తీరు మారకుంటే మున్ముందు తిప్పలే!

Mohan Reddy Special Article On Global Climate Change - Sakshi

ఇంతవరకు ప్రపంచమంతటా కొనసాగుతూ వచ్చిన అపరిమిత అభివృద్ధి నమూనాపై కోవిడ్‌–19 ఇప్పుడు ప్రశ్నలు సంధించింది. ప్రకృతి వనరులు, మానవ వనరులను విచ్చలవిడిగా దోచుకోవడం ద్వారా అపరిమితమైన భౌతిక సంపదను సృష్టించడం కోసం పాటుపడే దురాశ కనీవినీ ఎరుగని కష్టాలను కొనితెస్తోంది. మహాత్మా గాంధీ ఆనాడే చెప్పినట్లుగా, ‘మనిషి అవసరాలను సంతృప్తి పరచడం భూమికి సాధ్యమవుతుంది కానీ ప్రతి మనిషి పేరాశలను సంతృప్తి పరచలేదు’. భూగ్రహం మంచి కోసం, భవిష్యత్‌ తరాల బాగు కోసం.. ఆడంబర జీవిత విధానంపై మనం ఇప్పుడు పునరాలోచించాల్సిన అవసరం ఉంది.

కోవిడ్‌ 19 ప్రపంచాన్ని దిగ్భ్రాంతిలో ముంచెత్తింది. చైనాలోని వూహాన్‌లో పుట్టిన కరోనా వైరస్‌ 200 దేశాల్లో దావానలంలా వ్యాపిం చింది. ఇది అనేక ఆర్థిక వ్యవస్థలను ధ్వంసం చేసింది. ప్రపంచ జనాభాలో అత్యధిక భాగానికి ప్రత్యేకించి వ్యాధికి సులభంగా గురయ్యే బడుగువర్గాల్లో భయాన్ని, ఆందోళనను సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు తీవ్రమైన ఒత్తిడిలో పడిపోయాయి. సాంకేతికంగా ముందంజ వేసిన దేశాల్లో ఆత్మవిశ్వాసం ప్రకంపనలకు గురవుతోంది.  ప్రపంచం జనాభాలో దాదాపు సగం వరకు లాక్‌ డౌన్‌లో ఉంటోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై, వందలాది కోట్ల ప్రజానీకం జీవితాలపై కోవిడ్‌–19 పూర్తి ప్రభావాన్ని అంచనా వేయటం కష్టమే. కానీ మానవులు ఆశావాదంతో మనుగడ సాగించే జాతి. మనం గతంలో కూడా సాంక్రమిక వ్యాధులను ఎదుర్కొన్నాం. వ్యాక్సిన్‌ కనుక్కోవడం, వ్యాధికి నివారణను కనిపెట్టడం ద్వారా ప్రస్తుత ఉపద్రవాన్ని మనం కచ్చితంగా అధిగమించగలుగుతాం. 

హెచ్చరికలపై తీవ్ర నిర్లక్ష్యం
చాలామంది ప్రజలకు కరోనా వైరస్‌ ఎక్కడుందో కనిపించడం లేదు కానీ సాంక్రమిక వ్యాధుల నిపుణులు అలాంటి సాంక్రమిక వ్యాధి గురించి సంవత్సరాలుగా హెచ్చరిస్తూ వస్తున్నారు. ఈ వ్యాధులు మళ్లీ మళ్లీ సంభవిస్తూనే ఉంటాయి. ఇది వాతావరణ సమస్య కాకపోవచ్చు. కానీ, అడవుల నిర్మూలన అనేది జంతువుల నుంచి మానవుల వరకు మలేరియా, డెంగ్యూ, ఇతర ప్రాణాంతక వ్యాధుల వ్యాప్తికి అనుకూల పరిస్థితులను సృష్టించిందని శాస్త్రజ్ఞులు నమ్ముతున్నారు. కరోనా వైరస్‌ గబ్బిలాల నుంచి జంతువులకు, మానవులకు వ్యాపించిందని నమ్ముతున్నారు. ప్రకృతి వనరులను ఇష్టానుసారం ధ్వంసం చేసుకుంటూ పోతే కలిగే పర్యవసానాల గురించి ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ పత్రికలో డేవిడ్‌ క్వామెన్‌ నొక్కి చెప్పారు.

‘‘ఉష్ణమండల అరణ్యాలను, ఇతర వణ్యప్రాణులు నివసించే అటవీప్రాంతాలను మనం ఆక్రమించేశాం. ఇవి అనేక జంతువులు, వృక్షాలకు నెలవుగా ఉంటున్నాయి. ఈ జీవుల్లోనే అనేక తెలియని వైరస్‌లు ఉంటున్నాయి. మనం చెట్లను నరికేస్తాం; జంతువులను వధిస్తాం లేక బంధించి మార్కెట్లకు పంపుతాం. అంటే పర్యావరణవ్యవస్థలను మనం విచ్ఛిన్నం చేస్తున్నాం. అంతకుమించి వైరస్‌లు తాము సహజంగా ఉండే ప్రకృతి నెలవుల నుంచి వెలుపలికి వచ్చేలా మనం ప్రకృతిని కుళ్లబొడిచేస్తున్నాం. వైరస్‌ల నెలవులు కదిలిపోయినప్పుడు, హరించుకుపోయినప్పుడు ఆ వైరస్‌లు తమకు ఆశ్రయమిచ్చే కొత్త అతిథేయులను ఎంచుకుంటాయి. అదెవరో కాదు మానవులే’’.

