస్తూ తన సంతానాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ తన మందిరంలో ఉండమంది. అంతకాలం నీడగా ఆమెను అనుసరించడం తప్పించి తనకంటూ ప్రత్యేకత ఏమీ లేదు కాబట్టి అనుకోకుండా అవకాశం రావడంతో ఛాయ అందుకు ఆనందంగా అంగీకరించింది. సంజ్ఞాదేవి సంతృప్తిగా భూలోకానికి వెళ్లింది. అక్కడొక అడవిలో అశ్వరూపంతో ఉండి యథేచ్ఛగా సంచరించసాగింది. 

అలా కొంతకాలం గడిచింది. తర్వాత నారద మహర్షి ప్రబోధ ప్రోద్బలాలతో ఛాయ తనకు కూడా సొంత బిడ్డలు కావాలనుకుంది. ఫలితంగా ఆమెకి శనైశ్చరుడు, సావర్ణి మనువు, తపతి పుట్టారు. మాతృమూర్తి అయ్యాక ఛాయలో అసూయ తలెత్తింది. దాంతో సొంత బిడ్డలకి ఎనలేని మమతానురాగాలు పంచుతూ సంజ్ఞా సంతానంపై సవతి తల్లి ప్రేమను చూపసాగింది. వైవస్వతుడు, యముడు, యమున లకు తాము తమ తల్లికే సవతి బిడ్డలమనే విషయం తెలియదు కాబట్టి అమ్మలో ఇంత ఆకస్మిక మార్పు ఎందుకు వచ్చిందో ఆమెనే అడిగి తెలుసుకుందామని యముడు తన అన్నను, చెల్లిని వెంటబెట్టుకుని అమ్మ వద్దకు వెళ్లాడు. మునుపటిలా తమను ప్రేమగా చూడడటం లేదేమని అడిగాడు. ఛాయ కోపంతో ఈసడించుకుని యముణ్ణి తీవ్రంగా మందలించింది. యముడు తల్లితో తీవ్ర వాగ్వాదానికి దిగడంతో ఆగ్రహించిన ఛాయ, యముణ్ణి భయంకరంగా శపించింది. 
చిన్న విషయానికే పెద్ద శాపానికి గురైనందుకు అమితంగా బాధపడిన యముడు వెక్కుతూ తండ్రితో విషయమంతా విన్నవించాడు. కన్నతల్లి ఏమిటి, కన్నబిడ్డలను శపించడమేమిటనే అనుమానంతో సూర్యుడు ఛాయను గట్టిగా నిలదీయడంతో తాను సంజ్ఞను కాదనీ, ఆమె ప్రతిరూపమైన ఛాయననీ, సంజ్ఞాదేవి అజ్ఞలాంటి అభ్యర్థన వల్లే తాను ఆమె స్థానంలో ఇక్కడ ఉండిపోయాననే విషయాన్ని వివరించింది ఛాయ.

చిత్రంగా సూర్యభగవానుడికి ఇద్దరి మీదా కోపం రాలేదు. తన కాంతిని భరించలేకనే కదా, సంజ్ఞ తనను వీడి వెళ్లిపోయింది... వెళ్తూ వెళ్తూ కూడా తనకు ఏ లోటూ లేకుండా ఉండేందుకు తన ఛాయకు ప్రాణం పోసి వెళ్లింది... అనుకున్నాడు. సంజ్ఞపైన అమితమైన ప్రేమానురాగాలు జనించాయి. ఆమెను వెదుక్కుంటూ వెళ్లాడు. అరణ్యంలో అందమైన ఆడగుర్రం కనిపించేసరికి కుతూహలంగా చూశాడు. ఆ హయమే తన భార్య అని గుర్తించాడు. తాను కూడా మగ గుర్రం రూపం ధరించాడు. భర్తను గుర్తించిన సంజ్ఞ ఆనందంగా ఆయనను చేరుకుంది. వారి అన్యోన్య దాంపత్య ఫలితంగా ఇరువురు కవలలూ, మరొక కుమారుడూ కలిగారు. ఆ కవలలే అశ్వినీ దేవతలుగా... దేవవైద్యులుగా దేవలోకానికి చేరారు. వారి సోదరుడు రేవంతుడు అశ్వహృదయం తెలిసిన వాడిగా భూలోకంలోనే ఉండిపోయాడు. 

తాను ఇంత చేసినా భర్తకు తనపై కోపం రాకపోవడంతో సంజ్ఞకు పతిదేవుడిపై ప్రేమ పుట్టింది. సూర్యభగవానుడితో కలిసి తన నివాసానికి వెళ్లింది. ఈసారి ఆమె అడగకుండానే సూర్యుడు తన మామగారైన విశ్వకర్మ వద్దకు వెళ్లి, తన తేజస్సును తగ్గించమని కోరాడు. విశ్వకర్మ తరిణమనే పరికరంతో అల్లుడి తేజస్సుకు చిత్రిక పట్టాడు. సూర్యగోళం నుంచి అలా రాలిన పొడితో సుదర్శన చక్రాన్ని, త్రిశూలాన్నీ, శక్తి అనే ఆయుధాన్నీ తయారు చేశాడు విశ్వకర్మ. సుదర్శనాన్ని విష్ణువుకు, త్రిశూలాన్ని శివుడికి, శక్తిని పార్వతికీ ఇచ్చాడు. పార్వతి ఆ ఆయుధాన్ని తన గారాబు తనయుడైన కుమారస్వామికి ఇచ్చింది. 

తనకోసం ఎన్నో కష్టాలను భరించిన ఛాయను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంది సంజ్ఞ. ఛాయ సంజ్ఞలో లీనమైపోయింది. భర్త ఉగ్రత తగ్గడం, దానికితోడు ఆయన తనకు తానుగా తన శరీరానికి శీతలత్వాన్ని అలదుకోవడంతో సంజ్ఞకు మరెన్నడూ ఇబ్బంది కలగలేదు. హాయిగా భర్తతో కాపురం చేసుకుంటూ తన బిడ్డలతో పాటు ఛాయాసంతానాన్ని కూడా ప్రేమగా చూసుకుంటూ అక్కడే ఉండిపోయింది. 
ఈ కథలో మనం నేర్చుకోవలసిన నీతి చాలా ఉంది. అదేమిటంటే... కాపురమన్నాక కలతలు, కలహాలు, పొరపచ్ఛాలు సహజం. అయితే, వాటిని పరిష్కరించుకోవడంలోనే మన విజ్ఞత, సమయస్ఫూర్తి బయట పడతాయి. ప్రణయ కలహాలు లేని కాపురం ఉప్పులేని పప్పు వంటిదని పెద్దలు అందుకే అంటారు కాబోలు. 
–డి.వి.ఆర్‌. భాస్కర్‌

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top