నిష్పాక్షికత కోసమే ఈసీకి అధికారాలు

Madabhushi Sridhar Article On Election Commission - Sakshi

విశ్లేషణ  

పశ్చిమబెంగాల్‌ ఎన్నికల ప్రచారం రణరంగంగా మారింది. రాజ్యాంగ అధికరణం 324ను సద్వినియోగం చేశామని కేంద్రం, దుర్వినియోగం చేశారని రాష్ట్రం విమర్శిస్తున్నాయి.  తృణమూల్‌ కాంగ్రెస్‌ని ఏం చేసైనా సరే ఓడించాలని బీజేపీ పట్టుబట్టినట్టు కనిపిస్తున్నది. బీజేపీకి ప్రథమ శత్రువు తానే అన్నట్టు మమతా బెనర్జీ కూడా హోరాహోరీగా ఎదురుదాడులు చేస్తున్నారు. అన్ని రాష్ట్రాలలోకన్నా అక్కడే ప్రధాని ఎక్కువ సభలు ఏర్పాటు చేసుకున్నారు. బీజేపీ, టీఎంసీ తమ తమ గూండాలను విచ్చలవిడిగా రంగంలోకి దింపడం సిగ్గుచేటు. బెంగాల్‌ సంఘ సంస్కరణలకు సాంస్కృతిక వికాసానికి తార్కాణంగా ప్రసిద్ధికెక్కిన ఈశ్వర్‌ చంద్రవిద్యాసాగర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేయడమే కాక దాన్ని ఇరుపక్షాలు ఎన్నికలకు వాడుకుంటున్నాయి.  

అమిత్‌ షా కూడా రెచ్చగొట్టే ప్రసంగాలతో బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. బీజేపీ టీఎంసీ విద్యార్థి వర్గాల వీధి పోరాటాలు పెరిగాయి. ఎన్నికల కమిషన్‌ ఇదివరకెన్నడూ లేని విధంగా ప్రచార సమయాన్ని 20 గంటలు తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో హింసే కారణమయితే రెండు పార్టీల రోడ్డు ప్రచారాన్ని వెంటనే ఒక రోజు రద్దు చేస్తే న్యాయంగా ఉండేది. వేడిగా వాడిగా సాగుతున్న ప్రచారాన్ని వెంటనే ఆపి శాంతి భద్రతలను కాపాడే బదులు, గురువారం సాయంత్రం దాకా ఎన్నికల ప్రచారాన్ని అనుమతించి, ఆ తరు వాత ప్రచారం నిలిపివేయాలని ఆదేశించడం విచిత్రంగా ఉంది. అందుకు కారణం ప్రధాని ఎన్నికల సభలు ఆ సమయంలో ఏర్పాటు చేసుకోవడమే అని మమతా బెనర్జీ విమర్శించారు.  

ఒకరంటే మరొకరికి ఏమాత్రం పడని బీజేపీ, టీఎంసీలు ఒక్క విషయంలో మాత్రం ఏకీభవిస్తున్నాయి. అదేమంటే ఎన్నికల కమిషన్‌ నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదట. నరేంద్రమోదీ, అమిత్‌ షాల చెప్పు చేతల్లో పనిచేస్తూ, వారు జారీ చేసే ఉత్తర్వులకు అనుగుణంగా వ్యవహరిస్తున్నదని మమతా బెనర్జీ ఎన్నికల కమిషన్‌ను విమర్శించింది.   విచిత్ర మేమంటే అమిత్‌ షా కూడా ఎన్నికల కమిషన్‌ పక్షపాతంతో వ్యవహరిస్తున్నదని అంటున్నారు.  