మరొక సైలెంట్‌ కిల్లర్‌
ప్రపంచ వాతావరణ మార్పు అనే మరొక ప్రమాదం నిశ్శబ్దంగా ప్రపంచమంతటా వ్యాపిస్తోంది. తీవ్రమైన వేడి, తుపానులు, కరువులు, సముద్రమట్టాలు పెరగడం వంటి రూపాల్లో ఈ కొత్త ఉపద్రవం వ్యక్తం కావచ్చు. కానీ మానన జీవితంపై దీని ప్రభావమే వాస్తవమైనది. ఒక అంచనా ప్రకారం వాతావరణ మార్పు వల్ల ప్రతిసంవత్సరం 3 లక్షలమంది ప్రజలు మరణించారని, 32 కోట్ల 50 లక్షల మంది తీవ్రంగా ప్రభావితమయ్యారని ప్రతి ఏటా 125 బిలియన్‌ డాలర్ల ఆర్థిక నష్టాలు కలుగుతున్నాయని తెలుస్తోంది. ఇక భారతదేశంలో 2018–19 సంవత్సరంలోనే వరదలు, తుపానులు వంటి తీవ్రమైన వాతావరణ వైపరీత్యాల కారణంగా 2,400 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ చెబుతోంది. ప్రస్తుత కరోనా సాంక్రమిక వ్యాధి తగ్గుముఖం పట్టగానే ప్రపంచ నేతలందరూ తమ ఆర్థిక వ్యవస్థలను సాధారణ స్థాయికి తీసుకురావడం ఖాయం.

సాధారణ స్థాయి అంటే మునుపటిలా వాణిజ్యాన్ని యథాతథంగా కొనసాగించుకోవడమే అని భావించే ప్రమా దం పొంచుకుని ఉంది. అంతే తప్ప వీరు కరోనా వైరస్‌ నుంచి గుణపాఠాలు తీసుకోకపోవచ్చు కూడా. ఇంతవరకు ప్రపంచమంతటా కొనసాగుతూ వచ్చిన అపరిమిత అభివృద్ధి నమూనాపై కోవిడ్‌–19 ఇప్పుడు ప్రశ్నలు సంధించింది. ప్రకృతి వనరులు, మానవ వనరులను విచ్చలవిడిగా దోచుకోవడం ద్వారా అపరిమితమైన భౌతిక సంపదను సృష్టించడం కోసం పాటుపడే దురాశ కనీవినీ ఎరుగని కష్టాలను కొని తెస్తోంది. గాంధీజీ ఆనాడే చెప్పినట్లుగా, ‘మనిషి అవసరాలను సంతృ  ప్తిపరచడం భూమికి సాధ్యమవుతుంది కానీ ప్రతి మనిషి పేరాశలను కాదు. భూగ్రహం మంచి కోసం, భవిష్యత్‌ తరాల బాగు కోసం, ఆడంబర జీవిత విధానంపై మనం ఇప్పుడు పునరాలోచించాల్సి ఉంది. 

బహుళ సంక్షోభాలు
శిలాజ ఇంధనాలను మండించడంతో విషపూరిత వాయువులు విడుదలై మన గాలిని, నీటిని, భూమిని కూడా కలుషితం చేసిన నేపథ్యంలో మన ప్రాకృతిక వాతావరణం చాలావరకు ప్రమాదంలో పడిపోయింది. గ్రీన్‌ హౌస్‌ వాయువులను మోతాదుకు మించి వాతావరణంలోకి విడుదల చేయడంతో మన భూమి వేడెక్కడం ప్రారంభించింది. దీంతో వ్యవసాయ రుతువులు, పంటల క్రమం కూడా మార్పు చెందడం మొదలైంది. వరి, గోధుమ పంటల దిగుబడి తగ్గిపోయింది. సముద్రమట్టాలు పెరిగి కొన్ని తీరప్రాంతాలు, దీవులను ముంచేశాయి. అడవులకు నిప్పు పెట్టడంతో కాలిఫోర్నియా నుంచి ఆస్ట్రేలియా వరకు లక్షలాది హెక్టార్లలో ఉన్న అడవుల ఉనికే ప్రమాదంలో పడిపోయింది. ‘స్మాల్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ గ్రంథకర్త ఇ.ఎఫ్‌. షూమేకర్‌ చెప్పినట్లుగా, ప్రపంచం మూడు విధాల సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

‘వనరుల సంక్షోభం, పర్యావరణ సంక్షోభం, సామాజిక సంక్షోభం.’ కొంతమంది ఆధ్యాత్మికవాదులైతే, మానవులు ప్రకృతిపట్ల కఠినంగా వ్యవహరిస్తూ, సహజవనరులను మితిమీరి దోచుకుంటున్నందువల్ల ప్రకృతి ఇప్పుడు పగ తీర్చుకుంటోందని విశ్వసిస్తున్నారు. మనం ప్రపంచ వనరులకు యజమానులం కాదు. దాని ట్రస్టీలం మాత్రమే. భూగ్రహాన్ని ఆరోగ్యకరంగా ఉంచి దాన్ని భవిష్యత్‌ తరానికి అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. అయితే, ప్రస్తుత అభివృద్ధి పంథాను ఇలాగే కొనసాగిస్తే, మరికొన్ని దశాబ్దాలలోపే ప్రకృతి సహజ వనరులన్నింటినీ మనం ధ్వంసం చేయటం ఖాయం. 

