చైనాలో బయటపడిన మరో వైరస్‌!

Amid Coronavirus Threats Named Hantavirus Comes To Light - Sakshi

బీజింగ్‌: మహమ్మారి కోవిడ్-19ను సమర్థవంతంగా ఎదుర్కోలేక, వ్యాక్సిన్‌ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియక ప్రపంచ మానవాళి బెంబేలెత్తుతోంది. ఈ తరుణంలో చైనాలో మరో ప్రాణాంతక వైరస్‌ బయటపడినట్టు ఓ మీడియా రిపోర్టు వెల్లడించింది. హంటా వైరస్‌గా పిలవబడే ఈ వైరస్‌ బారిన పడి చైనాలోని యునాన్‌ ప్రావిన్స్‌లో ఓ వ్యక్తి ప్రాణాలు విడిచాడని గ్లోబల్‌ టైమ్స్‌‍ మీడియా సంస్థ పేర్కొంది. హంటా వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయిన కొన్ని గంటల వ్యవధిలోనే అతను చనిపోవడం కలకలం రేపుతోంది.
(చదవండి: చైనాపై అమెరికన్‌ లాయర్‌ కేసు)

గ్లోబల్‌ టైమ్స్‌ ప్రకారం.. ఓ వ్యక్తికి హంటా వైరస్‌ లక్షణాలు బయటపడటంతో నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించారు. అతనికి హంటా వైరస్‌ పాజిటివ్‌గా సోమవారం నిర్ధారణ అయింది. అయితే, అతడు పని నిమిత్తం షాండాంగ్‌ ప్రావిన్స్‌కు చార్టర్డ్‌ బస్సులో పయమవ్వగా దారిలోనే ప్రాణాలు విడిచాడు. ఇంకో షాకింగ్‌ విషయమేంటంటే.. మరో 32 మంది కూడా ఇదే వైరస్‌ బారిన పడినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, అయితే, వారి రిపోర్టులు రావాల్సి ఉంది.

కాగా, సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఈ వార్త ప్రజల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో చైనాలోని ‘వ్యాధుల నియంత్రణ, నివారణ సెంటర్‌’ హంటా వైరస్‌కు సంబంధించిన పలు వివరాలు తెలిపింది. ‘హంటా వైరస్‌ ఎలుకల ద్వారా మనుషులకు వ్యాపించే వ్యాధి. ఇంట్లో, పరిసరాల్లో ఎలుకలు లేకుండా చూసుకుంటే మంచిది. ఆరోగ్యవంతులకు కూడా ఈ వైరస్‌ సోకితే ప్రమాదమే. అయితే, ఇది అంటువ్యాధి కాదు. మనుషుల నుంచి మనుషులకు వ్యాపించదు. కేవలం ఎలుకల లాలాజలం, వాటి గూళ్లు, ఎలుకల వ్యర్థాలు తాకినపుపడు వైరస్‌ మన చేతుల్లోకి చేరుతుంది. క్రిములు చేరిన చేతులతో సదరు వ్యక్తి కళ్లు, ముక్కు నోటిని తాకితే వైరస్‌ ఒంట్లోకి ప్రవేశిస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు కూడా కోవిడ్‌-19 మాదిరిగానే ఉంటాయి. జ్వరం, తలనొప్పి, కడుపునొప్పి, కండరాల నొప్పి, వాంతులు, డయేరియా.. ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది.’
(చదవండి: జీవభౌతిక శాస్త్రవేత్త మైఖేల్‌ లెవిట్‌ అంచనా)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top