అవును... కోవిడ్‌తో సహజీవనం తప్పదు

Soumya Swaminathan Article On Corona Pandemic - Sakshi

సందర్భం

కోవిడ్‌–19 పూర్తిగా తగ్గిపోతుందా, పెరుగుతుందా అనేది కాలమే చెబు తుందనీ; అది ఇప్పటికే బాగా వ్యాపించినందున దానితో మనం సహజీవనం చేయక తప్పదనీ చెబు తున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి వ్యాప్తి, నియంత్రణల గురించి ఆమె పలు విషయాలు పంచుకున్నారు.

కోవిడ్‌–19కు మందుగానీ, వ్యాక్సిన్‌గానీ ఎంత త్వరలో రానుంది?
సాధారణంగా ఒక వ్యాక్సిన్‌ను తయారుచేయడానికి పదేళ్లు పడుతుంది. కాలక్రమం గమనిస్తే– ఎబోలా వ్యాక్సిన్‌ రూపొందించడానికి ఐదేళ్లు పట్టింది; జైకా రెండేళ్లలోపే సమయం తీసుకుంది, కానీ అప్పటికే జైకా సమస్య తీరి పోయింది. పన్నెండు నెలల లోపే వ్యాక్సిన్‌ అభివృద్ధి చేసి, ఆ రికార్డు బద్దలుకొట్టాలనే ఆశాభావంతో ఉన్నాం. అదే గనక జరిగితే అబ్బురపరిచే విజయం కాగలదు. అలా జరగాలంటే ఉన్న ఏకైక మార్గం, సంస్థలు పోటీపడటం కాకుండా పర స్పర సహకారంతో పనిచేయాలి. నూటికి మించిన సంస్థలు వ్యాక్సిన్‌ అభివృద్ధిలో వివిధ దశల్లో ఉన్నాయి. ఇందులో ఏడు మనుషుల మీద ప్రయోగాల్లో మొదటి దశలో ఉన్నాయి. (మోదీ ట్విట్టర్తో అమెరికా కటీఫ్)

చైనా, అమెరికా, జర్మనీల్లో రెండేసి; బ్రిటన్లో ఒకటి. ఇండియాలో చాలా సంస్థలు ప్రి–క్లినికల్‌ దశలో ఉన్నాయి. ఇది కొత్త వ్యాక్సిన్‌ కాబట్టి, ఎంత సురక్షితం అనేదానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి; అదే సమయంలో కోవిడ్‌–19 మీద ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందన్నది రుజువు కావాలి. అన్నీ అనుకున్నట్టు జరిగితే 2021 తొలి నాళ్లకల్లా వ్యాక్సిన్‌ సిద్ధం అవుతుంది.

అంటువ్యాధి ఇదివరకే వ్యాపించివున్నందున ఇక దాన్ని కట్టడి చేయలేమని కొందరు ఊహిస్తున్నారు. శాస్త్రీయంగా ఈ భావన ఎంత సరైనది?
ఆఫ్రికాలోనూ, ఇండియాలోనూ అంటువ్యాధి వ్యాప్తి తక్కు వగా ఉండటానికి గల కారణాలు ఏమిటన్నదానికి ఎన్నో వాదనలున్నాయి. కానీ స్పష్టమైన జవాబే లేదు. భౌతిక దూరం పాటించడం లాంటి చర్యల్ని కచ్చితంగా అమలు చేసిన కొన్ని దేశాల్లో ఇది తగ్గుముఖం పట్టడం చూస్తున్నాం. దేశాలు లాక్‌డౌన్లను ఎత్తివేయడం మొదలైంది కాబట్టి, అది మళ్లీ ఎంత బలంగా  వెనక్కి వస్తుందో చూడాలి. వైరస్‌ ఎలా ప్రవర్తిస్తుందో మనకు తెలియదు కాబట్టి ఆ ప్రమాదం అయితే ఉంది. అది పూర్తిగా తగ్గిపోయి, మళ్లీ వచ్చే చలి కాలానికి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. లేదా, లాక్‌డౌన్‌ ఎత్తేయగానే పెరగొచ్చు. స్పష్టంగా చెప్పగలిగేది ఒకటే మంటే, అంటువ్యాధి ఇప్పటికే బాగా వ్యాపించివున్నందున అది మనతో ఉంటుంది. తగ్గుతుందా పెరుగుతుందా అనేది కాలమే జవాబు చెప్పగలదు.

లాక్‌డౌన్‌ను ఎత్తివేయడానికి అనుసరించాల్సిన శాస్త్రీయ విధానాలు ఏమైనా ఉన్నాయా?
బాగా ఆలోచించి అమలుచేసే వ్యూహం అయితే ఉండాలి. మొదటిది, అది దశలవారీగా జరగాలి. తర్వాతిది, ప్రజా రోగ్య వ్యవస్థను కట్టుదిట్టం చేసుకోవాలి, టెస్టుల సంఖ్య పెరగాలి. బాధితులను చురుగ్గా గుర్తించడం, వారిని వేరుగా ఉంచడం, చికిత్స చేయడం; వీరితో సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించి క్వారంటైన్‌లో ఉంచడం, వారి మీద పూర్తి నిఘా పెట్టడం జరగాలి. ఇక్కడ ప్రజల భాగస్వామ్యం, సహ కారం నిర్ణయాత్మకమైనది. కేరళ ఈ విషయంలో విజయ వంతం కావడానికి కారణాలు అక్కడ అక్షరాస్యత ఎక్కువగా ఉండటం, ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసం ఉండటం. స్వీడన్‌ లాక్‌డౌన్‌ అమలు చేయలేదు. (కరోనా నివారణలో ముందంజ)