ముందడుగు వేయడమెలా? 
మనం జీవిస్తున్న విధానం గురించి తాజాగా ఆలోచించుకోవడానికి, పర్యావరణంతో దాని జీవరాసులతో మన సంబంధాలను పునర్నిర్మించుకోవడానికి కోవిడ్‌–19 మనకు ఇప్పుడు సువర్ణావకాశాన్ని కల్పించింది. ఇప్పుడు కింద పేర్కొన్న అంశాలకు అనుగుణంగా పనిచేయవలసిన లేక వాటిలో కొన్నింటినయినా పాటించాల్సిన సమయం ఆసన్నమైంది. 1. మొక్కల పెంపకాన్ని భారీస్థాయిలో చేపట్టాలి. భూమిని వృక్షాలతో కప్పి ఉంచినట్లయితే అది పర్యావరణ మార్పును, భవిష్యత్‌ సాంక్రమిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించగలుగుతుంది. ప్రభుత్వం మాత్రమే ఈ పనిని చేయలేదు. ఇది ప్రజా ఉద్యమంగా సాగాలి. భారతదేశంలో వృక్షాల శాతం 2000లో 12.3 శాతం ఉండగా 2018 నాటికి అది 10.6 శాతానికి పడిపోయింది. గత సంవత్సరం ఉత్తరప్రదేశ్‌లో పది లక్షల మంది ప్రజలు ఒక్క రోజులో 22 కోట్ల మొక్కలను నాటి ప్రపంచ రికార్డ్‌ సృష్టించారు. ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తే అది భారత్‌లో అడవులను ఒక శాతం పెంచేందుకు దారితీస్తుంది.

2. వచ్చే 15 సంవత్సరాల కాలంలో శిలాజ ఇంధనాల స్థానంలో విద్యుత్‌ ఉత్పత్తిని తీసుకురావాలి. పునర్వినియోగ ఉత్పత్తుల సమ్మేళనంతో చమురు వినియోగాన్ని తొలగించాలి. 3. పట్టణ ప్రాంతాల్లో వర్షపునీటిని నిల్వచేయాలి. అటవీ ప్రాంతాల్లో వాటర్‌ షెడ్‌ నిర్వహణను తప్పనిసరిగా అమలు చేయాలి. త్వరలో మనకు తాగునీరు కూడా లభ్యం కాకపోవచ్చు. 4. ప్రజారవాణాను ప్రోత్సహించి, ప్రైవేట్‌ కార్ల ఉపయోగాన్ని తగ్గించాలి. కార్ల ఉత్పత్తిదారులకు ఇచ్చే సబ్సిడీలను పబ్లిక్‌ బస్సులు, రైళ్ల తయారీకి మళ్లించాలి. 5. వాతావరణ సంక్షోభంపై అప్రమత్తతను పెంచాలి. పాఠశాలల్లో వాతావరణం గురించి క్లాసులు ప్రవేశపెట్టాలి. 6. ఎలెక్ట్రిసిటీ గ్రిడ్‌పై ఆధారపడటాన్ని తగ్గించి విద్యుత్తును వికేంద్రీకరించాలి. సోలార్‌ ఇతర పునర్వినియోగ ఇంధనాలను ఉపయోగించేలా సమాజాలను ప్రోత్సహించాలి. 7. భూమికి ఉపశమనం కలిగించి వాతావరణ మార్పును సర్దుబాటు చేయడానికి నిధులను పెంచాలి. మన జీవితాలను మార్చుకునే ఎన్నో అవకాశాలు మన చేతుల్లోనే ఉన్నాయి. కోవిడ్‌–19 వంటి ప్రకృతి వైపరీత్యాలను నిరోధించడానికి, ప్రకృతి పర్యావరణాన్ని కాపాడటానికి మన ప్రయాణాన్ని కొత్తగా ప్రారంభించేందుకు ఇదే తగిన తరుణం. హోమో సెపియన్‌ బుద్ధిజీవులుగా మనకు అసాధ్యమైనది ఏదీలేదు.

మోహన్‌ రెడ్డి, సంస్థాపకుడు,
జెనీత్‌ ఎనర్జీ క్లైమేట్‌ ఫౌండేషన్, హైదరాబాద్‌
డాక్టర్‌ డిసిల్వా, వ్యవసాయ, పర్యావరణ సైంటిస్టు, ముంబై 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top