శాంతి భద్రతలు రాష్ట్రం పరిధిలో ఉన్న అంశమని, అందులో జోక్యం చేసుకుని రాష్ట్రపోలీసు అధికారులను బదిలీ చేయడం సరికాదని బెనర్జీ అన్నారు. కానీ ఎన్నికల సమయంలో శాంతి భద్రతల స్థాయిపై ఈసీ అంచనాకే విలువ ఉంటుందని, ఆ అంచనా ఆధారంగానే ఈసీ తగిన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుందని సుప్రీంకోర్టు హర్యానా కేసులో వివరించింది. 

బెంగాల్‌ ప్రచారంలో ఎవరు ఏ నేరాలు చేసారనేది ఇప్పుడే తేలడం సాధ్యం కాదు. బెంగాల్‌ పోలీసులకు వదిలేస్తే, టీఎంసీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తాయి. సీబీఐకి వదిలేస్తే అది కేంద్రం అదుపాజ్ఞలలో ఉండడం వల్ల నమ్మడం సాధ్యం కాదు. ఏదో రకంగా ఎన్నికలు గెలవాలనే స్వార్థంతో తలపడుతున్న రెండు పార్టీల రాజకీ యాల మధ్య రాజ్యాంగం నలిగిపోతున్నది. సుప్రీంకోర్టుతో సహా ఏ కోర్టు కూడా ఎన్నికల కమిషన్‌ వ్యవహారాలలో జోక్యం చేసుకోవడానికి వీలుండదు. ఒక సారి ఎన్నికల నోటిఫికేషన్‌  వచ్చిన తరువాత పోలింగ్‌ ముగిసి ఫలితాలు వెలువడి కొత్త సభ ఏర్పాటయ్యే దాకా ఈసీని పనిచేసుకోనివ్వాలనీ, మధ్యలో స్టేలతో ఆపడానికి వీల్లేదని న్యాయస్థానం అనేక సందర్భాలలో నిర్ధారించింది.

ఎన్నికల కమిషన్‌ స్వతంత్రతను సవాలు చేసే సంఘటనలు అనేకం జరిగాయి. ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయడాన్ని వాయిదా వేసి కేంద్ర ప్రభు త్వం కొన్ని జనరంజక పథకాలు ప్రకటించడానికి వీలు కల్పించిందని, ప్రధాని ప్రసంగాల భాషపై నియంత్రణ చేయడానికి బదులు అన్యాయంగా క్లీన్‌చిట్‌లు ఇచ్చిందని విమర్శలు వచ్చాయి. 

టి.ఎన్‌. శేషన్‌ ఎన్నికల కమిషనర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత స్వతంత్రంగా వ్యవహరించడం అంటే ఏమిటో చేసి చూపించారు. ఒక్క అధికారి మాత్రమే ఎన్నికల కమిషనర్‌గా ఉండి  అధికారాలు వినియోగిస్తే ప్రమాదకర పరిణామాలు ఎదురౌతాయని భావించి ఎన్నికల కమిషన్‌లో అనేకమంది కమిషనర్లను నియమించేందుకు రాజ్యాంగాన్ని సవరించారు. ఏక సభ్య సంఘంగా ఉన్న ఈసీని త్రిసభ్య సంఘంగా మార్చారు. ఒక వ్యక్తి ఒంటెద్దు పోకడలు పోకుండా అదుపు చేయడం కోసం ఈ సవరణ చేశారని చెప్పుకున్నారు. బీజేపీ పాలనలో ప్రతి రాజ్యాంగ వ్యవస్థను భ్రష్టు పట్టించారనే విమర్శలు సర్వే సర్వత్రా వినిపిస్తున్నాయి. ఎన్నికల కమిషన్‌కు రాజ్యాంగం ఉన్నతాధికారాలను కట్టబెట్టింది స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిపించడానికే. స్వతంత్రంగా నిష్పాక్షికంగా పనిచేయకపోతే ఆ అధికారాలు దుర్వినియోగం అవుతాయి.

మాడభూషి శ్రీధర్‌
వ్యాసకర్త బెన్నెట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్‌
madabhushi.sridhar@gmail.com

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top