ప్రజలకూ ప్రభుత్వానికీ మధ్య పరస్పర నమ్మకం ఉంది. అక్కడ ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమా ఉంది, వాళ్లకు మెరుగైన వైద్యం లభిస్తుంది. వారివి అన్నీ చిన్న కుటుంబాలు. ముసలివాళ్లు వృద్ధాశ్ర మాల్లో ఉంటారు. ఇండియా, ఇంకా ఇతర అభివృద్ధి చెందు తున్న దేశాల్లో ఇదంతా భిన్నంగా ఉంటుంది. మనవి ఉమ్మడి కుటుంబాలు కాబట్టి, పెద్దవాళ్లను వేరుగా ఉంచడం కష్టం. కాబట్టి దీనికి ఒక సమతుల్యంతో కూడిన విధానం కావాలి. నేననుకోవడం, నియంత్రణలో ఉండేంత తక్కువ కేసులు ఉంచుకోవడం అనేది ప్రస్తుతం చాలా దేశాల లక్ష్యం అయి వుంటుంది. అప్పుడు మాత్రమే ఆరోగ్య వ్యవస్థ కుప్పకూల కుండా ఉంటుంది.

వైరస్‌ మూలం గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయం ఏమిటి?
ఉన్న సాక్ష్యాలు బలంగా సూచించేదేమంటే అది ఒక జంతువు నుంచి వచ్చింది. దాని జన్యుక్రమాన్ని చూసి శాస్త్రవేత్తలు ఇట్టే చెప్పేయగలరు. చాలావరకు అది గబ్బిలాల నుంచి వ్యాపించి వుంటుంది. గబ్బిలాల కరోనా వైరస్‌కూ కోవిడ్‌–19కూ సామ్యాలున్నాయి. లేదా అది ఇంకో జంతు వుకు సోకి అక్కడినుంచి వ్యాపించిందా, అయితే ఆ జంతు వేమిటి? దీన్ని గుర్తించే విషయంలో మేము చైనా నిపు ణులకు పూర్తి సహకారం అందిస్తున్నాం. అలాగే ఇది వ్యాప్తి చెందడానికి అనుకోకుండా వైరస్‌ బయటపడిన ఒక విడి ఘటన కారణమా, చాలాసార్లు జరిగిందా అన్నదీ తేలాలి. ఈ అవగాహనే దీన్ని నియంత్రించడంలో ఉపయోగ పడుతుంది.

మలేరియా మందులను దీనికి వాడటంలో ఇండియా ఏమైనా ముందడుగు వేయాల్సిందా?
మందుల్ని ఎలా వాడాలనేది ప్రతి దేశం దానికదే నిర్ణయిం చుకుంటుంది. మనకు మొదటినుంచీ ఉన్న స్థితి ఏమంటే– నివారించడానికి గానీ చికిత్సచేయడానికీ గానీ తగిన ఆధా రాలు లేవు. కాబట్టి అత్యుత్తమ నాణ్యతతో కూడిన పరిశోధన జరగాలని సూచించాం. హెల్త్‌కేర్‌ వర్కర్లకూ, అంటువ్యాధి ప్రబలే అవకాశం ఉన్నవారికీ హైడ్రాక్సిక్లోరోక్విన్‌ (హెచ్‌సీ క్యూ) ఇవ్వడానికి ముందూ, ఇచ్చిన తరువాతా మారిన రోగ నిరోధకతను తెలుసుకోవడానికి రెండు పెద్ద కేంద్రాల్లో బహు ముఖ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఫలితాల ఆధా రంగా సిఫారసులు జరగాలి. ఇండియాకు సంబంధించి నంత వరకూ హెచ్‌సీక్యూ సాఫల్యత ఎంతనేది ఐసీఎంఆర్‌ అధ్యయనం చేయగలదు. హెల్త్‌కేర్‌ వర్కర్లు నుండి డేటా సేకరించడానికి పలు మార్గాలున్నాయి, దానిద్వారా అది ఎంత బాగా పనిచేసిందనే సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

ఆర్థిక సాయాన్ని ఉపసంహరించుకుంటానన్న అమెరికా నిర్ణయం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందన ఏమిటి?
అమెరికా నిర్ణయం పట్ల విచారిస్తున్నాం. ఆర్థిక వనరుల విషయంలోనే కాదు, సాంకేతికంగానూ సుదీర్ఘకాలంగా గట్టి సహకారాన్ని ఇస్తున్న ఉదార మిత్రదేశం అమెరికా.
భవిష్య త్‌లోనూ అమెరికా తన సహకారం కొనసాగిస్తుందని ఆశిస్తున్నాం.

సౌమ్య స్వామినాథన్‌ 
(టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా సౌజన్యంతో)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top